కూలీలు ఏకమై ఉపాధి పథకాన్ని కాపాడుకోవాలి

ABN , First Publish Date - 2022-08-17T03:26:53+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నదని, కూలీలంతా ఏకమై ఈ పథకాన్ని కాపాడుకోవాలని వ్యవసాయ

కూలీలు ఏకమై ఉపాధి పథకాన్ని కాపాడుకోవాలి
జీపుజాతాలో మాట్లాడుతున్న సుబ్బారావు

 కందుకూరు, ఆగస్టు 16: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నదని, కూలీలంతా ఏకమై ఈ పథకాన్ని కాపాడుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు పేర్కొన్నారు. సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీపుజాతా మంగళవారం సాయంత్రం కందుకూరుకు చేరింది. పట్టణంలో సీపీఎం, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు జీపుజాతాకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోస్టాఫీసు సెంటర్‌లో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జీ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో సుబ్బారావు మాట్లాడుతూ కేంద్రం కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ వారికి లక్షల కోట్ల రాయితీలు కల్పిస్తూ వ్యవసాయ రంగాన్ని దివాలా తీయిస్తోందన్నారు.  ఉపాధి కూలీలకు దినసరి కూలీని రూ.600కు పెంచాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, పాల ఉత్పత్తులపై జీఎస్‌టీ రద్దు చేయాలని, ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి పంపిణీ చేయాలన్న డిమాండ్లతో ఈ జీపుజాతా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుల్లయ్య, వెంకమరాజు, పెద్దబ్బయ్య,  నాగయ్య, ముప్పరాజు కోటయ్య, మాదాల రమణయ్య, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-17T03:26:53+05:30 IST