సాగు..భారం!

ABN , First Publish Date - 2020-08-03T10:08:28+05:30 IST

రైతులకు వ్యవసాయం రోజురోజూకు కష్టమవుతోంది. వేసిన పంటను కాపాడుకోవడం తలకుమించిన భారమవుతోంది. పెరుగుతున్న ధరలు సాగుపై తీవ్ర

సాగు..భారం!

గతేడాదికంటే పెరిగిన పెట్టుబడులు

రెట్టింపైన కూలీ రేట్లు

ఆందోళనలో అన్నదాతలు 


పరిగి: రైతులకు వ్యవసాయం రోజురోజూకు కష్టమవుతోంది. వేసిన పంటను కాపాడుకోవడం తలకుమించిన భారమవుతోంది. పెరుగుతున్న ధరలు సాగుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒకవైపు కరోనా.. మరోవైపు డీజిల్‌, పెట్రోల్‌ ధరల పెరుగుదల ప్రభావం పంట సాగుపై పడుతోంది. పెట్టుబడుల భారమై పంటలు సాగుచేయడం కష్టంగా మారుతోంది. ఈ వానాకాలం సీజన్‌ ప్రారంభం నుంచి వర్షాలు సరిపోను కురిశాయి. చెరువులు, కుంటల్లోకి నీరొచ్చింది. వానా కాలం సీజన్‌ ప్రారంభమై నెలన్నర గడిచిపోయింది. ఆలస్యమైనా ఆశ చావని రైతులు ఎలాగో పంటలను సాగు చేస్తున్నారు. ఈవిధంగా కాలం కలిసిరాని పరిస్థితుల్లో ఒకరకంగా ఇబ్బం దులు పెడుతుంటే, మరోవైపు కూలీల కొరత, రెట్టింపు ఖర్చులతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.


వికారాబాద్‌ జిల్లాలో 3.20 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. సర్కారు సూచించిన పంటలు వేయకపోతే రైతుబంధు ఉండదనే సంకేతాలతో రైతులు అధికారులు చెప్పిన పంటలే సాగు చేస్తున్నారు. ఇంకా వర్షాలు కురిస్తే భారీగానే సాగు పెరగనుంది. అయితే చమురు ధరల పెంపు, కరోనా పరిస్థితులు, కూలీల కొరత లాంటి సమస్యలు రైతులకు పెను భారంగా మారనుంది. గడిచిన ఖరీఫ్‌, రబీలతో పోలిస్తే ప్రస్తుత పంటల సాగుకు పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగాయి. 


ఈసారి అన్ని పంటల కంటే పత్తి పంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతోంది. వికారాబాద్‌ జిల్లాలో వరి సాధారణం కంటే చాలా తక్కువగా సాగు అవుతుంది. రబీ కన్నా ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. సాధారణ విస్తీర్ణంతోపాటు, పెట్టుబడులూ రెట్టింపుగానే ఉన్నా యని రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా పత్తి, వరి సాగుకు ప్రారంభం నుంచి చివరివరకు పెట్టుబడులకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. విత్తన ఎంపిక మొదలు పంట పొలా లను రైతులు కంటికి రెప్పలా చూసుకోవాల్సి వస్తోంది. ముడి చమురు ధరలు పెరగడంతో మార్కెట్‌లో నిత్యావసర సరుకుల ధరలూ పెరిగాయి. ఆ ప్రభావం రైతులపైనా పడింది. ఎరువులు, విత్తనాలతోపాటు వ్యవసాయ కూలీల ధరలు రెట్టింపయ్యాయి. గత ఖరీఫ్‌లో వ్యవసాయ పనులు చేసిన మహిళా కూలీలకు రూ.250 నుంచి రూ.300 వరకు చెల్లించారు. ప్రస్తుతం రూ.350 నుంచి రూ.450కి పెరిగింది.


