నకిలీలలు ఎన్నెన్నో!

ABN , First Publish Date - 2020-10-31T08:34:42+05:30 IST

వైద్య శాఖలో ఉద్యోగాలు సాధించేందుకు వెయిటేజీ మార్కుల కోసం తెరచాటు సహకారం అందించిన ఘనత వైద్యాధికారులదే.

నకిలీలలు ఎన్నెన్నో!

నకిలీ ధ్రువీకరణలకు కేరాఫ్‌గా జిల్లా కేంద్ర ఆసుపత్రి

 ఉపాధ్యాయ బదిలీల్లోనూ కీలక పాత్ర

అనారోగ్య సమస్య ఉన్నట్లు ధ్రువపత్రాలు జారీ

 వైద్య శాఖలో అక్రమాల రాజ్యం


(విజయనగరం-ఆంధ్రజ్యోతి): వైద్య శాఖలో ఉద్యోగాలు సాధించేందుకు వెయిటేజీ మార్కుల కోసం తెరచాటు సహకారం అందించిన ఘనత వైద్యాధికారులదే. లేని సర్వీస్‌ను ఉన్నట్లు సృష్టించి.. ధ్రువపత్రాలు అందించి.. చివరకు బహిర్గతం కావడంతో నాలుక కర్చుకున్న ఉదాంతాలు ఇటీవలే చూశాం. ఉపాధ్యాయుల బదిలీల్లోనూ ఇలాంటి వ్యవహారమే జరుగుతున్నట్లు తాజాగా తెలిసింది. త్వరలో ఉపాధ్యాయుల బదిలీలకు కౌన్సెలింగ్‌ జరుగనుంది. తమకు కావాల్సిన ప్రాంత పాఠశాలలకు.. ప్రధాన రోడ్డు సౌకర్యాలున్న పాఠశాలలకు.. పట్టణాలకు దగ్గరగా ఉన్న పాఠశాలలకు బదిలీ కావాలంటే సీనియార్టీ ఉండాలి.. లేదా అనారోగ్య  సమస్యలు ఉంటే బదిలీల్లో ప్రాధాన్యం ఉంటుంది. ఇక్కడే అక్రమాలకు బీజం పడింది. తమకు ఆరోగ్య పరంగా ఇబ్బందులు లేకపోయినా వైద్యాధికారుల అండదండలు.. రాజకీయ నాయకుల సిఫారసులతో కొంతమంది అక్రమ ంగా ధ్రువీకరణ పత్రాలు పొందుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా డయాలసిస్‌ రోగులు, లివర్‌ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు, గుండె సంబంధిత వ్యాధులు, బోన్‌ టీడీ, కేన్సర్‌ వంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి ధ్రువ పత్రాలు మంజూరు చేస్తుంటారు. కొంతమంది తమకు రోడ్డు ప్రమాదం జరిగినట్లు..


అంగవైకల్యం సంభవించినట్లు సర్టిఫికెట్లు పొందాలనుకుంటున్నారు. నిజమైన బాధితులు ధ్రువ పత్రాలు పొందడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ రోగాలు లేని వారు ధ్రువపత్రాలు పొందుతున్నారు. స్పౌజ్‌, అంగవైకల్యం, విడో, వివాహం కాని మహిళలలకు బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తారు. తద్వారా దగ్గరలో పనిచేసేందుకు అకాశం ఉంటుంది. ఈ అర్హతలు లేని వారు కొంత మంది తెరచాటుగా ఆరోగ్య పరమైన సమస్యలతో బాధ పడుతున్నట్లు ధ్రువీకరణలు పొందుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా వైద్య శాఖ ఎంత దారుణంగా పనిచేస్తుందో చెప్పడానికి మరో ఘటన తేటతెల్లం చేసింది. ఇటీవల పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జరిగింది. ఇందులో పాల్గొనే సిబ్బంది, ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు, ఉత్సవ నిర్వాహకుల్లో సేవలందించే వారంతా కొవిడ్‌ టెస్టులు చేయించుకోవాల్సి ఉంది. కానీ ఆనేక మంది టెస్టులు చేయించుకోలేదు.


అయినా అందరికీ నెగిటివ్‌ ఫలితాలు వచ్చినట్లు సెల్‌ ఫోన్లకు సమాచారం చేరవేశారు. వాటి ఆధారంగా పాసులు మంజూరు చేశారు. నకిలీ సర్వీస్‌ సర్టిఫికెట్ల వ్యవహారంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ రమణకుమారిని వివరణ కోరగా... దర్యాప్తు జరుగుతోందని, స్టాఫ్‌నర్స్‌ పోస్టుల నియామకాల్లో జరిగిన అక్రమాలపైనా విచారిస్తున్నామని వెల్లడించారు. కొవిడ్‌ టెస్టులు చేయకుండా...చేసినట్టు నెగిటివ్‌ రిపోర్టులు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించగా... దీనిపై ఆరా తీసి... చర్యలు తీసుకుంటామన్నారు. 

Updated Date - 2020-10-31T08:34:42+05:30 IST