వేతనం రాదు.. పూట గడవదు

ABN , First Publish Date - 2022-04-25T05:08:26+05:30 IST

వేతనం రాదు.. పూట గడవదు

వేతనం రాదు.. పూట గడవదు

  • నెలనెలా జీతాలు అందక పంచాయతీ కార్మికుల అవస్థలు
  • మూడు నెలలుగా ఎదురుచూపులు 
  • అప్పు చేసి కుటుంబాన్ని పోషించే పరిస్థితి నెలకొందని ఆవేదన

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 24 : రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేదలు వారు. చేసిన పనికి నెలనెలా జీతం డబ్బులు వస్తేనే పూట గడిచే కుటుంబాలు. అందులో ఎక్కువగా దళితులే ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. ఘట్‌కేసర్‌ మండల పరిధిలోని వివిధ పంచాయతీ కార్యాలయాల్లో పనిచేస్తున్న కార్మికులు నెలనెలా జీతాలు అందక నానా అవస్థలు పడుతున్నారు. ఒక నెల వేతనం రాకపోతేనే అల్లాడిపోయే పరిస్థితిలో దాదాపు మూడు నెలలు కావస్తున్నా.. జీతం డబ్బులు చేతికందే పరిస్థితి కనిపించడం లేదు. ఘట్‌కేసర్‌ మండలంలోని 11 గ్రామాల్లో 375 మంది కార్మికులు ఆయా విభాగాల్లో పనిచేస్తున్నారు. నిత్యం తెల్లవారుజామునే విధుల్లోకి చేరి గ్రామాల్లోని వీధులను శుభ్రం చేయడం, నీటి సరఫరా, విద్యుద్ధీపాల నిర్వహణ, పంచాయతీ కార్యాలయ పనులతోపాటు ఇతరత్రా పనులు చేస్తుంటారు. వీరంతా ఒకరోజు విధులకు హాజరు కాకుంటే గ్రామాలు మురికి కూపాలుగా మారే ప్రమాదం ఉంది. అలాంటి కార్మికులకు దాదాపు మూడు నెలలు కావస్తున్నా.. వేతనాలు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. దీంతో వారికి పూటగడవడమే కష్టంగా మారింది. కుటుంబాన్ని పోషించడానికి అప్పులు చేయాల్సి వస్తుందని పంచాయతీ కార్మికులు వాపోతున్నారు. కాగా, పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం నెలకు రూ.8,500 ఇస్తామని ప్రకటించింది. కానీ, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు ఈ వేతనం ఏమాత్రం సరిపోదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రతినెలా మొదటి వారంలో మహిళా సంఘాల గ్రూపుల్లో ఉన్న సభ్యులు తీసుకున్న డబ్బులకు వడ్డీ డబ్బులు చెల్లించడానికి నానా పాట్లు పడుతున్నారు. గతంలో ప్రతినెలా 10వ తేదీలోగా వేతనాలు పడేవని, ప్రస్తుతం వేతనాలు సకాలంలో అందక అప్పులు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులను వేతనాల గురించి అడిగితే.. ప్రతినెలా మొదటి తారీఖున ట్రెజరరీకి (ఎస్‌టీవో) పంపామని, ట్రెజరరీలో అడిగితే బ్యాంకుకు పంపామని.. అక్కడి నుంచి రావడం లేదని అధికారులు సమాధానం చెప్పుతున్నట్లు వారు పేర్కొంటున్నారు. రెండు, మూడు నెలలకోసారి వేతనాలు వస్తే ఏ విధంగా బతకాలని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, కార్మికులకు సబ్బులు, కొబ్బరినూనె, చెప్పులు ఇవ్వడంలో కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తమను మనుషులుగా గుర్తించడం లేదని, అందుకే సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు లక్షల రూపాయాల వేతనాలు అందజేస్తున్న ప్రభుత్వం.. మాకు మాత్రం వేతనాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన తమకు సకాలంలో వేతనాలు అందేవిధంగా అధికారులు కృషిచేయాలని పంచాయతీ కార్మికులు కోరుతున్నారు.

అప్పు చేయాల్సి వస్తుంది

వచ్చేదే అంతంత మాత్రం వేతనాలు.. అందులో మూడు నెలలకోసారి ఇస్తున్నారు. ఎలా బతకాలో అర్ధం కావడంలేదు. కుటుంబాన్ని పోషించాలంటే అప్పులు చేయాల్సి వస్తుంది. వేతనాలు సకాలంలో అందకపోవడంతో నానా అవస్థలు పడుతున్నాం.

                        - జవ్వాజీ సత్తయ్య, వాటర్‌మెన్‌, ఎదులాబాద్‌

ప్రతినెలా మహిళా గ్రూపులో డబ్బులు కట్టాలి

ప్రతినెలా మహిళా సంఘంలో డబ్బులు చెల్లించాలి. ఆలస్యం చేస్తే మిగతా సభ్యులు ఇంటికి వచ్చి గొడవ చేస్తారు. ఇల్లు గడటం కష్టంగా ఉంది. మూడు నెలలు కావస్తున్నా.. ఇప్పటి వరకు వేతనం అందలేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. పూట గడవడం కష్టంగా ఉంది. 

                         - లక్ష్మమ్మ, పారిశుధ్య కార్మికురాలు, కొర్రెముల 

ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది

మొదటి నుంచీ తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ కార్మికులపై వివక్ష చూపుతోంది. కార్మికులకు సకాలంలో వేతనాలు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వేతనాలు అందక మూడు నెలలు కావస్తోంది. వారం రోజుల్లో పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించకపోతే కలెక్టరేట్‌ వద్ద పెద్దఎత్తున ఆందోళన చేస్తాం.

  - నార్కెట్‌పల్లి సబిత, సీఐటీయూ మండల కార్యదర్శి

చెక్కులు ఆగాయి 

ప్రతినెలా మొదటివారంలోనే పంచాయతీ కార్మికుల వేతనాలు పంపాలని కార్యదర్శులను ఆదేశించాం. అదే ప్రకారం ప్రతినెలా మొదటి వారంలో ట్రెజరరీకి చెక్కులు పంపుతున్నాం. ఘట్‌కేసర్‌ మండలంలో కార్మికులకు ఫిబ్రవరి, మార్చి వేతనాలు రావాల్సి ఉంది. కార్యదర్శులు సకాలంలోనే వేతనాల కోసం చెక్కులు పంపుతురు. కానీ, ప్రభుత్వం డబ్బులు రాకుండా ఫ్రీజ్‌ చేస్తోంది.

            - వై.అరుణారెడ్డి, ఘట్‌కేసర్‌ ఎంపీడీవో 


Updated Date - 2022-04-25T05:08:26+05:30 IST