తీర్పు వచ్చేదాకా తగువులాపండి!

ABN , First Publish Date - 2021-08-05T08:00:13+05:30 IST

తెలంగాణ వారికే కృష్ణా జలాలలో సింహభాగం దక్కాలని, పాత వాటాలని సమూలంగా పెరికివేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావించడం వల్లనే ఇప్పుడు...

తీర్పు వచ్చేదాకా తగువులాపండి!

తెలంగాణ వారికే కృష్ణా జలాలలో సింహభాగం దక్కాలని, పాత వాటాలని సమూలంగా పెరికివేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం భావించడం వల్లనే ఇప్పుడు ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య లోపిస్తోంది. బచావత్ ట్రిబ్యునల్ ఇరు రాష్ట్రాలలోని ప్రాజెక్టుల నీటి అవసరాలను క్షుణ్ణంగా పరిశీలించాకే జలాల వాటాలను నిర్ణయించింది. ఈ వాటాల పరిమాణాలకు మిగతా ఇద్దరి కక్షిదారుల అంగీకారం ఉండేటట్టు కూడా ట్రిబ్యునల్ చూసింది. ఏ ప్రాతిపదికన నీటి పంపిణీ జరగాలన్న అంశంపై విస్తృత చర్చ జరిగి ఏకాభిప్రాయం సాధించాక మాత్రమే ట్రిబ్యునల్ ముందుకుసాగింది. ఇది జరిగి యాభై ఏళ్లు అయ్యాక ఇంకొక ట్రిబ్యునల్ కూడా తిరిగి అన్ని అంశాలనూ పరిశీలించి పాత వాటాలలో మార్పు అవసరం లేదనే భావించింది. ఇప్పుడు 'మేం కొత్తగా పుట్టుకొచ్చాం, పాత తీర్పులు ఒప్పుకోం, కథ మళ్లా మొదలుపెట్టండి' అని తెలంగాణ, తెలంగాణపై సానుభూతి గలవారు వాదిస్తున్నారు. ఈ వాదనలకు ప్రాతిపదికగా వెనకటి వాటా నిర్ణయాలకు దారితీసిన ఆధారాల్ని ప్రశ్నిస్తున్నారు. వాటికి హేతుబద్ధత లేదని అంటున్నారు.


బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఎవరు చదివినా అదొక విస్తృతమైన పరిశోధనా అభ్యాసం అనే భావిస్తారు. అప్పటికి అమలులో ఉన్న జలవివాదాల పరిష్కార చట్టాలను, అంతర్జాతీయ వాడుకలను, ఆచారాలను పరిగణనలోకి తీసుకుని, ముఖ్యంగా ముగ్గురి పోటీదార్ల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించి ట్రిబ్యునల్ వాటాల నిర్ణయాలు చేసింది. ఆ నిర్ణయాల వెనుక ఉన్న కొన్ని మూల సూత్రాలను, భావనలను చూద్దాం. నది అన్నది ఒక అవిభాజ్య ఏకైక రూపం. నదీతీరాన ఉన్న రాష్ట్రాలు ఆ నది మీద శాశ్వతంగా పరస్పర ఆధారితులు. వారి మధ్య విభేదాలు ఒడంబడికల ద్వారా, తీర్పుల ద్వారా లేక పరిపాలనా నియంత్రణల ద్వారా పరిష్కారం కావాలి. ఒక రాష్ట్రం అనేది ఒక వివాదంలో ఆ రాష్ట్రంలోని నివాసితులకూ నీటి వినియోగదారులకూ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆ రోజుకి అమలులో ఉన్న పథకాలు కానీ అమలులోకి రాబోతున్న పథకాలు కానీ వాటిలో నీటి వినియోగం జరుగుతున్నట్టుగా పరిగణించాలి. ట్రిబ్యునల్ సంబంధిత రాష్ట్రాల హక్కులను సమ దృష్టితో చూసి న్యాయం జరిగేలా చూస్తుంది. సమాన హక్కులంటే నీటిని సమభాగాలుగా పంచటం కాదు, న్యాయబద్ధమైన పంపకం జరిగేలా చూడటం. రాష్ట్రాలకు పంచే నీరు ప్రయోజనకరమై ఉండాలి. సాంకేతికంగా డెల్టా, బేసిన్ బయట ఉన్నా అక్కడి నేల సారవంతమైనది. పూర్తిగా నదిపై ఆధారపడి ఉంది. ఒక చోట ప్రారంభమైన, దశాబ్దాలుగా జరిగిన అభివృద్ధిని ఉపేక్షించి ఇంకొకచోట అభివృద్ధికి పీట వేయటం వలన అధిక ఆర్థిక అభివృద్ధి లభించదు. ఇంతకు ముందే నదిని బేసిన్ బయటికి మళ్ళించి ప్రయోజనాలను పొందిన తర్వాత ఆ ప్రాంతాన్ని విస్మరించలేం. సాధారణంగా బేసిన్ బయట, లోపల అప్పటికే జరుగుతున్న నీటి వాడుకలను ఒకే కొలబద్దతో చూడాలి. ఉదాహరణకు బేసిన్ బయట ఉన్న ఒక జన సమృద్ధి గల నగరానికి తాగు నీటి సరఫరా జరుగుతున్నప్పుడు అది ఆపి బేసిన్ లోపల వేరే ఉపయోగానికి మళ్ళించటం అన్యాయం అవుతుంది. దశాబ్దాలుగా బేసిన్ బయటికి నీటిని మళ్ళించి ప్రయోజనాలనుపొందుతున్నారు. ఇది చట్టబద్ధం. కృష్ణా నదిలో లభ్యమయ్యే నీరు అందరి అవసరాలను తీర్చలేదు. బచావత్ ట్రిబ్యునల్ ఇలా సుదీర్ఘ వివరణలు ఇచ్చింది. ట్రిబ్యునల్ 1960నాటికి అమలులో ఉన్న నీటి వినియోగాలకు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల నీటి వినియోగాలకి రక్షణ కల్పించింది.


