వైభవంగా భోగి సంబరాలు

ABN , First Publish Date - 2022-01-15T04:20:35+05:30 IST

వాడవాడలా అందరూ ఉత్సాహంగా భోగి మంటలు వేశారు. ఇళ్ల ముంగిళ్లు భోగి కుండలు, గంగిరెద్దులు, సంక్రాంతి ఆహ్వానాలతో రంగ వల్లులు అందరినీ అలరించాయి.

వైభవంగా భోగి సంబరాలు
బుచ్చి: భోగి సందర్భంగా గంగా, కామాక్షితాయి సమేత శ్రీమల్లికార్జునస్వామి గ్రామోత్సవం

భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

 

బుచ్చిరెడ్డిపాళెం, జనవరి 14: వాడవాడలా అందరూ ఉత్సాహంగా భోగి మంటలు వేశారు. ఇళ్ల ముంగిళ్లు భోగి కుండలు, గంగిరెద్దులు, సంక్రాంతి ఆహ్వానాలతో రంగ వల్లులు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా జొన్నవాడ శ్రీమల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయం, బుచ్చి కోదండరామస్వామి, కళ్యాణ వేంకటేశ్వరస్వామి, వేణుగోపాలస్వామి, బాబా మందిరం కన్యకాపరమేశ్వరి ఆలయంతోపాటు మండలంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భోగి సందర్భంగా జొన్నవాడ ఆలయంలో గంగా, కామాక్షితాయి సమేత శ్రీమల్లికార్జునస్వామి గ్రామోత్సవంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కాగా ఆలయంలో చిన్నారులతో కూచిపూడి భరత నాట్యం ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో పలువురు చిన్నారులు చేసిన నాట్య ప్రదర్శన భక్తులను అలరించింది. ఆలయ ఈవో ఏవీ శ్రీనివాసులురెడ్డి పర్యవేక్షించారు.

పలు చోట్ల ఆటల పోటీలు: బుచ్చి నగర పంచాయతీతోపాటు మండలంలో పలు పార్టీల నేతల ఆధ్వర్యంలో ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. అలాగే దామరమడుగు పల్లిపాళెంలో చెంచులక్ష్మి పరియోజన ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో మురళీకృష్ణ ఆసుపత్రి  వారి సౌజన్యంతో ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో పోట్లూరి శ్రీనివాసులు, పేరిసెట్ల రమణయ్య, ఆసుపత్రి పీఆర్వో రాధాకృష్ణ, సుధాకర్‌రావు, సురేంద్ర, బుజ్జయ్య, న్యాయ నిర్ణేతలు మాఽధవి, లీనా, సునీత, విజయలక్ష్మి పాల్గొన్నారు. 

కోవూరు : భోగి పండుగను మండల పరిధిలోని గ్రామాల్లో శుక్రవారం ఆనందోత్సాహాల నడుమ నిర్వహించారు. ఉదయాన్నే తాటి ఆకులతో భోగిమంటలు వేసి పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. దూర ప్రాంతాలకు వెళ్లిన కుటుంబసభ్యులు పండుగ కోసం గ్రామాలకు చేరుకున్నారు. పోతిరెడ్డిపాళెంలో రంగవల్లుల పోటీలు నిర్వహించారు. అలాగే సాంస్కృతిక  కార్యక్రమాలు ఏర్పాటు    గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేశారు. పట్టణంలోని శ్రీవీరాంజనేయస్వామి, శ్రీకోదండరామస్వామి, శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పూజలు చేశారు.

నేడు మకర సంక్రాంతి: పెద్దపండుగగా పిలుచుకునే మకర సంక్రాంతి పర్వదినాన్ని శనివారం వైభవంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. పురాతన ఽశ్రీకోదండరామస్వామి ఆలయం, శ్రీ వీరాంజనేయస్వామి ఆలయం, పాటూరులోని హరిహరనాథస్వామి ఆలయం, మోడేగుంటలోని శ్రీ నాగేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేకంగా పూజలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణంలోని పురాతన శ్రీచెన్నకేశవ స్వామి ఆలయాన్ని మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా విద్యుద్దీపాలతో అలంకరించారు.  

ముత్తుకూరు : మండలంలో శుక్రవారం భోగి పండుగ సంబరాలను వైభవంగా నిర్వహించారు. ప్రభాత వేళ కమ్ముకున్న మంచును భోగి మంటలతో పారద్రోలారు. భోగ, భాగ్యాలను అందించే భోగి పండుగ శుభాలను కలుగజేయాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణపట్నం, ముత్తుకూరు, బ్రహ్మదేవంలో ఆలయాలు భక్తుల పూజలతో సందడిగా మారాయి. ముత్తుకూరు పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమలకు  సెలవులు రెండు రోజులే ఇవ్వడంతో ఇతర రాష్ట్రాల వారు సంక్రాంతిని ఇక్కడే నిర్వహించుకుంటున్నారు. దీంతో పరిశ్రమ కార్మికుల తాకిడి మార్కెట్‌లో ఎక్కువగా కనిపించింది. భోగి సందర్భంగా దొంగతనాలు జరగకుండా పోలీసులు ప్రత్యేక పహారా నిర్వహించారు. ఇళ్ల ముందు రంగవల్లులతో.. భోగి మంటల కాంతులతో వీధులు కళకళలాడాయి. 

