వేతనం తగ్గదు

ABN , First Publish Date - 2022-01-20T07:01:01+05:30 IST

వేతనం తగ్గదు

వేతనం తగ్గదు

పీఆర్సీ అంటే తగ్గడం.. పెరగడం మామూలే

ఒక్క హెచ్‌ఆర్‌ఏనే పరిగణించడం సరికాదు

కరోనా కారణంగా ఆదాయం పడిపోయింది

జీతాలతోపాటు పథకాలనూ చూడాలి కదా!

ఉద్యోగులను విస్మరించామనడం సరికాదు

పీఆర్సీపై పనిచేసిన అనుభవంతో నివేదించా

సమ్మె విషయం నాకు తెలియదు: సీఎస్‌ 

తలసరి ఆదాయం పడిపోయింది: రావత్‌

కేంద్ర పీఆర్సీ ప్రకారమే హెచ్‌ఆర్‌ఏ: శశిభూషణ్‌


అమరావతి, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులకు 11వ పీఆర్సీ అమల్లోభాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, జారీచేసిన ఉత్తర్వుల వల్ల స్థూల వేతనాల్లో ఎటువంటి తరుగుదల ఉండదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ అన్నారు. అమరావతి సచివాలయంలో  బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘‘2008-09లో పీఆర్సీ ప్రక్రియలో పాల్గొన్నాను. అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితిలో చాలా తేడా వచ్చింది. కరోనా తీవ్ర స్థాయిలో ప్రభావం చూపింది. రాష్ట్ర రెవెన్యూ గణనీయంగా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులకు ఇచ్చే వేతనాలు, పెన్షన్లను; ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది’’ అని వివరించారు. అయినా.. నూతన పీఆర్సీలో ఉద్యోగులకు రూ.17వేల కోట్ల ఐఆర్‌ ఇచ్చామన్నారు. ‘‘కరోనా కష్టకాలంలోనూ ఐఆర్‌ ఇచ్చాం.  పీఆర్సీ ఆలస్యం అయిన కారణంగా అలాచేశాం. అయితే, అది జీతం లో భాగం కాదని అప్పుడు ఇచ్చిన జీవోల్లో స్పష్టంగా ఉంది. అన్నింటిపై సీఎంతో చర్చించాకే జీవోలు ఇచ్చాం. ఐఆర్‌ తగ్గించడంవల్ల ఎవరి గ్రాస్‌ జీతం తగ్గడంలేదు. పది రోజులు ఆగితే పేస్లిప్‌లు వస్తాయి. డిసెంబర్‌, ఈ నెల(జనవరి) ప్లే స్లిప్పులు పరిశీలిస్తే తేడా స్పష్టంగా తెలుస్తుంది. 2019 నుంచి గణించి డీఏలు ప్రకటించాం. పీఆర్సీలోని కొన్ని కాంపోనెంట్స్‌ పెరుగుతాయి. కొన్నితగ్గుతాయి. మొత్తంగానే వేతనం చూడాలి. అంతేగాని పూర్తిగా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదు. పెన్షన్‌లో, గ్రాట్యుటీలో పెరుగుదల ఉంది. కేంద్రం చేసినట్లే ఏపీ కూడా చేసింది’’ అని సీఎస్‌ వివరించారు. రాష్ట్ర బడ్జెట్‌లో పీఆర్సీతోపాటు అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఉద్యోగుల సూచనలు ఒక్కటీ పరిగణనలోకి తీసుకోలేదని నిజంకాదని, జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో పలు దఫాలు చర్చించి అధికారుల కమిటీ సిఫారసులపై చివరగా సీఎం నిర్ణయం తీసుకున్నాకే ఉత్తర్వులు ఇచ్చామని వివరించారు. ‘‘ఉద్యోగులు సమ్మెకు వెళ్తామని ప్రకటించడం గురించి నాకు తెలియదు. లిఖిత పూర్వకంగా ఎవరూ నాకు ఇవ్వలేదు. పదవీ విరమణ వయస్సు పెంచడం వల్ల నియామకాలు ఉండవనేది వట్టి ఆరోపణ మాత్రమే. ఒక్క హెచ్‌ఆర్‌ఏ తరుగుదల శాతాన్నే పరిగణనలోకి తీసుకోవడం సరికాదు. నాకున్న అనుభవంతో ఉద్యోగులకు సాధ్యమైనంత మేలు చేసే విధంగా పలు ప్రతిపాదనలు చేశాం. అదేసమయంలో సెంట్రల్‌ పీఆర్సీలోని కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాం. అందులో భాగంగానే పెన్షనర్లకు సంబంధించిన కొన్ని అంశాలు పీఆర్సీలో అమలు చేశాం. త్వరలోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగులతో చర్చలు చేస్తూనే ఉంటాం. అశుతోశ్‌మిశ్రా కమిషన్‌ సిఫారసులను పక్కన పెట్టలేదు. ఆ కమిషన్‌ సిఫారసుల్లోని 23 అంశాల్లో 18ని అధికారుల కమిటీ యథాతథంగా అంగీకరించింది.’’ అని సమీర్‌ శర్మ వ్యాఖ్యానించారు. అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విభజన  వల్ల ఏర్పడిన ఇబ్బందులపై ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.  


