త్వరలో ల్యాండ్‌బ్యాంకులు

ABN , First Publish Date - 2020-10-01T11:19:44+05:30 IST

మండలాల్లో త్వరలో ల్యాండ్‌బ్యాంకులు ఏర్పాటు కాబోతున్నాయి. భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు భూ సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు వీటిని నెలకొల్పబోతున్నారు.

త్వరలో ల్యాండ్‌బ్యాంకులు

మండలాల్లో ఏర్పాటుకు సన్నాహాలు

ఆర్‌డీవో భవానీశంకర్‌

మెంటాడ, సెప్టెంబర్‌ 30: మండలాల్లో త్వరలో ల్యాండ్‌బ్యాంకులు ఏర్పాటు కాబోతున్నాయి. భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు భూ సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు వీటిని నెలకొల్పబోతున్నారు. ప్రతి మండలంలో 50 నుంచి 60 ఎకరాలతో ల్యాండ్‌బ్యాంక్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు విజయనగరం ఆర్డీఓ భవానీ శంకర్‌ తెలిపారు.


భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని తహసీల్దార్‌లను ఆదేశించామని వెల్లడించారు. మెంటాడ తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆయన బుధవారం సందర్శించారు. జమాబంది కార్యక్రమంపై వీఆర్వోలు, వీఆర్‌ఏలతో సమీక్షించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్జీలపైనా ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఇంకా 258 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. అలాగే 103 ఎకరాలు నోటిఫై చేయాల్సి ఉందని చెప్పారు. తారకరామ తీర్థ సాగర్‌ ప్రాజెక్ట్‌ కోసం భూసేకరణ  ప్రక్రియను వేగవంతం చేస్తున్నామన్నారు.


భూములు కోల్పోయిన వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. జనవరి ఒకటి నుంచి భూముల రీ సర్వే కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత భూ సమస్యలు 95 శాతం పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ఆయన వెంట తహసీల్దార్‌ డి.రవి, ఉప తహసీల్దార్‌ నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-10-01T11:19:44+05:30 IST