యాడుండావు నాయనా..!

ABN , First Publish Date - 2020-07-11T09:55:52+05:30 IST

కట్టుకున్న భర్త గుండెపోటుతో కాలం చేశాడు..

యాడుండావు నాయనా..!

మూడేళ్లుగా బిడ్డకోసం ఎదురుచూపు


మైదుకూరు(కడప): కట్టుకున్న భర్త గుండెపోటుతో కాలం చేశాడు. 14 ఏళ్లు అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు స్కూలుకని వెళ్లి మాయమైపోయాడు. మూడేళ్లుగా ఆ కొడుకుకోసం తల్లి ఎదురుచూస్తూనే ఉంది. కనిపించినవారికంతా తన కొడుకు ఫొటో చూపించి అచూకీ కనిపెట్టమని వేడుకుంటోంది. కొత్తనంబర్‌ నుంచి ఎవ్వరు ఫోన్‌ చేసినా తన బిడ్డే అని  ఆ తల్లి ఆశపడుతోంది. వివరాలిలా..


మైదుకూరు పట్టణం శ్రీరామ్‌నగర్‌కు చెందిన దస్తగిరి, మీరాంబీ దంపతులు సైకిల్‌పై ఊరూరా తిరుగుతూ పసుపు కొమ్ములు కొనుగోలు చేసుకొని తిరిగి అమ్ముకుంటూ జీవనం గడిపేవారు. వీరికి పిల్లలు పుట్టలేదు. 14 ఏళ్ల క్రితం ఎవరో కనిపడేసిన ఓ మగ పసికందు కన్పించడంతో తమకు అల్లాయే ఆ బిడ్డను ఇచ్చాడని భావించారు. ఆ బిడ్డను తెచ్చుకుని షాజిత్‌ రెహమాన్‌ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచారు. బాగా చదువుకుని ప్రయోజకుడు అవుతాడని భావించారు. నంద్యాలలో హాస్టల్‌లో ఉంచి 7 వ తరగతి వరకు చదివించారు. 8వ తరగతికి కడపలోని ఓ కార్పోరేట్‌ స్కూల్లో చేర్పించారు.


2017లో భర్త దస్తగిరికి గుండెపోటు వచ్చి మృతిచెందాడు. అదే ఏడాది క్రిస్మస్‌ సెలవుల నిమిత్తం రెహమాన్‌ ఇంటికి వచ్చాడు. సెలవులు అయిపోగానే తిరిగి పాఠశాలకు వెళ్తున్నానని అమ్మకు చెప్పి 26 డిసెంబర్‌ 2017న కడపకు వెళ్లాడు. ఇక అంతే... రెహమాన్‌ పాఠశాలకు వెళ్లలేదు. ఎక్కడికెళ్లాడో తెలీదు. ఇంటికి తిరిగి రాలేదు. దిక్కు తోచని పరిస్థితిలో మీరాంబీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు తరచూ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి వాకబు చేస్తూనే ఉంది. తన బిడ్డకోసం ఎదురుచూస్తూనే ఉంది.


భర్త మృతి చెంది.. బిడ్డ మాయమై..

కట్టుకున్న భర్త దస్తగిరి గుండెపోటుతో మృతిచెందాడు. 14 ఏళ్లు పెంచుకున్న కొడుకు ఏమయ్యాడో తెలీదు. దగ్గరి బంధువులూ ఎవ్వరూ లేరు. కనిపించకుండా పోయిన కొడుకు వస్తాడనే ఆశతో.. యాభై ఏళ్ల మీరాంబీ ఎప్పుడూ ఇంటి గుమ్మంలో కూర్చుని ఎదురుచూస్తూ ఉంటుంది. ఈమెకు ఆరోగ్యమూ సరిగా లేదు. ఎక్కడైనా తన బిడ్డ కన్పిస్తే 9704714871 నెంబరుకు ఫోన్‌ చేయాలని కనపడిన వారందరికీ కొడుకు ఫొటో చూపిస్తూ వేడుకుంటోంది. కొత్త నెంబరు నుంచి ఎవ్వరు ఫోన్‌ చేసిన ‘‘హాఁ.. బేఠా కాం హైరే.. ఆరే’’ అంటూ మాట్లాడుతోంది. కొడుకు కాదని తెలుస్తానే ‘‘నా బిడ్డ కన్పించాడా’’ అంటూ అడుగుతోంది. ఒంటరిగా, మనోవేదనతో ఉన్న ఆ అమ్మకు తన కొడుకు చేరువకావాలని ఆశిద్దాం.

Updated Date - 2020-07-11T09:55:52+05:30 IST