జెడ్పీ స్థలంలో ఏర్పాటు చేసిన జనరేటర్‌, సెప్టిక్‌ ట్యాంక్‌

ABN , First Publish Date - 2020-10-28T09:11:30+05:30 IST

ఆక్రమణలకు అంతు లేకుండా పోతోంది. పోరంబోకు స్థలాలు, ఖాళీగా వున్నవి ఆక్రమించుకోవడం చూశాం. కానీ ఇక్కడ ఏకంగా జిల్లా పరిషత్‌ కార్యాలయం ఆవరణనే ఆక్రమించేశారు.

జెడ్పీ స్థలంలో ఏర్పాటు చేసిన జనరేటర్‌, సెప్టిక్‌ ట్యాంక్‌

జెడ్పీలోనే ఆక్రమణ!

కళ్లెదుట కనిపిస్తున్నా చోద్యం చూస్తున్న అధికారగణం

నిబంధనలు అతిక్రమించిన వారు పొరుగు జిల్లా మంత్రి బంధువులు



(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): ఆక్రమణలకు అంతు లేకుండా పోతోంది. పోరంబోకు స్థలాలు, ఖాళీగా వున్నవి ఆక్రమించుకోవడం చూశాం. కానీ ఇక్కడ ఏకంగా జిల్లా పరిషత్‌ కార్యాలయం ఆవరణనే ఆక్రమించేశారు. పొరుగు జిల్లా అమాత్యులకు చెందిన బంధువు కావడంతో అధికారులు కూడా నోరు మెదపడం లేదు. ఇదీ దీని కథ...


జిల్లా పంచాయతీరాజ్‌ ఉద్యోగుల సంఘం అసోసియేషన్‌ అభ్యర్థన మేరకు సంఘ భవనం కోసం జెడ్పీ కార్యాలయ ఆవరణలో కొంత స్థలం కేటాయించారు. నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరుచేశారు. దాంతో అక్కడ రెండు అంతస్థుల భవనం నిర్మించాలని నిర్ణయించారు. కింద నిర్మాణం పూర్తికాగానే సంఘం ఆర్థిక అవసరాల నిమిత్తం అంటూ దానిని కృష్ణా మెడికల్‌ సెంటర్‌ యాజమాన్యానికి నెలకు రూ.12 వేలకు అద్దెకు ఇచ్చారు. అందులో స్కానింగ్‌ సెంటర్‌ పెడతామని వారు పేర్కొన్నారు. దానిని దసరా రోజున అధికార పార్టీ నేతలతో ప్రారంభింపజేశారు. అంతవరకు బాగానే ఉంది. అయితే ఈ మెడికల్‌ సెంటర్‌ 24 గంటలూ నడవడానికి అవసరమైన భారీ జనరేటర్‌ను జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటుచేశారు. అలాగే రోగుల నుంచి యూరిన్‌ సేకరించేందుకు అవసరమైన టాయిలెట్‌ సెప్టిక్‌ ట్యాంక్‌ను కూడా జెడ్పీ కార్యాలయం ఆవరణలోనే పెద్ద గోతులు తవ్వి ఏర్పాటుచేశారు.


ఈ రెండింటి వల్ల ఆ ఆవరణలో దుర్గంధం వ్యాపిస్తోంది. ఈ రెండూ ఏర్పాటుచేసిన స్థలం సంఘానికి చెందినది కాదు. అయినా మెడికల్‌ సెంటర్‌ నిర్వాహకులు ఎంచక్కా ప్రభుత్వ కార్యాలయం ఆవరణను ఉపయోగించేసుకుంటున్నారు. పైగా ఈ సెంటర్‌కు పార్కింగ్‌ కూడా లేదు. దానికి కూడా జెడ్పీ కార్యాలయం ఆవరణనే వినియోగించుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఎవరూ ప్రశ్నించకపోవడానికి కారణం...ఆ మెడికల్‌ సెంటర్‌ నిర్వాహకులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన బంధువులు కావడమేనని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఇది నిజమే అన్నట్టుగా ఈ సెంటర్‌ని జిల్లా మంత్రి, జిల్లా ఎమ్మెల్యే ప్రారంభించడం గమనార్హం. 


భవనమే అద్దెకు ఇచ్చాం...జనరేటర్‌ ఏర్పాటు తప్పే..సత్తిబాబు, అసోసియేషన్‌ సంఘం నాయకులు

మెడికల్‌ సెంటర్‌కు కింద భవనం మాత్రమే అద్దెకు ఇచ్చాం. జనరేటర్‌, సెప్టిక్‌ ట్యాంక్‌ కార్యాలయం ఆవరణలో నిర్మించడం తప్పే. దీనిపై వారితో మాట్లాడాల్సి ఉంది. 

Updated Date - 2020-10-28T09:11:30+05:30 IST