కేటాయింపులు అశాస్త్రీయమైన పద్ధతులను అనుసరించి చేసారనీ వర్షపాత మార్పులను పరిగణనలోకి తీసుకోలేదనీ బిక్షం గుజ్జా అంటున్నారు (జులై 9th, జులై 20th– ఎడిట్ పేజ్, ఆంధ్రజ్యోతి). డెబ్భై అయిదు శాతం విశ్వసనీయత అంటేనే మిగతా సంవత్సరాలలో లోటు వర్షపాతమని అర్థం. దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‍కి కారీఓవర్ స్టోరేజ్ కేటాయింపు, మిగులు జలాల వినియోగ వెసులుబాటు లోటు సంవత్సరాలలో వచ్చే ఇబ్బందులను తొలగించడానికే. కేటాయింపులకు అనుసరించిన విధానాలని వివరంగా ప్రతి ట్రిబ్యునల్ చెబుతూనే ఉన్నాయి. ట్రిబ్యునల్స్ అంతర్జాతీయ అభ్యాసాలను, సంప్రదాయాలను కూడా పరిగణలోకి తీసుకున్నాయి. మొదటి ట్రిబ్యునల్ తమ తీర్పుని ఇంకొక ట్రిబ్యునల్ సమీక్ష చేసినప్పుడు అటువంటి అభ్యాసం వీలైనంతవరకు ఏ రాష్ట్ర వినియోగాలను వారి మొత్తం కేటాయింపుల పరిధిలో ఉన్నప్పుడు వాటిని భంగపరచవద్దని చెప్పింది. రెండవ ట్రిబ్యునల్ 47 సంవత్సరాల నీటి లభ్యత పరంపరలను రాష్ట్రాలు విడి విడిగా తయారుచేసిన సమాచారాన్ని పరస్పరం ఇచ్చి పుచ్చుకున్నాక నిర్ణయించింది. విస్తృత సమీక్ష అన్ని అంశాల మీద జరిపాక కూడా ఉన్న కేటాయింపులలో మార్పులు చేయలేదు. కారీవొవర్ స్టోరేజ్ కేటాయింపు వద్దని మహారాష్ట్ర, కర్ణాటక వాదించినా రెండవ ట్రిబ్యునల్ దానిని మార్చలేదు.


