గుట్టను ఢీకొన్న కారు

ABN , First Publish Date - 2021-01-19T06:14:56+05:30 IST

మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన వంజంగి కొండ వద్ద పర్యాటకుల కారు అదుపుతప్పి పక్కనే వున్న రాతిగుట్టను బలంగా ఢీకొని పెద్ద గోతిలోకి దూసుకు పోయింది.

గుట్టను ఢీకొన్న కారు
వంజంగి వద్ద ప్రమాదానికి గురై ధ్వంసమైన కారు


ఐదుగురికి గాయాలు

నుజ్జునుజ్జయిన వాహనం


పాడేరురూరల్‌, జనవరి 18: మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన వంజంగి కొండ వద్ద పర్యాటకుల కారు అదుపుతప్పి పక్కనే వున్న రాతిగుట్టను బలంగా ఢీకొని పెద్ద గోతిలోకి దూసుకు పోయింది. సోమవారం ఉదయం వంజంగి వద్ద కొండలు, మేఘాలను సందర్శించి తిరిగి వస్తుండగా ఎనిమిది గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలైనట్టు స్థానికులు చెబుతున్నారు. కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులు కారుని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. కారు రిజిస్ర్టేషన్‌ నంబరు (ఏపీ 35 ఏఈ 4487) ప్రకారం ప్రమాదానికి గురైంది విజయనగరం జిల్లాకు చెందినవారుగా భావిస్తున్నారు. అయితే ఈ ఘటన గురించి సమాచారం వచ్చిందని, కానీ ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ శ్రీనివాస్‌ చెప్పారు. మంగళవారం ఉదయం సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలిస్తామని పేర్కొన్నారు. 


రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరు యువకులకు గాయాలు


కొయ్యూరు: మండంలోని తోటలూరు సమీపంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులకు తీవ్రగాయ్యాయి. నాతవరం మండలం సరుగుడు పంచాయతీ ఎరకంపేటకు చెందిన ఉల్లి నగేశ్‌ సంక్రాంతి పండుగ సందర్భంగా రావణాపల్లిలోని అత్తవారింటికి వచ్చాడు. సోమవారం ఉదయం ద్విచక్ర వాహనంపై వెళుతుండగా లంబసింగి సమీప చీకటిమామిడి గ్రామానికి చెందిన ఎస్‌.సత్తిబాబు ద్విచక్రవాహనంపై వస్తూ బలంగా ఢీకొట్టాడు. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు ఆటోలో ఎక్కించి కృష్ణాదేవిపేట పీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం నర్సీపట్నం ఏరియా ఆస్పతికి పంపారు. కాగా ఈ ప్రమాదంపై ఇంతవరకు ఎటువంటి సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు.


రెండు బస్సులు ఢీ... పలువురికి స్వల్పగాయాలు


పెదబయలు: మండలంలోని చుట్టుమెట్ట గ్రామానికి సమీపంలో రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పాడేరు నుంచి జోలాపుట్టు వెళుతున్న బస్సు, పెదబయలు నుంచి పాడేరు వెళుతున్న బస్సు చుట్టుమెట్ట వద్ద మలుపులో ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం కారణంగా సుమారు గంటసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.


రెండు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు


నక్కపల్లి: మండలంలోని చినదొడ్డిగల్లు హైవే జంక్షన్‌ వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు గాయపడ్డారు. రాంబిల్లి మండలం పంచదార్లకు చెందిన దంపతులు బైక్‌పై చినదొడ్డిగల్లు వెళుతుండగా వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొంది. దీంతో బైక్‌ వెనుక కూర్చొన్న జి.జయలక్ష్మితోపాటు ఆమె భర్తకు స్వల్పగాయాలయ్యాయి. కాగా నక్కపల్లి మండలం సారిపల్లివానిపాలెం వద్ద పెదతీనార్ల నుంచి తునివైపు వెళ్తున్న బైక్‌ను వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో బైక్‌పై వున్న ఒక మహిళకు స్వల్పగాయాలయ్యాయి. అయితే ఈ రెండు ప్రమాదాలకు సంబంధించి తమకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు చెప్పారు.