కేంద్ర పీఆర్సీ ప్రకారం చేశాం: శశిభూషణ్‌కుమార్‌

అఖిలభారత సర్వీసు అధికారులకు ఇచ్చే రూ.40 వేల ఇంటి అద్దె భత్యం రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ తెలిపారు. ‘‘పీఆర్సీ విషయమై హెచ్‌ఆర్‌ఏ స్లాబులు కేంద్ర పీఆర్సీ కమిషన్‌ నిర్ణయించిన విధంగా ఇచ్చాం. పీఆర్సీతో ప్రభుత్వంపై రూ.10,247కోట్ల భారంపడుతుంది. ప్రస్తుత ఏడాదికి 23శాతం పీఆర్సీ ప్రకారం రూ.70,424కోట్ల భారం పడుతుంది. ఉద్యోగ విరమణ వయసు పెంచడం వల్ల 2ఏళ్లకు రూ.24లక్షల అదనపు ప్రయోజనం ఉద్యోగికి కలుగుతుంది. ఇళ్లస్థలాల్లో రూ.5నుంచి రూ7లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది. సచివాలయ ఉద్యోగులు పీఆర్సీ సమయానికి లేరు. రెండున్నరేళ్ల తర్వాత వారికి ప్రొబేషన్‌ ఇచ్చి ఒక స్కేలు అమలు చేయాలని సీఎం నిర్ణయించారు’’ అని శశిభూషణ్‌కుమార్‌ తెలిపారు. 


ఉద్యోగులకు న్యాయమే చేశాం: రావత్‌

‘‘పీఆర్సీతో ఉద్యోగులకు న్యాయం జరిగింది. 2021-22కిగాను రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1.70 లక్షల కోట్లు. ఇది దక్షిణాది రాష్ట్రాల కంటే తక్కువ. రాష్ట్ర విభజన తర్వాతే ఈ పరిస్థితి తలెత్తింది. రెవెన్యూలోటు, ద్రవ్యలోటు పెరిగాయి. విభజనతో హైదరాబాద్‌ నుంచే వచ్చే ఆదాయాన్ని కోల్పోయాం. టీ-ప్రభుత్వం విద్యుత్‌ బకాయిలు ఇవ్వాల్సి ఉంది. కేంద్రంనుంచి రావాల్సిన వాటాలు పూర్తిగా రాలేదు. కొవిడ్‌ వల్ల అదనపు భారం పడింది. దీనివల్ల రాష్ట్ర రెవెన్యూలో రూ.21,933కోట్లు కోల్పోయాం. అదే సమయంలో ప్రజారోగ్యం కోసం ఈ కాలంలో అదనంగా 30వేల కోట్లు వ్యయం చేయాల్సి వచ్చింది. పన్నుల ద్వారా 2020-21లో రూ.60,688కోట్లు మాత్రమే. ఐఆర్‌ కింద  3,97,584మంది ఉద్యోగులకు రూ.11,984 కోట్లు, 3,57,528 మంది పెన్షనర్లల కోసం రూ.5,933 కోట్లు ఇచ్చాం. 3లక్షలమందికిపైగా ఉన్న అంగన్‌వాడీలు, శానిటరీ వర్కర్లు, ఆశా వర్కరర్ల వేతనాలు పెంచాం. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైంస్కేల్‌ అమలు ద్వారా రూ.360 కోట్లు అదనపు భారంపడుతుంది. ఏపీఎ్‌సఆర్టీసీ ఉద్యోగులకు రూ.5,380 కోట్లు వేతనంగా చెల్లిస్తున్నాం. ఐఆర్‌, ఫిట్‌మెంట్‌లో సర్దుబాట్లు ఉంటాయని గతంలో ఐఆర్‌ ఇచ్చినట్టు విడుదలచేసిన జీవోలోనే స్పష్టం చేశాం’’ అని రావత్‌ వివరించారు. 


Updated Date - 2022-01-20T07:01:01+05:30 IST