నదీ పరీవాహకప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నదనీ, తమ అవసరాలన్నీ బేసిన్ లోపలే ఉన్నాయి అని తెలంగాణ వాదిస్తోంది. ఈ వాదనతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో తమకి అన్యాయం జరిగిందని చెబుతూ ప్రస్తుత ట్రిబ్యునల్ ముందు తమ వాటా పెంచాలని వాదించారు. అంతే కాకుండా అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం సెక్షన్ 3 ప్రకారం ఇది నాలుగు రాష్ట్రాల మధ్య వివాదమనీ, దీన్ని అలా పరిగణించి మొత్తం నీటిని పునఃపంపిణీ చేయాలనీ వాదించారు. కానీ ఈ వాదనలను ట్రిబ్యునల్ తన అక్టోబర్ 2016 తీర్పులో తోసిపుచ్చింది. ఇది తెలంగాణ ప్రభుత్వానికి తెలిసి కూడా ఇప్పుడు అనవసరమైన యాగీ చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణ తరఫున కాడి మోసేవారందరూ ఈ తీర్పును చదువుకుంటే మేలు. చివరికి సీనియర్ అయ్యేస్ ఆఫీసర్లు కూడా న్యాయస్థానాల తీర్పులను మరిచి మాట్లాడుతున్నారు. మొన్నటిదాకా తెలంగాణ ముఖ్య కార్యదర్శిగా పని చేసి రిటైర్ అయిన శైలేంద్ర కుమార్ జోషి గారు ఒక తెలంగాణా తెలుగు పత్రికకు ఇచ్చిన భేటిలో చక్కగా వివరించారు. నీటి కేటాయింపులపై అసంతృప్తితో ఉన్న రాష్ట్రం న్యాయ పోరాటానికి దిగి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటే నియంత్రణ సంస్థ (బోర్డు) ఎలాంటి కార్యాచరణ చేపడుతుందీ అన్నది కీలకాంశం అన్నారు. తెలంగాణ న్యాయస్థానం తీర్పు రాకుండానే ఆ తీర్పు తమకు అనుకూలం అనుకోండి అంటోంది. ఇది బాధ్యతారహిత ప్రవర్తన అవుతుంది. అయినా వారికి ఎక్కువ నీరు కావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఎందుకు నష్టపోవాలి. విభజన మూలాన ఇప్పటికే నష్టపోయి ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను మరింత అస్థిరపరచాలని చూడటం అన్యాయం. ఆంధ్రప్రదేశ్‍కి నీటి కేటాయింపులు రాజకీయ లబ్ధి ద్వారా లభించలేదు. న్యాయ ప్రక్రియ ద్వారా సంప్రాప్తించాయి. కనుక చేతనయితే న్యాయ పోరాటంతోనే సాధించాలి. ఆ తీర్పులు వచ్చేదాకా అనవసర రాద్ధాంతం మానేయాలి. 


ఇక క్లుప్తంగా బోర్డుల పరిధి గురించి. నోటిఫికేషన్ గమనిస్తే బోర్డు ఆబగా అన్ని ప్రాజెక్టులను నెత్తికెత్తుకుంటోంది. రెండు ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్లను, నీరు బయటికి పోయే వాటి అన్ని మార్గాలను ఆధీనంలోకి తీసుకుంటే చాలు. విద్యుచ్ఛక్తి యూనిట్ల ఇన్లెట్ మార్గాల ఆధీనం చాలు. కృష్ణా నది నుంచి నేరుగా నీటిని తోడే పంప్ హౌసులన్నిటినీ బోర్డు ఆధీనంలోకి తెచ్చుకోవాలి. మిగతా చోట్ల వినియోగాలపై నిరంతర దృష్టి సారిస్తే చాలు. గోదావరిపై ఇప్పటిలాగే కర్ర పెత్తనం సరిపోతుంది. చాలా పెద్ద వార్షిక బడ్జెట్ ప్రతిపాదించారు. రాష్ట్రాలు నిర్వహణ ఖర్చులు వచ్చేసరికి ప్రాధాన్యత తగ్గించేస్తాయి. ఇప్పటివరకు నిర్వహణ లోపాలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు బోర్డు అటువంటి పరిస్థితిని తనకు తనే కల్పించుకుంటోంది. ఇంత హడావుడి చేసి డ్యాములను వారి ఆధీనంలోకి తీసుకొని కీలకమైన వరద నియంత్రణ భాద్యతను తిరిగి రాష్ట్రాలపై నెట్టింది. ఒక విధంగా బోర్డే కేంద్ర జల సంస్థకి అత్యవసర సమాచార మార్పిడికి సామీప్యంలో ఉంటుంది. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు వచ్చాక, గోదావరి మీద ప్రాజెక్టువారీ కేటాయింపులు ఖరారు అయ్యాక, అవసరమైతే మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. 

కురుమద్దాలి వెంకట సుబ్బారావు

Updated Date - 2021-08-05T08:00:13+05:30 IST