అదే అపార్టుమెంట్‌.... మరో ఫ్లాట్‌లో చోరీ


అనకాపల్లిటౌన్‌: స్థానిక రింగురోడ్డులోని గీతాంజలి-2 అపార్టుమెంట్‌లోని ఒక ఫ్లాట్‌లో చోరీ జరిగినట్టు ఫిర్యాదు అందిందని పట్టణ ఎస్‌ఐ డి.లక్ష్మీనారాయణ తెలిపారు. ఆయన చెప్పిన సమాచారం మేరకు... వ్యాపారి కొమ్మానపల్లి శ్రీనివాసరావు సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామం సాలూరు వెళ్లి, ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో తిరిగి వచ్చారు. తలుపు గడియలు విరిగిపోయి ఉండడంతో చోరీ జరిగిందని అనుమానించి లోపలికి వెళ్లి చూశారు. బీరువాలోని సీక్రెట్‌ లాకర్‌ను పగలగొట్టి, ఐదున్నర తులాల బంగారం వస్తువులు అపహరించుకుపోయినట్టు గుర్తించారు. దీనిపై సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అపార్టుమెంట్‌లో కోరిబిల్లి హరికృష్ణ చైతన్య ఫ్లాట్‌లో కూడా చోరీ జరిగినట్టు ఆదివారం ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. ఇతని నివాసంలో ఎనిమిదిన్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.20 వేలను ఆగంతకులు అపహరించుకుపోయారు. ఈ రెండు చోరీలకు పాల్పడింది ఒకే ముఠా అయి వుంటుందని, సీసీ కెమెరాలు ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకుంటామని ఎస్‌ఐ తెలిపారు. 


మూడు కిలోల గంజాయితో ఇద్దరి అరెస్టు


అనకాపల్లిటౌన్‌: ఏజెన్సీ నుంచి ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న మూడు కిలోల గంజాయితో ఇద్దరిని అరెస్టు చేసినట్టు పట్టణ ఎస్‌ఐ ఆర్‌.ధనుంజయ్‌ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన కొల్లాబత్తుల పాల్‌శ్యామ్‌సన్‌, విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన కోట్ని గోపీ అరకులోయలో గంజాయి కొనుగోలు చేశారు. ద్విచక్ర వాహనంపై సబ్బవరం మీదుగా అనకాపల్లి వైపు వస్తుండగా సుంకరమెట్ట జంక్షన్‌ వద్ద పట్టుకున్నట్టు ఎస్‌ఐ చెప్పారు. 


పారిపోయేందుకు విఫలయత్నం

కాగా నిందితులను సాయంత్రం కోర్టులో హాజరుపరచగా.... న్యాయమూర్తి 14 రోజులపాటు రిమాండ్‌ విధించారు. అనంతరం సబ్‌జైలుకు తరలించేందుకు జీపులో ఎక్కిస్తుండగా పాల్‌శ్యామ్‌సన్‌ పోలీసులను తోసేసి పెట్రోల్‌ బంకు పక్కనున్న ఇళ్లల్లోకి పారిపోయాడు. పోలీసులతోపాటు స్థానికులు కూడా అతన్ని పట్టుకోవడానికి పరుగులు తీశారు. అతను ఒక పెంకుటిల్లుపైకి ఎక్కడంతో ఆ ఇంటిని చుట్టుముట్టారు. తప్పించుకునే మార్గం లేకపోవడంతో కిందకు దిగివచ్చి లొంగిపోయాడు. అనంతరం పోలీసులు ఇద్దరినీ సబ్‌జైలుకు తరలించారు.


పేకాట, కోడిపందేల శిబిరాలపై పోలీసుల దాడులు


కోటవురట్ల్ల, జనవరి 18: మండలంలోని అన్నవరం గ్రామ శివారులో వున్న ఒక జీడిమామిడి తోటలో పేకాట ఆడుతున్నట్టు అందిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఎనిమిది మందిని అరెస్టు చేసి, రూ.17,920 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ సురేశ్‌కుమార్‌ చెప్పారు.


కలిగొట్లలో కోడిపందేలపై....

దేవరాపల్లి: మండలంలోని కలిగొట్లలో సోమవారం కోడిపందేల శిబిరంపై దాడి చేసిన ఎనిమిది మందిని అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ సింహాచలం సోమవారం తెలిపారు. ఎనిమిది కోళ్లు, రూ.650 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.


వెంకటాపురంలో....

మునగపాక: మండలంలోని వెంకటాపురంలో సోమవారం రెండుచోట్ల కోడిపందేల శిబిరాలపై దాడులు నిర్వహించినట్టు ఎస్‌ఐ డి.శ్రీనివాసరావు తెలిపారు. ఒకచోట ముగ్గురిని అరెస్టు చేసి రెండు కోళ్లు, మూడు సెల్‌ఫోన్లు, రూ.3,460 నగదు స్వాధీనం చేసుకున్నారు. మరోచోట ఒకరిని అరెస్టు చేసి రూ.22,850 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2021-01-19T06:14:56+05:30 IST