ఆశాలకు వేతనాలు పెంపు!

ABN , First Publish Date - 2021-11-27T09:15:00+05:30 IST

ఆశా వర్కర్ల వేతనాలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. పెంచిన వేతనాలను వచ్చే నెల నుంచి అమలు చేయనున్నట్లు సమాచారం.

ఆశాలకు వేతనాలు పెంపు!

  • రూ.7500 నుంచి రూ.9750
  • వచ్చేనెల నుంచే అమలు!
  • సర్కారుపై రూ.72 కోట్ల భారం
  • వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో 
  • మంత్రి హరీశ్‌ టెలికాన్ఫరెన్స్‌
  • రాష్ట్రవ్యాప్తంగా 27500 వేల మందికి లబ్ధి 

హైదరాబాద్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆశా వర్కర్ల వేతనాలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. పెంచిన వేతనాలను వచ్చే నెల నుంచి అమలు చేయనున్నట్లు సమాచారం. అయి తే అధికారికంగా ఇంకా ఉత్తర్వులు జారీ కావాల్సివుంది. గురు, శుక్రవారం రెండురోజుల పాటు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో ఆశాఖ మంత్రి హరీశ్‌రావు టెలికాన్ఫరెన్స్‌ ని ర్వహించారు. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆశా కార్యకర్తలంతా పాల్గొన్నారు. వారికి వేతనాలను పెంచుతామని, వాటిని వచ్చే నెల నుంచే అమలు చేస్తామని ఆ యన ప్రకటించారు. ప్రస్తుతం ఆశాలకు నెలకు రూ.7500 ఇస్తున్నారు. దాన్ని రూ.9750కు పెంచనున్న ట్లు సమాచారం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27,500 మంది ఆశా వర్కర్లు లబ్ధి పొందనున్నారు. వేతనాల పెంపుతో ప్రభుత్వంపై ఏడాదికి అదనంగా రూ.72 కోట్ల భారం పడనున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచడం ఇది మూడోసారి. ఉమ్మడి రాష్ట్రంలో వారికి గౌరవ వేతనంగా రూ.1800 వరకు ఇచ్చేవారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి 7 మే 2017లో ఆశా కార్యకర్తలతో సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సమావేశం అయ్యారు. తమకు కనీస గౌరవ వేతనం రూ.4 వేలు పెంచాలని వారు డిమాండ్‌ చేయగా, సీఎం ఏకంగా రూ.6 వేలు ఇస్తున్నట్లు నాడు ప్రకటించారు. అంతేకాక వచ్చే బడ్జెట్‌లో మరోసారి జీతాలు పెంచుతామని చె ప్పారు. అనంతరం మరోమారు వారి వేతనాలను రూ.6 వేల నుంచి రూ.7500కు ప్రభుత్వం పెంచింది. ప్రస్తు తం దాన్ని రూ.9750 కు పెంచాలని నిర్ణయించారు.


క్షేత్రస్థాయిలో ఆశాలది కీలక పాత్ర

ఆశా కార్యకర్తలకు కేంద్రం ఫిక్స్‌డ్‌గా జాతీయ ఆరోగ్య మిషన్‌ నుంచి నెలకు ఒక్కొక్కరికి రూ.1800 ఇస్తుంది. మిగిలిందంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. అయితే ఆశాలకు ఇచ్చే గౌరవ వేతనమంతా ఫెర్ఫార్మెన్స్‌ (పనితీరు) ఆధారంగా చెల్లిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా అందరికీ ఒకేలా వేతనాలు అందడం లేదు. అందుకే వారు తమకు ఫిక్స్‌డ్‌గా జీతాలు చెల్లించాలని మొదట్నించి డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన పీఆర్సీ ప్రకారం తమకూ నెలకు ఫిక్స్‌డ్‌గా రూ.12 వేలు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ నిర్ణీత జీతాన్ని కూడా పనితీరుతో సంబంధం లేకుండా చెల్లించాలని కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణలో ఆశా కార్యకర్తలదే చాలా కీలక పాత్ర. కేవలం ఆరోగ్య సంబంధమైన అంశాలే కాకుండా ప్రభుత్వం నిర్వహించే ఇతర కార్యక్రమాల్లోనూ వీరిని భాగస్వామ్యం చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే వారిది వెట్టిచాకిరే. ప్రభుత్వం మాత్రం ఆరోగ్య సంబంధమైన విషయాలు తప్ప ఇతర విధులు అప్పగించబోమని ఎప్పుడో ప్రకటించింది. కానీ క్షేత్రస్థాయిలో ఇది అమలు కావడం లేదు. 


రూ.9 వేల ఫిక్స్‌డ్‌ వేతనం ఇవ్వాలి

ఆశాలకు వేతనాలను పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నాం. ప్రస్తుతం ఆశాలపై తీవ్రమైన పనిభారం ఉంది. బాగా పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. వారికి పనితీరుతో సంబంధం లేకుండా నెలకు రూ.9 వేల ఫిక్స్‌డ్‌ వేతనం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తు న్నాం. కేంద్రం ఇచ్చేది కూడా కలిపితే వారికి రూ.12 వేల వరకు వస్తాయి. 

- ఎం.సుదర్శన్‌, ప్రధాన కార్యదర్శి తెలంగాణ వైద్య, ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం 

Updated Date - 2021-11-27T09:15:00+05:30 IST