మరో మణిహారం.. వడ్డెపల్లి బండ్‌..

ABN , First Publish Date - 2021-10-10T05:32:16+05:30 IST

వడ్డెపల్లి చెరువు.. ఆహ్లాదకరమైన ప్రాంతం.. కట్టకు ఒక వైపు నిండు కుండలా నీటితో కళకళలాడుతూ కనిపించే విశాలమైన చెరువు, మరోవైపు కట్టను ఆనుకొని పరుచుకున్న పచ్చదనం.. రకరకాల చెట్లు, పూలమొక్కలతోపాటు అద్భుతంగా కనిపించే సూర్యాస్తమయం అబ్బురపరుస్తుంది. చెరువుపై నుంచి చల్లగా వీచే గాలి సందర్శకులకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇలాంటి ఈ సుందర ప్రదేశాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు ముమ్మరం అవుతున్నాయి. రూ.21.50కోట్ల వ్యయంతో వరంగల్‌ నగర పాలక సంస్థ చేపట్టిన ఈ పనులు పూర్తయితే ఈ బండ్‌ నగరంలో మరో మణిహారంగా నిలువనున్నది. హనుమకొండ-కాజీపేట పట్టణాలను కలుపుతూ కేయూ రోడ్డును ఆనుకొని ఉన్న 2.9 కి.మీ. ఈ వడ్డెపల్లి బండ్‌ అభివృద్ధి, సుందరీకరణ ప్రాజెక్టును స్మార్ట్‌సిటీ నిధులతో చేపడుతున్నారు. ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మరో మణిహారం.. వడ్డెపల్లి బండ్‌..
వడ్డెపెల్లి బండ్‌ పార్కు

మొదలైన సుందరీకరణ పనులు
భద్రకాళి బండ్‌ తరహాలో అభివృద్ధి
రూ.21.5కోట్ల స్మార్ట్‌సిటీ నిధులతో అభివృద్ధి పనులు
వాకర్స్‌ కోసం విశాలమైన ట్రాక్‌
ఒక వైపు ఫుట్‌పాత్‌.. మరోవైపు సైకిల్‌ ట్రాక్‌..
వృద్ధులకు ఆటవిడుపు.. పిల్లల కోసం ఆట వస్తువులు..
అన్ని హంగులతో యోగా కేంద్రం, ఓపెన్‌ ఎయిర్‌ జిమ్‌


వడ్డెపల్లి చెరువు.. ఆహ్లాదకరమైన ప్రాంతం.. కట్టకు ఒక వైపు నిండు కుండలా నీటితో కళకళలాడుతూ కనిపించే విశాలమైన చెరువు, మరోవైపు కట్టను ఆనుకొని పరుచుకున్న పచ్చదనం.. రకరకాల చెట్లు, పూలమొక్కలతోపాటు అద్భుతంగా కనిపించే సూర్యాస్తమయం అబ్బురపరుస్తుంది. చెరువుపై నుంచి చల్లగా వీచే గాలి సందర్శకులకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇలాంటి ఈ సుందర ప్రదేశాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు ముమ్మరం అవుతున్నాయి. రూ.21.50కోట్ల వ్యయంతో వరంగల్‌ నగర పాలక సంస్థ చేపట్టిన ఈ పనులు పూర్తయితే ఈ బండ్‌ నగరంలో మరో మణిహారంగా నిలువనున్నది. హనుమకొండ-కాజీపేట పట్టణాలను కలుపుతూ కేయూ రోడ్డును ఆనుకొని ఉన్న 2.9 కి.మీ. ఈ వడ్డెపల్లి బండ్‌ అభివృద్ధి, సుందరీకరణ ప్రాజెక్టును స్మార్ట్‌సిటీ నిధులతో చేపడుతున్నారు. ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

హనుమకొండ, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి) :
హనుమకొండలోని వడ్డెపల్లి చెరువు బండ్‌ సుందరీకరణ పనులు మొదలయ్యాయి. హృదయ్‌ పథకం కింద రూ.26.50కోట్లతో తీర్చిదిద్దిన భద్రకాళి బండ్‌ సందర్శకులను విశేషంగా ఆకర్శిస్తోంది. ఇదే తరహాలో వడ్డెపల్లి బండ్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఈ యేడు ఏప్రిల్‌ 12వ తేదీన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు దీనికి శంకుస్థాపన చేశారు.

వాకర్స్‌ కోసం
బండ్‌ చుట్టుపక్కల ఉన్న పలుకాలనీల నుంచి ప్రతీరోజు ఉదయం, సాయంత్రం సుమారు 6వందల మందికిపైగా ఈ బండ్‌పై వాకింగ్‌ చేస్తుంటారు. సాయంత్రం వేళ వృద్ధులు, మహిళలు పిల్లలను తీసుకొని ఈ బండ్‌ మీదకు ఎక్కువగా వస్తుంటారు. బండ్‌ అభివృద్ధిలో భాగంగా ప్రస్తుతం ఉన్న నడకదారిని మరింత విస్తరిస్తున్నారు. వాకర్స్‌ ట్రాక్‌ను శాస్త్రీయంగా అభివృద్ధి చేస్తారు. ట్రాక్‌ మొత్తాన్ని స్పాంజ్‌ తరహాలో తీర్చిదిద్దుతారు. అడుగులు మెత్తగా పడేలా మారుస్తారు.