విడవలూరు : మండలంలో భోగి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. వేకువ జామున నిద్రలేచి మహిళలు ఇంటి ముంగిట అందమైన ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెట్టారు. తమ జీవితంలో కమ్ముకున్న చీకటి తొలగి భోగభాగ్యాలు కలగాలని కోరుకుంటూ భోగి మంటలు వేశారు. అనంతరం దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊటుకూరులో జరిగిన వేడుకల్లో సత్తెనపల్లి డీఎస్పీ రామిరెడ్డి విజయభాస్కర్‌ కుటుంబ సమేతంగా పాల్గొని భోగి మంటలను వేశారు. విడవలూరులో భోగి పండుగను పురస్కరించుకుని టీడీపీ మండలాధ్యక్షుడు చెముకుల శ్రీనివాసులు పార్టీ కార్యాలయం వద్ద బోగి మంటలను వేశారు.   

ఇందుకూరుపేట : భోగి పండుగను శుక్రవారం మండలంలో సంప్రదాయకంగా.. ఆహ్లాదకరంగా జరుపుకున్నారు. పల్లెలు బంధుమిత్రులతో సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. వేకువజాము నంచే భోగి మంటలు ఎగిసిపడ్డాయి. డేవిస్‌పేట, జగదేవిపేట, గంగపట్నం, ఇందుకూరుపేట, మైపాడు సెంటర్లలో భోగి మంటలను భారీ ఎత్తున మంటలు ఎగిసిపడేలా నిర్వహించారు. అలాగే గంగపట్నం చాముండేశ్వరి ఆలయం, కొత్తూరు సాయిబాబా ఆంజనేయస్వామి, ఇందుకూరుపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయాలలో భోగి పండుగ సందర్భంగా ప్రత్యేక అలంకారాలు, పూజలు నిర్వహించారు. భక్తులు కూడా అధిక సంఖ్యలో పూజల్లో పాల్గొని దర్శనం చేసుకున్నారు.   

వెంకటాచలం : సంక్రాంతి సందర్భంగా వెంకటాచలం మండలంలో గురువారం రాత్రి భోగి మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు. పలు గ్రామాల్లోని యువత భోగి మంటలు వేసేందుకు పోటాపోటీగా ఉత్సాహం  కనబరిచారు. శుక్రవారం వేకువ నుంచే మహిళలు వారి ఇళ్ల ముంగిట్లో ముగ్గులు తీర్చిదిద్దారు. భోగి స్నానాలు చేసి, కొత్త దుస్తులు ధరించడంతో భోగి కళ సంతరించుకోంది. దీంతో మండల పరిధిలో  ఆలయాల్లో పండుగ సందడి నెలకొంది.    

మనుబోలు : మండల ప్రజలు శుక్రవారం భోగి పండుగను ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకున్నారు. వేకువనుంచే ఇళ్లముందు పెద్ద పెద్ద రంగవల్లులు, భారీ భోగి మంటలు వేశారు. కొత్త దుస్తులు ధరించి, పిండి వంటలు చేసుకున్నారు. పిల్లలు, పెద్దలు ఒకరికొకరు భోగి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా స్వగ్రామాలకు చేరుకుని మిత్రులను, బంధువులను కలిసి ఆనందోత్సాహాల నడుమ భోగి పండుగను జరుపుకున్నారు. స్థానిక మనుబోలమ్మ, నాగార్పమ్మ, గంగమ్మ ఆలయాల్లో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలకు గూడూరు పెంచలయ్య, జ్యోతి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు.

పొదలకూరు : మండలంలోని పల్లె లోగిళ్లలో సంక్రాంతి మూడు రోజుల పండుగలో మొదటి రోజు భోగి మంటలతో పండుగను శుక్రవారం వైభవంగా నిర్వహించారు. రంగవల్లులు, హరిదాసు కీర్తనలతో తెలుగు ముంగిళ్లు కళకళలాడుతున్నాయి. భోగభాగ్యాల భోగికి మంటలతో ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. తెల్లవారు జామునుంచే పెద్ద ఎత్తున భోగి మంటలు వేశారు. కోలాటాలు ఆడుతూ భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. మహిళలు ఇళ్ల ముందు వేసిన రంగవల్లులు పల్లె వాతావరణం, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు, సంక్రాంతి సంబరాలు, జాతి సమైక్యత, విభిన్న ఆకృతులు, రంగుల్లో ముగ్గులను తీర్చిదిద్దారు. 

తోటపల్లిగూడూరు : భోగి పండుగను పురస్కరించుకుని శుక్రవారం మండలంలో భోగి శోభ సంతరించుకుంది. తెల్లవారుజామునే నిద్రలేచి గ్రామాల్లోని వీధుల్లో, కూడళ్లలో భోగి మంటలు వేశారు. అనంతరం ఇంటిల్లిపాది తలస్నానాలు ఆచరించారు. కొత్త దుస్తులు ధరించి స్నేహితులు,   బంధుమిత్రులతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఆలయాలకు వెళ్లి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ పవిత్రమైన రోజు తమకు భోగభాగ్యాలు కలగాలని భగవంతుడిని కోరుకున్నారు. అలాగే పిల్లలపై భోగిపళ్లు పోశారు. దీంతో ఇళ్ల లోగిళ్లలో భోగి, సంక్రాంతి పర్వదిన శోభలు సంతరించుకున్నాయి. 



Updated Date - 2022-01-15T04:20:35+05:30 IST