వేరే గ్రామానికి చెందిన కూలీలకు అయితే రూ.500ల వరకు చెల్లించాల్సి వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఎకరం పొలాన్ని దున్నించేందుకు రూ.1800లు చెల్లించగా.. ప్రస్తుతం ఖరీఫ్‌లో రూ.2000 వరకు ట్రాక్టర్ల యజమానులు పెంచారు. ఇలా ఒక ఎకరాకు దున్నడం నుంచి రవాణా వరకు ట్రాక్టర్‌ ఖర్చు గతేడాది రూ.10,200 ఉండగా, ఈసారి రూ. 12.300కు పెరిగింది. ఇలా వానాకాలం సీజన్‌లో పంటలసాగు ధరలు పెరగడంతో సన్నకారు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎకరం పొలంలో వరి సాగుకు పెట్టుబడి రూ.20 వేలు అయితే, అదే పత్తికి రూ.40 నుంచి రూ.45 వేలకుపైగా అవుతోంది. అదే మొక్కజొన్నకు రూ.15 వేల వరకు అవుతోంది.ఆరు నెలలు రేయింబవళ్లు కష్టపడినా సరైన పంట దిగుబడి రాక నష్టాలే మిగులుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రైతులు ఆశతో పోటాపోటీగా ఎరువులను చల్లుతున్నారు. పంటలు పండుతాయో లేదో కానీ, పెట్టుబడులు మాత్రం పెరుగుతున్నాయని చెబుతున్నారు. 


ఎకరం పత్తి సాగుకు అయ్యే ఖర్చు వివరాలు 

గతేడాది ఖర్చు ఈ సారి

ప్లవ్‌ రూ.1800 రూ.2000

కల్టీవేటర్‌ రూ.1000 రూ.1200

విత్తనం వేసేందుకు రూ.1000 రూ.1200

మందులు స్ర్పేకు రూ.1200 రూ.1800


                   (మూడుసార్లు పిచికారి చేస్తే)

నూర్పిడికి రూ.4000 రూ.4600

రవాణాకు రూ.1200 రూ.1500

మొత్తం ట్రాక్టర్‌ ఖర్చు రూ.10,200 రూ.12,300


మహిళల కూలి రూ.250-రూ.300 రూ.350-రూ.450

ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కూలీలకు రూ.500


రేట్లు పెరిగాయి

నాకున్న రెండెకరాల్లో పత్తి సాగు చేశా. యంత్రాల రేట్లు రెట్టింపయ్యాయి. ఎకరా పొలం దున్నడం, కల్టివేటర్‌, సీడ్‌ వేయడం వరకు గతేడాది రూ.6వేలు ఖర్చయ్యేది, ఈసారి రూ.7500 అయింది. విత్తనం ఖర్చు నుంచి పంట తీసే వరకు గతేడాది రూ.35 నుంచి రూ.40 వేలు వచ్చేది. ఈసారి రూ.45 వేలకు పెరుగుతుంది. ఇలా అయితే వ్యవసాయం చేయడం కష్టమే. 

- సురేష్‌, మల్లెమోనిగూడ, పరిగి మండలం


పెట్టుబడులపై నియంత్రణ ఉండాలి

పంటల సాగులో పెట్టుబడుల విషయంలో పెరుగుతున్న ఖర్చులను నియంత్రించే విధానం రావాలి. కరోనా, పెరిగిన డీజిల్‌ ధరలతో గతంతో పోలిస్తే ఖర్చులు పెట్టింపవుతున్నాయి. అందు లోనూ కూలీలు లభించని పరిస్థితి ఏర్పడింది. ఎన్ని కష్టాలు పడి సాగు చేసిన్నప్పటికీ  పంట చేతికి వచ్చిన గిట్టుబాటు ధర వచ్చే నమ్మకం లేదు. 

  - డి.బాబయ్య, బీకేఎస్‌ అధ్యక్షుడు, పరిగి

Updated Date - 2020-08-03T10:08:28+05:30 IST