అన్నదాతలతో ఆటలొద్దు

ABN , First Publish Date - 2020-10-29T08:03:21+05:30 IST

ఆరుగాలం కష్టించి పంట పండిస్తున్న అన్నదాతలతో ఆటలాడవద్దని...

అన్నదాతలతో ఆటలొద్దు

రైతుల సమస్యలపై టీడీపీ రాస్తారోకో

పంటలకు నష్టపరిహారం చెల్లించాలని సంధ్యారాణి డిమాండ్‌ 


సాలూరు, అక్టోబరు 28: ఆరుగాలం కష్టించి పంట పండిస్తున్న అన్నదాతలతో ఆటలాడవద్దని... వారికి ఇబ్బందులు పెడితే నిరసనలు ఉధృతం చేస్తామని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతుల సమస్యలపై ప్రభుత్వ తీరుకు నిరసనగా బుధవారం సాలూరు నియోజకవర్గానికి చెందిన సుమారు 500 మంది రైతులు, టీడీపీ కార్యకర్తలు, నాయకులతో కలిసి ఆమె తన ఇంటి నుంచి జాతీయ రహదారి వరకు ర్యాలీ చేశారు. నినాదాలు చేసుకుంటూ బోసు బొమ్మ కూడలికి చేరుకున్నారు. అక్కడ జాతీయ రహదారిపై బైఠాయించారు. పాడైన పత్తి, మొక్కజొన్న, అరటి పంటలను చూపించారు. పంటలన్నింటినీ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి ఏరియల్‌ సర్వే పేరుతో ఆకాశంలో తిరుగుతున్నారు తప్ప రైతుల బాధలు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. అకాల వర్షాలతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారని అన్నారు. ఇంత వరకు కనీసం నష్టాలను అంచనా వేయలేదని నిరాశ వ్యక్తం చేశారు. పత్తి రైతు తడిసిన పంటను చూసి ఏడుస్తున్నాడని చెప్పారు.


రైతులకు సంకెళ్లు వేసి తీసుకువెళ్లిన దుర్మార్గపు ప్రభుత్వమని విమర్శించారు. పంట నష్టాలను అంచనా వేసి వారికి పరిహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్‌, టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, కూనిశెట్టి భీమారావు, గొర్లె మాధవరావు, చంద్ర, బొత్స ఈశ్వరరావు, అబ్దుల్‌, డొంక అన్నపూర్ణ, పిన్నింటి ప్రసాద్‌బాబు, చనమల్లు వెంకటరమణ, కొల్లి మోహన్‌రావు, డబ్బి కృష్ణతో పాటు టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-29T08:03:21+05:30 IST