మనో వినిర్మూలన

ABN , First Publish Date - 2020-09-30T08:11:18+05:30 IST

చైతన్యం తనను తాను విభజించుకుని, వస్తువులతో కూడి, ఆ వస్తువుల రూప, గుణ, స్వభావాలను తానుగా భావించుకున్నపుడు, అదే మనసు అవుతుంది. కలలో కలిగే మరణానుభూతి....

మనో వినిర్మూలన

చైతన్యం తనను తాను విభజించుకుని, వస్తువులతో కూడి, ఆ వస్తువుల రూప, గుణ, స్వభావాలను తానుగా భావించుకున్నపుడు, అదే మనసు అవుతుంది. కలలో కలిగే మరణానుభూతి మెలకువ రాగానే మరపునకు గురవుతున్నట్లు.. తన మూలాన్ని మరచినందువల్లనే  మనసు తన స్వస్థితిని కోల్పోతోంది. మనసును ఆత్మగా భావిస్తున్నందున, అప్పుడప్పుడూ అది చిత్తంగా భాసిల్లుతోంది. మనసు ఇప్పటిది. చిత్తం ఎప్పటి నుంచో ఉంది. మనోవృత్తులు అజ్ఞాన భూమికకు చెందినవి. చిత్తవృత్తులను నిరోధించడమే యోగం. అతడు, ఆమె, నేను, నాది అన్న విభజన అంతా మనసు వల్లనే జరుగుతోంది. కానీ, నిజానికి ఇవన్నీ కలిసి మనసు అవుతోంది. విచారిస్తే ఇవన్నీ కల్పనాత్మకాలే! ఈ కారణంగానే ద్వంద్వాలు ఏర్పడుతున్నాయి.  బంధనాలు, మోహాలు, వ్యామోహాలు మనసు సృష్టించే విపరీత భావాలే. మనసే ప్రపంచాన్ని కల్పిస్తున్నది. మన చేయి ఒకటే! అది చేసే కార్యకలాపాలు, వాటి వలన కలిగే స్పర్శానుభూతులు మాత్రం విభిన్నం!


మనసును నియంత్రించగలిగితే స్పర్థలే ఉండవు. మనోవాసనలను పోగొట్టుకోవడం సాధన వల్లనే  సాధ్యం. విచక్షణతో, వివేకంతో, విచారణతో చేసే సాధన.. వైరాగ్యానికి దారి తెరుస్తుంది. వైరాగ్యంతో శుభ్రమనసు రూపుదిద్దుకుంటుంది. శుభ్రమనసు నిర్వికారంగా ఉంటుంది. జాగ్రదవస్థలో.. అంటే మెలకువలో మనసు ఘోరంగాను, స్వప్నావస్థలో శాంతంగాను, గాఢనిద్రలో మూఢంగాను, సుషుప్తిలో నిశ్చలంగానూ ఉంటుంది. మనసును జయించడమే ప్రాథమికమూ, అంత్యమూ కూడా. మనసును.. అంటే తనను తాను జయించిననాడే అసలు విజయం. అలా జయించినవాడే నిజమైన విజేత. ఇంద్రియాలను జయించడం మాత్రమే కాదు. జయించిన ఇంద్రియాలతో జీవించడం ప్రధానం. దేనికీ చలించనిదే అనుగ్రహ విభూతి. దానికి ‘శ్రీ’ అనిపేరు.


శ్రీ అంటే లక్ష్మి; అధ్యాత్మలో అది జ్ఞానలక్ష్మి.

శ్రీ అంటే సరస్వతి; అధ్యాత్మలో అచ్చ తెలివి.

శ్రీ అంటే హాలాహలం; అధ్యాత్మలో ప్రపంచానుభవం.

శ్రీ అంటే సాలెపురుగు, అధ్యాత్మలో ప్రాపంచిక బంధనాలను పెంచుకోవడం.

అచలస్థితే మోక్షం. మోహ క్షయమే మోక్షం. సత్పురుష సమాశ్రయం, సత్సంగం, వాసనా క్షయం, ఆత్మవిచారం, శ్వాసనియంత్రణ వంటివి మనసును జయించడంలో ప్రధాన భూమికలు. ‘నేను బ్రహ్మమును కాదు’ అనుకోవడంతో మనసు బంధనకు గురవుతుంది. ‘నేను బ్రహ్మమునే’ అన్న భావనతో మనసు బ్రహ్మమే అవుతుంది. శుద్ధ మనస్కుడి స్థితి సమస్తమూ ఆత్మాంచితమే. అది అన్యభావనకు తావులేని అచల స్థితి.


- వీఎస్‌‌‌ఆర్‌ మూర్తి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త

Updated Date - 2020-09-30T08:11:18+05:30 IST