పలు సౌకర్యాలు

బండ్‌పై నడకదారికి చెరుకు వైపు పుట్‌పాత్‌ను, రోడ్డు వైపు సైకిల్‌ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తారు. వాకర్స్‌కు ఇబ్బం ది కలుగకుండా సందర్శకులు చెరువు కట్ట వెంట ప్రయాణించడానికి వీలుగా ఈ  ఫుట్‌పాత్‌ను నిర్మిస్తారు. సందర్శకులు కూర్చొని సూర్యోదయం, సూర్యాస్తమయాలను వీక్షించేందుకు, చెరువు అందాలను ఆస్వాదించేందుకు ఈ పుట్‌పాత్‌ను ఆనుకొని సిమెంట్‌ బెంచీలను ఏర్పాటు చేస్తారు. మరోవైపు పిల్లలు, పెద్దలు సైకిళ్లపై హాయిగా సవారీ చేసేందుకు అనువుగా ట్రాక్‌ను ఏర్పాటుచేస్తారు. సాయంత్రం వేళ సందర్శకుల కోసం ఈ రెండు ట్రాక్‌ల ను అనుకొని కట్ట పొడవునా విద్యుద్దీపాలను అమర్చుతా రు. ఇందు కోసం సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తారు. సందర్శకులను ఆకట్టుకునేందుకు బండ్‌ మధ్యలో రెండు మూడు చోట్ల ఫౌంటేన్లను కూడా ఏర్పాటు చేస్తారు. చె రువు కట్టకు రోడ్డు వైపున ఉన్న ఖాళీ స్థలంలో రకరకాల చెట్లను, పూల మొక్కలను పెద్ద ఎత్తున పెంచుతారు. బండ్‌ ఇప్పటికే పచ్చదనంతో వెళ్ళి విరుస్తుంది. ఇది దీనికి అదనపు ఆకర్శణగా తోడవుతుంది. బండ్‌పై పిల్లల పార్క్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. పిల్లలను ఆకట్టుకునే రకరకాల ఆటవస్తువులను అందుబాటులో ఉంచుతారు.

యోగా కేంద్రం

బండ్‌పై యోగా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తా రు. ఒకేసారి వంద మందికిపైగా యోగా సాధన చేసేందుకు వీలుగా విశాలమైన వేదికను ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా షెడ్డును నిర్మిస్తారు. చుట్టుపచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య ఈ యోగాకేంద్రం ఉండేలా అనువైన స్థలాన్ని ఇప్పటికే గుర్తించారు. యోగా సాధకుల కోసం ఒక యోగా గురువును కూడా నియమిస్తారు.

ఓపెన్‌ ఎయిర్‌ జిమ్‌లు
బండ్‌పై నాలుగైదు చోట్ల ఓపెన్‌ ఎయిర్‌ జిమ్‌లను కూడా ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే కట్టపైరెండు చోట్ల ఇలాంటి జిమ్‌లను ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా మరో మూడింటిని ఏర్పాటు చేస్తారు. ఇందుకు అవసరమైన వ్యాయామ పరికరాలను తెప్పిస్తున్నారు. ఇందులో ఒకటి యువతీ, యువకుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. బండ్‌ ప్రవేశమార్గం వద్ద ఒక అందమైన తోరణాన్ని నిర్మిస్తారు. కాజీపేట వైపు ఉన్న  ప్రవేశ మార్గాన్ని మరింత అభివృద్ధి చేస్తారు. బండ్‌ రెండు మూడు చోట్ల తినుబండారాల స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తారు.

విశిష్ట నేపథ్యం
వడ్డెపల్లి బండ్‌ అభివృద్ధి ప్రతిపాదన పాతదే. వాస్తవానికి భద్రకాళి బండ్‌ కన్నా ముందే దీనిని అమలు చేయాల్సి ఉండింది. హృదయ్‌ పథకం కింద చేపట్టనున్న పనుల్లో భద్రకాళి బండ్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో ఇది వెనుకబడింది. నగరం నడిబొడ్డున ఉన్న వడ్డెపల్లి చెరువుకు చారిత్రక నేపథ్యం ఉంది. కాకతీయ రాజుల కాలంలో సాగు, తాగునీటి అవసరాల కోసం వడ్డెపల్లి చెరువును తవ్వించారు. ఈ చెరువు కింద గతంలో 600 ఎకరాలు సాగయ్యేది. ప్రజలకు తాగునీటి కోసం 1993లో దీనిని వేసవి జలాశయంగా మార్చారు. ఇందులో చేపలను పట్టడాన్ని కూడా నిషేధించారు. ఏడాదిపొడవునా నీటితో నిండుకుండలా ఈ చెరువు కళకళలాడుతూ కనిపిస్తుంది. దీనిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలన్న ప్రతిపాదనను చాలా ఏళ్ల కిందటే చేశారు. యేటా బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు బతుకమ్మ ఆడుతారు. ఇది వరకు ఈ చెరువులో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశాది. వేసవి జలాశయంగా చేసిన తర్వాత నిమజ్జనాలను నిషేధించారు.

గతంలో..
2002-03 సంవత్సరంలో అప్పటి కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి చొరవతో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ, వరంగల్‌ కార్పొరేషన్‌ రూ.3కోట్ల వ్యయం తో బండ్‌ను అభివృద్ధి చేశాయి. 2012-13లో బం డ్‌ను మరింత సుందరీకరించారు. బండ్‌  పొడవున పచ్చదనాన్ని పెంపొదించారు. బండ్‌ మధ్య సింహం తల ఆకారంలో ముఖ ద్వారం, చెట్ల కొ మ్మలు అల్లుకున్నట్టు ఉన్న నమూనాలో నిర్మాణాలు చేపట్టారు. కమిషనర్‌గా పమేలా సత్పతి చొరవ తీసుకొని బండ్‌పై పచ్చదనాన్ని మరింత పెంచే చర్యలు తీసుకున్నారు. రకరకాల పూల మొక్కలు పెంచారు. ఇటీవలే సీతాకోక చిలుకల పార్క్‌ను ఏర్పాటు చేశారు.








Updated Date - 2021-10-10T05:32:16+05:30 IST