వాడీవేడిగా మునిసిపల్‌ సమావేశం

ABN , First Publish Date - 2022-07-01T06:36:22+05:30 IST

నర్సీపట్నం మునిసిపల్‌ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా జరిగింది. గురువారం జరిగిన సమావేశంలో అద్దె ట్రాక్టర్ల పేరుతో అధిక బిల్లులు పెట్టి మునిసిపల్‌ నిధులు దోచేస్తున్నారని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపించారు.

వాడీవేడిగా మునిసిపల్‌ సమావేశం
టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల వాగ్వాదం


మునిసిపల్‌ నిధులు  దోచేస్తున్నారని టీడీపీ ఆరోపణ

వైసీపీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య   వాగ్వాదం

టీడీపీ కౌన్సిలర్లు వాకౌట్‌..

జనసేన నిరసన


నర్సీపట్నం అర్బన్‌, జూన్‌ 30: నర్సీపట్నం మునిసిపల్‌ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా జరిగింది. గురువారం జరిగిన సమావేశంలో అద్దె ట్రాక్టర్ల పేరుతో అధిక బిల్లులు పెట్టి మునిసిపల్‌ నిధులు దోచేస్తున్నారని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపించారు. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో టీడీపీ కౌన్సిలర్లు వాకౌట్‌ చేశారు. 

మునిసిపల్‌ చైర్మన్‌ గుడబండ ఆదిలక్ష్మి అధ్యక్షతన గురువారం మునిసిపాలిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తమ వార్డుల్లో విద్యుత్‌ లైట్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పలువురు కౌన్సిలర్లు సభ దృష్టికి తెచ్చారు. అలాగే దోమల బెడదతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని వాపోయారు. ఈ సందర్భంగా టీడీపీ 26వ వార్డు కౌన్సిలర్‌ చింతకాయల పద్మావతి మాట్లాడుతూ.. పట్టణంలో చెత్త సేకరణకు మూడు ట్రాక్టర్లను అద్దెకు తీసుకున్నారని, అద్దె నిమిత్తం రూ.38 లక్షలు చెల్లించే బదులు కొత్త ట్రాక్టర్లు కొనుగోలు చేయాలన్నారు. అధిక మొత్తంలో బిల్లులు చెల్లిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనిపై వైస్‌చైర్మన్‌ తమరాన అప్పలనాయుడు జోక్యం చేసుకుని చెత్త సేకరణకు సంబంధించి నిధులు ఎంత ఖర్చు చేసినా తప్పలేదన్నారు. దీనిపై కౌన్సిలర్‌ పద్మావతి స్పందిస్తూ.. తాము పారిశుధ్యం కోసం నిధులు ఖర్చు చేయవద్దని చెప్ప డం లేదని, మునిసిపాలిటీకి సొంత ట్రాక్టర్లు కొనుగోలు చేయాలని కోరుతున్నామన్నారు. ఈ విషయాన్ని పక్కదారి పట్టించవద్దని కోరారు. వైసీపీ కౌన్సిలర్లు కోనేటి రామకృష్ణ, సిరసపల్లి నాని, మాకిరెడ్డి బుల్లిదొర, బైయపురెడ్డి చినబాబు జోక్యం చేసుకుని తెలుగుదేశం హయాంలో అద్దె ట్రాక్టర్లు ఏర్పాటు చేశారని, అప్పటి విధానాన్నే ప్రస్తుతం కొనసాగిస్తున్నట్టు తెలిపారు. టీడీపీ కౌన్సిలర్‌ సీహెచ్‌.రాజేష్‌ మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వైసీపీ కౌన్సిలర్లు ఎందుకు పాలకవర్గాన్ని నిలదీయలేదని ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో అరుపులు, కేకలతో సమావేశం దద్దరిల్లిపోయింది. ప్రజా సమస్యలు ప్రస్తావిస్తుంటే.. వైసీపీ సభ్యులు సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని టీడీపీ కౌన్సిలర్లు వాకౌట్‌ చేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ ఆదిలక్ష్మి మాట్లాడుతూ.. ప్రతిపక్ష కౌన్సిలర్లు చేస్తున్న ఆరోపణల్లో అవాస్తమని కొట్టిపారేశారు. ఈ దశలో జనసేన కౌన్సిలర్‌ అద్దేపల్లి సౌజన్య జోక్యం చేసుకుని మునిసిపాలిటీ సాధారణ నిధులు పెద్ద ఎత్తున డ్రా చేయడం వెనుక అవినీతి చోటుచేసుకుందని, నిధులు వృఽథా చేయడం తగదన్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ కనకారావు మాట్లాడుతూ..కొన్ని సంవత్సరాలుగా ట్రాక్టర్ల కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదన్నారు. అనంతరం జనసేన కౌన్సిలర్‌ సౌజన్య ధర్నాకు దిగారు. ఈ సమావేశంలో మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ గొలుసు నరసింహమూర్తి, టీడీపీ కౌన్సిలర్లు ధనిమిరెడ్డి మధు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.  


Updated Date - 2022-07-01T06:36:22+05:30 IST