ద్యుత్‌ షాక్‌తో యువకుడు మృతి

ABN , First Publish Date - 2021-01-16T05:32:15+05:30 IST

మండలంలోని గిడుతూరు గ్రామంలో విద్యుదాఘాతంతో యువకుడు మృతిచెందాడు.

ద్యుత్‌ షాక్‌తో యువకుడు మృతి
ముకల దొరబాబు (ఫైల్‌ ఫొటో)

సర్వీస్‌ వైరు సరిచేస్తుండగా ప్రమాదం


మాకవరపాలెం, జనవరి 15: మండలంలోని గిడుతూరు గ్రామంలో విద్యుదాఘాతంతో యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు... గిడుతూరుకు చెందిన ముకల దొరబాబు(18) ప్రైవేటు ఎలక్ర్టీషియన్‌. గురువారం ఉదయం ఒక ఇంటికి సర్వీస్‌ వైరు బిగించే పనిలో భాగంగా విద్యుత్‌ స్తంభం ఎక్కాడు. వైరు సరిచేస్తుండగా విద్యుత్‌ వైరు తగలడంతో షాక్‌కు గురై కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడడంతో అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ కరక రాము తెలిపారు. 


చీడిమెట్టలో యువతి ఆత్మహత్య 

పాడేరురూరల్‌: మండలంలోని కుజ్జెలి పంచాయతీ చీడిమెట్ట గ్రామంలో గిరిజన యువతి కొర్రా పద్మకుమారి(21) గురువారం ఉదయం ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఎస్‌ఐ ఎం.శ్రీనివాస్‌ తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించామని చెప్పారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.


చాపరాయి ఊబిలో మునిగి... పర్యాటకుడు మృతి

డుంబ్రిగుడ: విజయవాడకు చెందిన ఒక యువకుడు మండలంలోని చాపరాయి జలపాతం సందర్శనకు వచ్చి, ఊబిలో పడి మృతిచెందినట్టు ఎస్‌ఐ గోపాల్‌ తెలిపారు. ఆయన అందించిన వివరాల ప్రకారం విజయవాడ నగరంలోని కానూరు ప్రాంతంలో వున్న సనత్‌ నగర్‌కు చెందిన ఒక కుటుంబం రెండు రోజుల క్రితం విశాఖపట్నం వచ్చింది. శుక్రవారం అరకులోయలో సందర్శనకు వెళ్లారు. మధ్యాహ్నం తరువాత డుంబ్రిగుడ మండలం చాపరాయి జలపాతం వద్దకు చేరుకున్నారు. అందరూ సరదాగా గడుపుతుండగా నుపదా విజయకుమార్‌ (22) ఊబిలో చిక్కుకుకుని మునిగిపోయాడు. అక్కడున్న వారు కాపాడడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో మృతిచెందాడు. అందిన సమాచారం మేరకు పోలీసు ఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని వెలికి తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం అరకులోయ తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు ఎస్‌ఐ గోపాల్‌ చెప్పారు.


అనుమానస్పద స్థితిలో యువకుడు మృతి

మునగపాక: మండలంలోని గవర్లఅనకాపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు,స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. ఆడారి శివగణేశ్‌ అలియాస్‌ సుమన్‌ (40) సమీపంలోని పరవాడ ఫార్మాసిటీలోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్యతోపాటు ఐదేళ్ల నుంచి గవర్ల అనకాపల్లిలో నివాసం వుంటున్నాడు. పది రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల నుంచి సుమన్‌ ఇంటి నుంచి బయటకు రావడంలేదు. స్థానికులకు అనుమానం వచ్చి శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లోకి వెళ్లి చూడగా మంచంపై విగతజీవిగా పడివున్నాడు. సమాచారం అందకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. 


అనుమానాస్పదంగా వృద్ధురాలి మృతి 

కృష్ణాదేవిపేట: గొలుగొండ మండలం లింగంపేటలో ఒక వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి. లింగంపేటకు చెందిన మండపాక ముసలమ్మ(70) ఒక్కటే నివాసం వుంటున్నది. ఈమె కుమార్తె తుంపాల సత్యవతి మునగపాక మండలం గంటావానిపాలంలో వుంటున్నది. సత్యవతి గురువారం ఉదయం లింగంపేటలో తల్లి వద్దకు వచ్చింది. ముసలమ్మ మంచంపై విగతజీవిగా పడివుంది. శరీరంపై పొక్కులు కనిపించడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొయ్యూరు సీఐ వి.రమణ, కృష్ణాదేవిపేట ఎస్‌ఐ జి.పైడిరాజు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. అనుమానాస్పదంగా మృతిచెందినట్టు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.


వడ్డిపలో ఇరువర్గాల ఘర్షణ... కేసులు నమోదు

రోలుగుంట: మండలంలోని వడ్డిప గ్రామంలో గురువారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో ముక్కుడుపల్లి నూకరాజు, అచ్చిరాజు, అయిబాబులు... వడ్డిపలో వైఎస్సార్‌ విగ్రహం వద్ద కుర్చొని ఉన్న పెదిరెడ్ల జీవన్‌పై వాటర్‌ ప్యాకెట్లలోని నీటి చల్లారు. దీంతో ఘర్షణ పడ్డారు. గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని నచ్చచెప్పి పంపేశారు. మళ్లీ శుక్రవారం మధ్యాహ్నం ఇరువర్గాల వారు ఘర్షణకు దిగి కొట్టుకున్నారు. దీనిపై ఉభయులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసినట్టు ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు చెప్పారు.


Updated Date - 2021-01-16T05:32:15+05:30 IST