ఉన్నట్లా..లేనట్టా..

ABN , First Publish Date - 2020-08-15T05:30:00+05:30 IST

ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో రెగ్యులర్‌ అధ్యాపకుల నియామాకాలు చేపట్టకపోవడంతో వివిధ సబ్జెకులకు సంబంధించి

ఉన్నట్లా..లేనట్టా..

కాంట్రాక్ట్‌, గెస్ట్‌ అధ్యాపకులను రెన్యూవల్‌ చేయని సర్కారు

జూన్‌ నుంచి అందని వేతనాలు


మహబూబ్‌నగర్‌ (విద్యావిభాగం), ఆగస్టు 14 : ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో రెగ్యులర్‌ అధ్యాపకుల నియామాకాలు చేపట్టకపోవడంతో వివిధ సబ్జెకులకు సంబంధించి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే, ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంట్రాక్ట్‌, గెస్ట్‌ పద్ధతిన అధ్యాపకులను నియమించి, విద్యార్థులకు బోధన అందిస్తుంది. ప్రస్తుతం చాలా కళాశాలల్లో వీరే కీలకంగా మారారు. కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు నెలకు రూ.37,100, గెస్ట్‌ అధ్యాపకులకు రూ.21,600 ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే, కరోనాతో మార్చి నుంచి కళాశాలు మూతపడ్డాయి. అయినా కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు మాత్రం మే నెల వరకు వేతనాలు చెల్లించింది. గెస్ట్‌ అధ్యాపకులకు మాత్రం మార్చి నుంచి వేతనాలు నిలిపివేసింది.


కానీ, ప్రతి ఏడాది జూన్‌లో కాంట్రాక్ట్‌, గెస్ట్‌ అధ్యాపకులను రెన్యూవల్‌ చేయాల్సి ఉంది. ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి సంబంధించి ఇంత వరకు ఎలాంటి ఉత్తర్యులు జారీ చేయలేదు. దీంతో వీరికి జూన్‌ నుంచి రావల్సిన వేతనాలు అందడం లేదు. ప్రభుత్వం స్పందించి కాంట్రాక్ట్‌, గెస్ట్‌ అధ్యాపకులను రెన్యూవల్‌ చేసేందుకు ఉత్తర్యులు జారీ చేయాలని వీరు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి ఇంటర్‌ విద్యార్థులకు అన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఆలోపే రెన్యువల్‌ ఉత్తర్యులు విడుదల చేయాలని కోరుతున్నారు.


643 కాంట్రాక్ట్‌ , 323 గెస్ట్‌ అధ్యాపకులు

ఉమ్మడి జిల్లాలో మొత్తం 62 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో 486 మంది కాంట్రాక్ట్‌, 253 మంది గెస్ట్‌ అధ్యాపకులు ఉన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 20 ఉండగా, ఇందులో 157 మంది కాంట్రాక్ట్‌, 70 మంది గెస్ట్‌ అధ్యాపకులు ఉన్నారు. వీరంతా గత 12 సంవత్సరాలుగా బోధన చేస్తున్నారు. ప్రభుత్వ ఈ ఏడాది రెన్యువల్‌కు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2020-08-15T05:30:00+05:30 IST