15 తులాల బంగారం, రూ.3.8 లక్షలు అపహరణ
గాజువాక/ఆటోనగర్, అక్టోబరు 26: పారిశ్రామిక ప్రాంతంలోని ఎల్వీనగర్‌లో ఆదివారం ఆర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. గాజువాక క్రైం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..తుంపాల చిరంజీవి తన కటుంబ సభ్యులతో కలిసి ఎల్వీనగర్ స్ట్రీట్ నంబరు 11లోని సొంత ఇంటిలో నివాసం ఉంటున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అర్ధరాత్రి ఇంటికి వచ్చిన చిరంజీవి తన భార్య, ఇద్దరు పిల్లలతో గాఢ నిద్రలోకి జారుకున్నారు. ఇదే అదనుగా భావించిన దొంగలు తలుపు గడియను చాకచక్యంగా తొలగించి ఇంటిలోకి ప్రవేశించి బీరువాలో ఉంచిన 15 తులాల బంగారు ఆభరణాలు, మూడు లక్షల ఎనభై వేల రూపాయలు నగదును అపహరించారు. అనంతరం ఇంటి బయట గడియ పెట్టి అక్కడి నుంచి పరారయ్యారు.
సోమవారం ఉదయం నిద్రలేచిన చిరంజీవి భార్య జగదీశ్వరి ఇంటి సింహద్వారం బయటి నుంచి గడియ పెట్టివున్న విషయం గమనించి అనుమానంతో ఇల్లంతా పరిశీలించగా చోరీ జరిగినట్టు గ్రహించి లబోదిబోమన్నారు. వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాజువాక పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. క్రైం డీసీపీ వి.సురేశ్ బాబు, ఏసీపీ పెంటారావు, సీఐ మల్లేశ్వర రావు, ఎస్‌ఐ వెంకటరావులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సహకారంతో దర్యాప్తును వేగవంతం చేశారు. కాగా పిల్లల భవిష్యత్ అవసరాల కోసం భద్రపరిచిన నగలు, నగదు అపహరణకు గురి కావడంతో ఇటిల్లిపాదీ విలపిస్తున్నారు. కాలనీలో సీసీ కెమరాలు అమర్చుకోవాలని పోలీసులు స్థానికులకు సూచించారు.