వెంకట్రామిరెడ్డికి ‘వేతన’ సెగ

ABN , First Publish Date - 2022-01-19T07:11:39+05:30 IST

వెంకట్రామిరెడ్డికి ‘వేతన’ సెగ

వెంకట్రామిరెడ్డికి ‘వేతన’ సెగ

ఉద్యోగ నేతను నిలదీసిన సచివాలయ సిబ్బంది

అన్యాయాన్ని ప్రశ్నిస్తారా? సంఘాన్ని రద్దు చేస్తారా?

పోరుకు సిద్ధమా? వ్యతిరేకిస్తూ లేఖ ఇస్తారా.. లేదా?

వాడీవేడిగా సచివాలయ ఉద్యోగుల సమావేశం

ఉద్యోగనేతపై తీవ్ర ఒత్తిడి..లేఖ ఇచ్చేందుకు ఓకే


అమరావతి, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి రివర్స్‌ పీఆర్సీ సెగ బాగా తగిలింది. పీఆర్సీ జీవోలపై రగులుతున్న ఉద్యోగులు... మంగళవారం సచివాలయంలో జరిగిన ఏపీ సచివాలయ సంఘం ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను నిలదీశారు. ‘‘అన్యాయాన్ని ప్రశ్నిస్తారా?లేక సంఘాన్నే రద్దు చేస్తారా?’’ అంటూ సమావేశంలో గట్టిగా పట్టుబట్టారు. రివర్స్‌ పీఆర్సీపై ఇప్పటికైనా స్పందిస్తారా లేదా అంటూ వెంటక్రామిరెడ్డిపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. పీఆర్సీ వల్ల అత్యధికంగా నష్టపోతోంది సచివాలయ ఉద్యోగులే. దీంతో ఈ సమావేశానికి వందలాదిమంది ఉద్యోగులు తరలివచ్చారు. పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ సీఎ్‌సకు సంఘం తరఫున లేఖ ఇవ్వాలని.. లేదంటే సచివాలయంలో బుధవారం నుంచే నల్లబ్యాడ్జీలతో నిరసనలకు దిగుతామని వెంకట్రామిరెడ్డికి ఉద్యోగులు స్పష్టం చేశారు. జీవోలు ఉపసంహరించుకోకుంటే తామంతా ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమని హెచ్చరించారు. అనంతరంవెంకట్రామిరెడ్డి మాట్లాడారు. ‘‘నాకున్న సమాచారం ప్రకారం కనీసం హెచ్‌ఆర్‌ఏ అయినా మారకుండా వస్తుందని భావించాను. అయితే ఇంత జరిగాక ఇప్పటికన్నా ఉద్యోగుల కోసం పోరాడకపోతే ఈ చైర్‌కు ఉన్న చరిత్ర నన్ను మెచ్చదు. రెండు నెలలుగా పీఆర్సీపై ప్రభుత్వం చర్చించినా.. ఉద్యోగులు ఆశించిన విధంగా జీవోలు లేవు. సీఎస్‌ కమిటీని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నాం. ఫిట్‌మెంట్‌ తక్కువైనా మిగిలిన విషయాల దృష్ట్యా అప్పట్లో అంగీకరించాం. హెచ్‌ఆర్‌ఏ విషయంలో స్పష్టత ఇవ్వాలని గతంలోనే సీఎంకు చెప్పాం. ప్రభుత్వ జీవోలను ప్రతి ఉద్యోగి వ్యతిరేకిస్తున్నారు. కొన్ని అంశాల్లో రాజీకి సంఘం సిద్ధమే. కానీ, ప్రతి అంశంలోనూ అలాచేస్తే  చరిత్ర మమ్మల్ని క్షమించదు’’ అని ఆయన అన్నట్టు తెలిసింది. పీఆర్సీ జీవోలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, సచివాలయ ఉద్యోగుల సంఘం ఉమ్మడి వేదికపైకి వచ్చి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నదని ఆయన చెప్పినట్లు తెలిసింది. సమావేశం అనంతరం సచివాలయ ఉద్యోగులు వందలాదిగా సీఎస్‌ కార్యాలయం వరకు తరలి వెళ్లారు. సెక్యూరిటీ సిబ్బంది సీఎస్‌ బ్లాక్‌లోకి ఉద్యోగులందరినీ అనుమతించపోవడంతో వెంకట్రామిరెడ్డితోపాటు కొందరు నేతలు లోపలకు వెళ్లారు. జీవోలను వెనక్కి తీసుకోవాలంటూ సచివాలయ సంఘం తరఫున లేఖను అందజేసి బయటకొచ్చారు. 

Updated Date - 2022-01-19T07:11:39+05:30 IST