వీఎస్‌యూలో పండుగ!

ABN , First Publish Date - 2022-05-24T05:46:13+05:30 IST

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (వీఎ్‌సయూ) ఆరు, ఏడో స్నాతకోత్సవాలకు ముస్తాబయ్యింది. వెంకటాచలం మండలం కాకుటూరు వద్దనున్న యూనివర్సిటీ ప్రాంగణంలో మంగళవారం ఈ కార్యక్రమం జరగనుంది.

వీఎస్‌యూలో పండుగ!
వర్సిటీలో ఏర్పాట్లపై వీసీ, ఇతర అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

నేడు 6, 7 స్నాతకోత్సవాలు

పాల్గొననున్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌

26 మందికి బంగారు పతకాలు

మొత్తం 4,323 మందికి పట్టాలు

భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు


నెల్లూరు, మే 23 (ఆంధ్రజ్యోతి) : విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం (వీఎ్‌సయూ) ఆరు, ఏడో స్నాతకోత్సవాలకు ముస్తాబయ్యింది. వెంకటాచలం మండలం కాకుటూరు వద్దనున్న యూనివర్సిటీ ప్రాంగణంలో మంగళవారం ఈ కార్యక్రమం జరగనుంది. ఇందుకోసం వర్సిటీతోపాటు జిల్లా అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. కరోనా కారణంగా గతేడాది స్నాతకోత్సవం నిర్వహించుకునే వీలు లేకపోవడంతో దానికి కూడా కలిపి ఈ ఏడాది నిర్వహిస్తున్నారు. రెండు స్నాతకోత్సవాలకు సంబంధించి మొత్తం 4,323 మందికి పట్టాలు అందించనున్నారు. వీరిలో 252 మందికి స్నాతకోత్సవంలో నేరుగా పట్టాలు ప్రదానం చేయనున్నారు. పీహెచ్‌డీ పట్టాలు 6, ఫ్యాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌ - 44, ఫ్యాకల్టీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ - 46, ఫ్యాకల్టీ ఆఫ్‌ సైన్స్‌ 138, గోల్డ్‌ మెడల్‌ 18 మందికి ఇవ్వనున్నారు. మొత్తంగా 26 బంగారు పతకాలు అందించనున్నారు. ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ హాజరుకానున్నారు. ఉదయం పది గంటలకు విజయవాడలోని రాజ్‌భవన్‌ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో 11.45 గంటలకు వీఎ్‌సయూ ప్రాంగణానికి  చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం రెండు గంటల వరకు విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. అనంతరం 2:30 గంటలకు వర్సిటీ నుంచి రోడ్డు మార్గాన  బయలుదేరి నెల్లూరులోని రెడ్‌క్రాస్‌ కేన్సర్‌ ఆసుపత్రికి విచ్చేస్తారు. 40 నిమిషాలపాటు అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో గవర్నర్‌ పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3.40 గంటలకు పోలీసు పరేడ్‌ మైదానం నుంచి హెలికాప్టర్‌లో విజయవాడ తిరుగు పయనమవుతారు. గవర్నర్‌ పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా జిల్లాస్థాయి అధికారులకు విధులు కేటాయించారు. వీఎ్‌సయూ, రెడ్‌క్రాస్‌ కేన్సర్‌ ఆసుపత్రుల్లో ఏర్పాట్లను కలెక్టర్‌ చక్రధర్‌బాబు సోమవారం పరిశీలించారు. 


423 మందితో బందోబస్తు

నెల్లూరు (క్రైం) : గవర్నర్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ విజయరావు పర్యవేక్షణలో గవర్నర్‌ పర్యటన పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబ్‌, డాగ్‌స్క్వాడ్‌లు విస్తృత తనిఖీలు చేపట్టాయి. సోమవారం సాయంత్రం కలెక్టర్‌ చక్రధర్‌బాబు, ఏఎస్పీలు ముందస్తు భద్రతా ఏర్పాట్లను పరిశీలించి ట్రయల్‌ కాన్వాయ్‌ నిర్వహించారు. ఒక ఏఎస్పీ, ఐదుగురు డీఎస్పీలు, 8మంది సీఐలు, 32 మంది ఎస్‌ఐలు, 90 మంది ఏఎస్‌ఐలు, 155 మంది హెడ్‌కానిస్టేబుళ్లు ఇలా 423 మంది బందోబస్తులో పాల్గొంటున్నారు. పోలీసు కవాతు మైదానంలో సిబ్బందికి ఎస్పీ సలహాలు, సూచనలు చేశారు.



Updated Date - 2022-05-24T05:46:13+05:30 IST