జీవనానంద హేతువు

ABN , First Publish Date - 2022-01-15T06:36:44+05:30 IST

మానవ జీవన గమనంలో పండుగలు – జీవన మూల్య హేతువులు! సంప్రదాయం – ప్రాకృతికత్వాల మేలుకొలుపులు – తెలుగులు సంస్కృతీ వాహికలు!!...

జీవనానంద హేతువు

మానవ జీవన గమనంలో పండుగలు – జీవన మూల్య హేతువులు!

సంప్రదాయం – ప్రాకృతికత్వాల మేలుకొలుపులు – తెలుగులు సంస్కృతీ వాహికలు!!

మేషం నుంచి–మీనం దాకా సాగే పన్నెండు రాశుల గమనానికి ఉత్తర – దక్షిణాయనాల కాలం ‘ముక్తి’ పధం!!

‘స్వ’గతాల ‘సంక్రాంతి’ – మురిపాల ‘ము(గ్ధ)ద్దబంతి’!! సంస్కృతీ విరిశ్రుతి!!


మంచు కురిసే శీతగాలులు – పుష్యమాసపు సుధల – సూర్యతేజాలు

హేమంతంలో వసంతావిష్కరణ ప్రాకృతిక ఉత్సవ సౌరభాలు.

మకర – కర్కాటక సంక్రమణాలు సౌరగమనాలు –శాస్త్రం శాస్త్రీయతలకు నెలవులు!!


నెలగంట పట్టిన లోగిళ్లు – పురివిప్పిన గుమ్మిళ్లు అలరింపులు

మురిపాలు ముచ్చట్లు – రంగవల్లుల జాళ్ళు శోభాయమానాలు.

‍వైకుంఠపాళీలు వసుధ సూర్యరధాలు పుష్యమాసపు సుధలు

రమణీయంగా కమనీయంగా విందులు కురిపిస్తుంటాయి.


భోగిమంటల క్రాగి – భోజ్యవంటలు గ్రోలి

పితరాళిదానధర్మాల సంస్మరణలతేలడం

పాడి–ప్రాధాన్యతల – పశుపక్ష్యాదుల ఆరాధనం

ముక్కోటి దేవతల్ని ఒక్కటిగా కోరికొలిచే కొలుపులు

బొమ్మల కొలువులు – రేగుపండ్లతో బాల్యానికి వేడుకలు

ఆపై తలపై పడే చిన్ని నాణాలు ఆశగా ఆత్రంగా ఏరుకోవడంలోని ఆత్రతలు ఒకప్పటి బాల్యంస్మృతులు


తరాల అంతరాల్లో కళలు – సంస్కృతులు

జానపదాలు – జ్ఞానపదాలు ఆరుగాలం శ్రమనిర్వేదనలు

మళ్ళా జీవనానంద హేతువులుగా మరోసారి కాలం ముంగిట్లోకి రావాలి.


మళ్లీ వచ్చే సంక్రాంతినాటికైనా వెన్నెముకల ధర్నాలు

వేల ఎకరాల త్యాగాలు హేతువులు ఫలించాలి.

‘పాలకుల’ రాజనీతి ధర్మం 


‘పాలితుల’పాలిట సమ్యక్రాంతుల్నివ్వాలి.

మరో సంక్రాంతికి మోసులెత్తే ఆశలుగా చిగురించాలి.



‍– వి.యస్‌.ఆర్‌.ఎస్‌. సోమయాజులు

Updated Date - 2022-01-15T06:36:44+05:30 IST