లడఖ్‌ వంటకాల రారాణి వాగ్మో!

ABN , First Publish Date - 2021-01-11T05:58:43+05:30 IST

వాగ్మో ఊరు ఆల్చి. లెహ్‌ టౌన్‌కు 66 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడే వాగ్మో తన ఆల్చి కిచెన్‌ని ప్రారంభించారు.

లడఖ్‌ వంటకాల రారాణి వాగ్మో!

ఒక మహిళ అందులోనూ కశ్మీర్‌ ప్రాంతానికి చెందిన మహిళ చెఫ్‌గా రాణించడం సాధారణ విషయం కాదు. కానీ నిల్జా వాగ్మో సాధించారు. లడఖ్‌ వంటకాల ఘుమఘుమలను అందరికీ పరిచయం చేసి మహిళలు ఏ రంగంలోనూ తీసిపోరని నిరూపించారు. రాష్ట్రపతి  చేతుల మీదుగా నారీశక్తి పురస్కారాన్ని అందుకున్నారు. తన విజయానికి స్ఫూర్తి అమ్మే అని అంటున్న వాగ్మో మరిన్ని విశేషాలు ఇవి.


వాగ్మో ఊరు ఆల్చి. లెహ్‌ టౌన్‌కు 66 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడే వాగ్మో తన ఆల్చి కిచెన్‌ని ప్రారంభించారు. పుట్టకముందే వాగ్మో తండ్రిని కోల్పోయారు. దీంతో కుటుంబ భారం ఆమె తల్లి భుజాలపై పడింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల తన కళాశాల విద్యకు వాగ్మో మధ్యలోనే స్వస్తి చెప్పారు. ‘మా అమ్మ నన్ను కడుపుతో ఉన్నప్పుడు మా నాన్న ఏదో జబ్బుతో చనిపోయారు. మా నాన్నను నేను చూడనే లేదు. అమ్మకు నేనొక్కదాన్నే బిడ్డను. నేను పుట్టిన తర్వాత నన్ను తీసుకుని అమ్మమ్మ ఊరైన స్టోక్‌కి అమ్మ వచ్చేసింది. అక్కడే నేను పెరిగాను’ అని వాగ్మో తన బాల్యస్మృతులను గుర్తు చేసుకుంటుంది.


కుటుంబ పోషణ కోసం స్థానికంగా ఉన్న ఒక స్వచ్ఛందసంస్థలో వాగ్మో తల్లి  ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించింది. పాఠశాల చదువును వాగ్మో ఒక మిషనరీ స్కూల్‌లో చదువుకున్నారు. తర్వాత కళాశాల విద్య కోసం జమ్ములోని ఒక కళాశాలలో చేరారు. ‘అప్పుడే మా కుటుంబం ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిందని తెలిసింది. దీంతో నేను తీవ్ర డిప్రషన్‌లోకి వెళ్లిపోయా. ఆ బాధలను, ఒత్తిడుల నుంచి బయటపడాలని నేను, అమ్మ నిశ్చయించుకున్నాం. లేహ్‌లోని మా నాన్నగారి ఊరు ఆల్చికి తిరిగివచ్చాం. చట్టప్రకారం మా తండ్రి ఆస్తిలో మాకు వాటా రావాల్సి ఉంది. కానీ మా బాబాయిలు దక్కనివ్వలేదు.


దీంతో మేం తీవ్ర నిరాశకు గురయ్యాం. ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో ఆల్చిలో నిలువనీడ లేకుండా పోయింది. అక్కడే ఒక చిన్న ఇల్లుని అద్దెకు తీసుకుని కొత్త జీవితం ప్రారంభించాం. అప్పుడే మా అమ్మ నాన్నగారు మమ్మల్ని ఆదుకున్నారు. మాకు కొంత డబ్బు ఇచ్చి ఆల్చీలో ఇల్లు కట్టిచ్చారు’ అని చెప్పుకొచ్చారు వాగ్మో. ఇది ఆమె జీవితాన్ని అనూహ్య మలుపుతిప్పింది. ఆ ఇంటి పైనే వాగ్మో తన రెస్టారెంట్‌ని ప్రారంభించింది. అది నేటికీ కొనసాగుతోంది. వాగ్మో ప్రారంభించిన ‘ఆల్చీ కిచెన్‌’ సక్సెస్‌ అయింది. అయితే తన మనుమరాలి వ్యాపార సామర్థ్యం చూడకుండానే వాగ్మో తాత చనిపోయారు. 



అమ్మ ప్రోత్సాహంతో...

