భద్రత పెరిగేనా?

ABN , First Publish Date - 2020-10-28T07:46:57+05:30 IST

పరిశ్రమల్లో భద్రత అంశం ప్రధాన చర్చనీయాంశమైంది. జిల్లాలో అనేక పరిశ్రమల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. లోపాలను ఉన్నతాధికారులు గుర్తించి సరిచేసే పరిస్థితి కనిపించడం లేదు.

భద్రత పెరిగేనా?

పరిశ్రమలను తనిఖీ చేస్తున్న కమిటీ

లోపాలను కప్పిపుచ్చుకుంటున్న యాజమాన్యాలు

నిత్యకృత్యంగా ప్రమాదాలు


(విజయనగరం- ఆంధ్రజ్యోతి): పరిశ్రమల్లో భద్రత అంశం ప్రధాన చర్చనీయాంశమైంది. జిల్లాలో అనేక పరిశ్రమల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. లోపాలను ఉన్నతాధికారులు గుర్తించి సరిచేసే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లోని పరిశ్రమల్లో ఇటీవల ప్రమాదాలు సంభవించడంతో ప్రభుత్వం కదిలింది. జిల్లాల వారీ ప్రత్యేక కమిటీలను నియమించింది. పరిశ్రమలన్నింటినీ తనిఖీ చేసి లోపాలు.. నిబంధనలు అమలు.. కాలుష్య నియంత్రణ చర్యలు.. తీసుకుంటున్న జాగ్రత్తలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కలెక్టర్‌ చైర్మన్‌గా, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం కన్వీనర్‌గా.. పరిశ్రమల శాఖ ఇన్‌స్పెక్టర్‌, పర్యావరణ ఇంజినీరు, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ తదితర శాఖల అధికారులు సభ్యులుగా ఏర్పాటైన కమిటీ ఇప్పటికే కొన్ని పరిశ్రమలను సందర్శించింది. కమిటీ పరిశీలనకు వస్తున్న విషయం ముందుగానే గుర్తిస్తున్న యాజమాన్యాలు అప్రమత్తమై లోపాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని పరిశ్రమలు ప్రమాదాలు జరుగుతున్నా బయటకు పొక్కకుండా చూసుకుంటున్నాయి.


కమిటీ సభ్యులు ప్రతి పరిశ్రమను ప్రత్యక్షంగా పరిశీలించి రక్షణ చర్యలపై నిఘా పెట్టాల్సి ఉంది. పరిశీలనకు వెళ్లేటప్పుడు ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మిక తనిఖీ చేయాలి. తద్వారా పరిశ్రమల్లో రక్షణ చర్యలు.. సిబ్బంది సమస్యలు, బాయిలర్ల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ.. కాలుష్య నియంత్రణకు సమగ్ర చర్యలు తీసుకుంటోందీ...లేనిదీ కచ్చితంగా బయటపడుతుంది. ఇది సమగ్రంగా సాగడం లేదు. 


జిల్లాలో 65 మేజరు పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో సముద్ర తీర ప్రాంత మండలాల్లో ఫార్మా కంపెనీలు ఉన్నాయి. అవి కాలుష్యానికి కారణమవుతున్నాయన్న ఆరోపణలున్నాయి.  వీటి కాలుష్యం వల్ల పంట పొలాలు దెబ్బతింటున్నాయని...  చెరువులు పాడవుతున్నాయని.. సముద్రంలో మత్స్య సంపద దొరకడం లేదని స్థానికులు ఆందోళనలు చేసిన ఘటనలు కోకొల్లలు. జిల్లాలో ఫెర్రో అల్లాయిస్‌ పరిశ్రమలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వాటిల్లో ఎప్పటికప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని వెలుగు చూడని పరిస్థితి ఉంది. చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా స్థానికంగా ఉన్న సర్దుబాట్లు ద్వారా వెలుగులోకి రాకుండా చేస్తున్నారు. పరిశ్రమల యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు పాటిస్తే కాలుష్య నియంత్రణతో పాటు ప్రమాదాలను కూడా చాలావరకు నియంత్రించవచ్చు. కానీ కొన్ని పరిశ్రమలు పట్టించుకోవడం లేదు. దీనికి కారణం రాజకీయ అండదండలే. వెనుక నేతలున్నారన్న ధీమాతో యాజమాన్యాలు కార్మికుల రక్షణకు కాని, కాలుష్య నియంత్రణకు కాని పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదు.

 

 కొత్తవలస, గరివిడి, బొబ్బిలి, మెరకముడిదాం ఇలా కొన్ని ప్రాంతాల్లో ఫెర్రో పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. తాజాగా బొబ్బిలి ప్రాంతంలో ఫెర్రో పరిశ్రమ కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరిగితే అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనికి కారణం పర్యావరణ అనుమతులు ఇచ్చేటప్పుడు ప్రజలను మభ్యపెడుతుండడమే. పరిశ్రమ కాలుష్యం వెదజల్లుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని వారంతా తీవ్రంగా వ్యతిరేకించారు. జేసీ ఆధ్వర్యంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. 


 జిల్లాలో 65 భారీ పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో 50 శాతం పరిశ్రమలను కూడా కమిటీ సభ్యులు పరిశీలించలేదు. కొన్ని ఫార్మా కంపెనీలే నేరుగా నివేదికలు ఇచ్చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. వాస్తవంగా కమిటీ స్వయంగా పరిశ్రమను ఆకస్మికంగా తనిఖీ చేసి లోపాలుంటే గుర్తించి.. వాటిని ప్రభుత్వానికి నివేదించాలి. నివారణా చర్యలు చేపట్టేలా జాగ్రత్తలు సూచించాలి. కాని పరిశీలనలు తూతూ మంతంగా జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఇటీవల కలెక్టర్‌ ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం మాట్లాడుతూ కొన్ని పరిశ్రమల్లో లోపాలున్నట్లు గుర్తించామని కలెక్టర్‌కు చెప్పడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. 

 

 పరిశ్రమల్లో ప్రమాదాల అంశాన్ని జిల్లా కాలుష్య నియంత్రణ ఇంజినీర్‌ టి.సుదర్శనం వద్ద ప్రస్తావించగా దశలవారీగా పరిశ్రమల్లో తనిఖీలు జరుగుతున్నాయని వె ల్లడించారు. మేజరు పరిశ్రమలు, ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉన్న పరిశ్రమలను గుర్తించి.. వాటిని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. 

Updated Date - 2020-10-28T07:46:57+05:30 IST