ఉక్కు ఆందోళనకు పలు సంఘాల మద్దతు

ABN , First Publish Date - 2021-02-27T06:07:42+05:30 IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో శుక్రవారం కూర్మన్నపాలెం జంక్షన్‌లో రాస్తారోకో నిర్వహించారు.

ఉక్కు ఆందోళనకు పలు సంఘాల మద్దతు
కూర్మన్నపాలెంలో నిరసన

కూర్మన్నపాలెం, ఫిబ్రవరి 26: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో శుక్రవారం కూర్మన్నపాలెం జంక్షన్‌లో రాస్తారోకో నిర్వహించారు. సుమారు రెండు గంటలు సేపు జాతీయ రహదారిపై నిర్వహించిన ఈ రాస్తారోకోలో ఉక్కు నిర్వాసితులు, వివిధ కాలనీ వాసులు, పలు రాజకీయ పార్టీల నాయకులు  పాల్గొని ఉక్కు కార్మికులకు తమ సంఘీభావం తెలిపారు. రహదారిపై భారీ ఎత్తున వాహనాలు బారులు తీరాయి. ఈ సందర్భంగా పలువురు పోరాట కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  ఉక్కు పరిశ్రమను మేము కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. రాస్తారోకో చేస్తున్న పలువురు కార్మికులు, స్థానిక నేతలు రహదారిపై బైఠాయించారు. ఇలా బైఠాయించిన వారిని పోలీసులు బలవంతంగా తరలించారు. కాగా, కార్మికులు కొంత మందిని పోలీసులు లేపి తీసుకు వెళ్తుంటే, పదుల సంఖ్యలో మరి కొంతమంది కార్మికులు రహదారిపై బైఠాయించటంతో పోలీసులకు హైరానా తప్పలేదు. అయితే పోలీసులు అసహనానికి లోను కాకుండా కార్మికులకు తగిన స్వేచ్ఛను ఇవ్వటంతో ఆ ప్రాంతంలో ు సమస్యలు తలెత్తకుండా రాస్తారోకో విజయవంతమైంది. ఈ రాస్తారోకోలో కార్మిక నాయకులు అయోధ్యరామ్‌, బూసి వెంకటరావు, మంత్రి రాజశేఖర్‌, ఆదినారాయణ, దామా సుబ్బారావు, ప్రగడ వేణుబాబు, దుగ్గపు దానప్పలు, బొడ్డ గోవింద్‌, ముద్దపు దామోదర్‌,వెంకట రమణ, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T06:07:42+05:30 IST