సాగు ప్రణాళికపై కసరత్తు

ABN , First Publish Date - 2022-05-10T05:22:12+05:30 IST

వానాకాలం సీజన్‌ వ్యవసాయ ప్రణాళికపై జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులతో చర్చించి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. జిల్లాలో ఏకైక మధ్యతరహా ప్రాజెక్టు ఘనపురం ఆనకట్ట పరివాహక ప్రాంతాల్లో రైతులు వరి సాగుకే ఆసక్తి చూపుతున్నారు. కాని ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయొధ్య కొరవడడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అన్నదాతలతో చర్చించి, వ్యవసాయ క్షేత్రాలకు అనుగుణంగా లాభదాయకమైన పంటలనే సాగు చేయించాలని భావిస్తున్నారు.

సాగు ప్రణాళికపై  కసరత్తు

లక్ష ఎకరాలు తగ్గనున్న వరి 

రైతులకు అవగాహన కల్పించేందుకు అధికారుల సన్నద్ధం


మెదక్‌, మే 9: వానాకాలం సీజన్‌ వ్యవసాయ ప్రణాళికపై జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులతో చర్చించి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. జిల్లాలో ఏకైక మధ్యతరహా ప్రాజెక్టు ఘనపురం ఆనకట్ట పరివాహక ప్రాంతాల్లో రైతులు వరి సాగుకే ఆసక్తి చూపుతున్నారు. కాని ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయొధ్య కొరవడడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అన్నదాతలతో చర్చించి, వ్యవసాయ క్షేత్రాలకు అనుగుణంగా లాభదాయకమైన పంటలనే సాగు చేయించాలని భావిస్తున్నారు. 


వానాకాలంలో 3.90 లక్షల ఎకరాల్లో 

నియంత్రిత సాగు విధానం ద్వారా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో వ్యవసాయ ప్రగతిని నిర్వహించడానికి మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 3.90 లక్షల ఎకరాల్లో వానాకాలం పంటల ప్రణాళిక రచించడానికి క్షేత్రస్థాయిలో రైతుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఇందుకోసం 74 క్లస్టర్ల పరిధిలో మండల విస్తరణ వ్యవసాయ అధికారులు పర్యటిస్తున్నారు. ఈ వానాకాలం సీజన్‌లో వరి సాగును 1.50 లక్షల ఎకరాలకు పరిమితం చేయాలని అధికారులు భావిస్తున్నారు. గత సీజన్‌లో జిల్లాలో 2.50 లక్షల ఎకరాలలో రైతులు వరి నాట్లు వేయగా, ఈసారి లక్ష ఎకరాలు తగ్గించాలని భావిస్తున్నారు. ఈ సంవత్సరం పత్తి సాగు విస్తీర్ణం 90 వేలకు పెంచాలని నిర్ణయించారు. టేక్మాల్‌, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, రేగోడ్‌, పాపన్నపేట తదితర మండలాల్లో 40 వేల ఎకరాల్లో కంది పంట వేయడానికి రైతులను సన్నద్ధవవుతున్నారని అంచనా. 


రైతు వేదికల వద్ద క్షేత్ర ప్రదర్శన

వ్యవసాయ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని రైతువేదికల చుట్టూ 25 ఎకరాల  విస్తీర్ణంలో వివిధ పంటలను వేసి క్షేత్ర ప్రదర్శన నిర్వహించనున్నారు. వరి సాగు విషయంలో పూర్తిగా ఆధునిక పద్ధతులను అనుసరించేలా చైతన్యం తెస్తామని జిల్లా వ్యవసాయ అధికారి పరశురాంనాయక్‌ తెలిపారు. వరిని నేరుగా విత్తేలా అవగాహన కల్పిస్తామన్నారు. ఎరువుల వినియోగం, బిందు తుంపర సేద్యం, రైతుబీమా, రైతుబంధు, కల్తీ ఎరువుల, నకిలీ విత్తనాలు తదితర అంశాలపై రైతులను ఛైతన్య పరుస్తామన్నారు. ఇప్పటికే భూసార పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయశాఖ, నీటిపారుదల శాఖ, మార్కెటింగ్‌, పశుసంవర్థక, ఉద్యానవన, విద్యుత్‌, సహకారశాఖలను వ్యవసాయ ప్రగతిలో భాగస్వామ్యం చేయనున్నట్టు తెలిపారు. రాబోయే వారం రోజుల వ్యవధిలో రాష్ట్ర కమిషనర్‌ జిల్లా వ్యవసాయ అధికారుల సిబ్బందితో సమావేశం నిర్వహించి మార్గదర్శకాలను సూచించనున్నట్టు పేర్కొన్నారు.

Read more