వాగ్మో బ్యాంకు నుంచి ఎనిమిది లక్షల రూపాయల రుణం తీసుకుని ఆల్చి కిచెన్‌ని ప్రారంభించింది. ఈ రెస్టారెంట్‌ కట్టే సమయంలో వాగ్మోకు తల్లి ఎంతో బాసటగా నిలిచింది. ‘మొదట్లో మా బిజినె్‌సను అందరికీ తెలిసేలా ఎలా ప్రచారం చేయాలో నాకు తెలియలేదు. తరువాత నా కిచెన్‌ వంటకాల రుచి చూడడానికి జనాలు రావడం ప్రారంభించారు. అలా ఆల్చీ కిచెన్‌ మెల్లగా ఫుడీ్‌సకి ఫేమస్‌ అడ్డాగా మారింది. మూడేళ్లల్లో బిజినెస్‌ మీద పట్టు సాధించా. వ్యాపారంలో గెలిచానన్న ధైర్యం, ఆత్మవిశ్వాసం అప్పుడు నాకు వచ్చాయి. ఈ బిజినె్‌సను నిరాటంకంగా నడపగలననే నమ్మకం కూడా కుదిరింది’ అని వాగ్మో తెలిపారు. లడఖ్‌ పర్యాటక ప్రదేశం.


‘నేను లడఖ్‌ వంటకాలను వండడం ప్రారంభించినపుడు పర్యాటకులు ఎంతవరకూ లడఖ్‌ వంటకాలను ఆస్వాదిస్తారోననే అనుమానాలను మా బంధువులు వ్యక్తంచేశారు. పూర్తిగా లడఖ్‌ వంటకాలను అందించే హోటల్‌ సక్సెస్‌ కాదని మరెందరో నిరుత్సాహపరిచారు. కానీ ఇవేమీ నన్ను వెనకడుగు వేయనీయలేదు. అక్కడికి వచ్చే ఎందరో పర్యాటకుల నోటి మాట ద్వారా ఆల్చీ కిచెన్‌ బాగా ప్రాచుర్యం పొందింది. దీంతో మా రెస్టారెంట్‌ వంటకాలకి డిమాండ్‌ పెరిగింది. మా కిచెన్‌కు వచ్చిన ఎందరో చెఫ్‌లు ఏ శిక్షణా సంస్థలో వీటిని నేర్చుకున్నారు అని నన్ను అడుగుతుండేవాళ్లు. కానీ నేను ఎక్కడా శిక్షణ తీసుకోలేదు.


మా అమ్మ వండేటప్పుడు చూసేదాన్ని. లడఖ్‌ రుచులను అమ్మ బాగా చేస్తుంది. ఆమే నా గురువు. అమ్మ చేస్తుండగా చూసి లడఖ్‌ వంటకాలను నేర్చుకున్నాను. అంతేకాదు స్వయంశక్తితో ఈ వంటకాల తయారీలో మరింత ప్రావీణ్యం సంపాదించా. పాకశాస్త్రం ఒక గొప్ప కళ. ఆ విషయం నేను ఎన్నడూ మరవలేదు’ అని వాగ్మో చెప్పుకొచ్చారు. ఎందరో మహిళలను చెఫ్‌లుగా మలిచేందుకు లడఖ్‌ వంటకాల్లో శిక్షణ ఇచ్చే స్కూల్‌ను కూడా వాగ్మో ప్రారంభించారు.


మహిళలకు ఉపాధి కల్పిస్తూ...

లెహ్‌ ప్రముఖ పర్యాటక ప్రదేశమనే విషయం తెలిసిందే. అందుకే అక్కడి మార్కెట్‌లో తన కిచెన్‌ కొత్త శాఖను వాగ్మో ప్రారంభించారు. లడఖ్‌ వంటకాల్లో శిక్షణపొందిన పదిమంది యువతులతో ఆ రెస్టారెంట్‌ను విజయవంతంగా నడిపిస్తున్నారు. ‘బాగా కష్టపడండని ఎప్పుడూ అమ్మాయిలకు నేను చెపుతుంటా. ఆడవాళ్లకు ఉపాధి అవసరాన్ని నొక్కిచెబుతుంటా. పని చేయడం ద్వారా ఆడపిల్లలు ఆర్థికంగా తమ కాళ్ల మీద తాము నిలబడగలరని ప్రోత్సహిస్తా. అందుకే నా కిచెన్‌ నిర్వహణకు కూడా  స్థానిక మహిళలనే సిబ్బందిగా తీసుకుంటా’ అని వాగ్మో అన్నారు. ఆమె కిచెన్‌లో అందరూ మహిళా సిబ్బందే ఉంటారు. వాగ్మోకు ఒక కూతురు ఉంది. వాగ్మోతోనే ఆమె తల్లి కూడా ఉంటోంది. ‘ఈ రోజు బిజినె్‌సలో నా ఎదుగుదల చూసి మా అమ్మ ఎంతో సంతోషిస్తోంది. ఆ అనుభూతి నాకెంతో గర్వాన్ని,సంతృప్తిని ఇస్తోంది’ అంటారామె.  



గత ఏడాది అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవిద్‌ నుంచి నారీశక్తి పురస్కార్‌ను కూడా వాగ్మో అందుకున్నారు. మహిళా స్వయంసాధికారత, విద్యా హక్కుల పరిరక్షణకు వాగ్మో చేస్తున్న కృషిని ఎంతోమంది ప్రశసించారు. లడఖ్‌ సంప్రదాయ వంటకాలతో పాటుగా ఆ ప్రాంత సంస్కృతిని కూడా దేశం నలుమూలలా వ్యాపించేలా వాగ్మో కృషి చేస్తున్నారు.


Updated Date - 2021-01-11T05:58:43+05:30 IST