సచివాలయం.. సమస్యలతో సతమతం

ABN , First Publish Date - 2020-10-02T10:05:52+05:30 IST

ఉద్యోగుల మధ్య సమన్వయలోపం, కొరవడిన జవాబుదారీతనం, అత్యధిక కార్యాలయాలకు అరకొర వసతి, పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు లేకపోవడం...వెరసి గ్రామ/వార్డు సచివాల యాల ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు.

సచివాలయం.. సమస్యలతో సతమతం

బాలారిష్టాలు దాటని వ్యవస్థ

ఆర్భాట ప్రచారం...సేవల్లో జాప్యం

ఐదో వంతు పోస్టులు ఖాళీబాలారిష్టాలు దాటని వ్యవస్థ

ఆర్భాట ప్రచారం...సేవల్లో జాప్యం

ఐదో వంతు పోస్టులు ఖాళీ

అరకొర వసతితో సిబ్బంది అగచాట్లు

10 శాఖల ఉద్యోగులు...రెండే కంప్యూటర్లు

ఇతర శాఖలతో కొరవడిన సమన్వయం

సిబ్బందిపై పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగుల పెత్తనం


(విశాఖపట్నం, నర్సీపట్నం-ఆంధ్రజ్యోతి):

ఉద్యోగుల మధ్య సమన్వయలోపం, కొరవడిన జవాబుదారీతనం, అత్యధిక కార్యాలయాలకు అరకొర వసతి, పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు లేకపోవడం...వెరసి గ్రామ/వార్డు సచివాల యాల ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. దీంతో ఏడాది క్రితం ఏర్పాటుచేసిన సచివాలయ వ్యవస్థ సమస్యలతో సతమతం అవుతూ, ఇంకా బాలారిష్టాలు దాటలేదు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 334 రకాల సేవలు అందిస్తున్నామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు సచివాలయాల్లో వేలాడదీసిన బ్యానర్లు, అతికించిన పోస్టర్లకే పరిమితమయ్యాయి.


గ్రామ/వార్డు స్థాయిలోనే అన్ని రకాల ప్రభుత్వ సేవలు అందించాలన్న ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం గత ఏడాది అక్టోబరు రెండో తేదీన సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమైన పది ప్రభుత్వ శాఖల సేవలు సచివాలయాల ద్వారానే అందుతాయని, ఇక నుంచి మండల, డివిజన్‌ కార్యాలయాలకు వెళ్లనవసరం లేదని ప్రకటించింది.


ప్రతి సచివాలయానికి కార్యదర్శి హోదాలో ఒక అడ్మిన్‌, ఇంకా సంక్షేమం, విద్య, రెవెన్యూ, ప్రణాళిక, వైద్య ఆరోగ్య, స్ర్తీ శిశు సంరక్షణ, విద్యుత్‌, పారిశుధ్య మౌలిక సదుపాయాల విభాగాలకు అసిస్టెంట్లు వుంటారని పేర్కొంది. ఈ మేరకు జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో 733 గ్రామ సచివాలయాలు, జీవీఎంసీ, నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీల్లో 572 వార్డు సచివాలయాలను ఏర్పాటుచేశారు. గ్రామ సచివాలయాల్లో మొత్తం 6,803 పోస్టులకు ప్రస్తుతం 5,604 మంది ఉన్నారు. 1,199 (17.62 శాతం) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీ కోసం గత నెలలో పరీక్షలు నిర్వహించారుచాలీచాలని వసత.



జిల్లాలో 733 గ్రామ సచివాలయాలకుగాను 661 సచివాలయాలను ప్రభుత్వ భవనాల్లో (వీటిల్లో 90 శాతం వరకు పంచాయతీ కార్యాలయలు), 72 సచివాలయాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఒక్కో కార్యాలయంలో 13 మంది సిబ్బంది ఉన్నారు. పంచాయతీ భవనాల్లో ఒకటి లేదా రెండు గదులు మాత్రమే వున్నచోట సిబ్బంది ఇరుక్కుని కూర్చోవాల్సి వస్తున్నది. మౌలిక వసతుల కొరతతో ఇబ్బంది పడుతున్నారు. ప్రతి సచివాలయానికి ఫర్నిచర్‌ సమకూర్చినప్పటికీ కంప్యూటర్లు రెండే ఇవ్వడంతో 10 విభాగాలకు చెందిన ఉద్యోగులు వాటితోనే సర్దుకోవాల్సి వస్తున్నది. ఇతర ప్రభుత్వ శాఖలను సచివాలయ వ్యవస్థకు 

పూర్తిస్థాయిలో అనుసంధానించలేదు. దీనివల్ల పనుల్లో తీవ్ర జాప్యం ఏర్పడుతున్నది. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 334 రకాల సేవలు, దరఖాస్తు చేసిన ఎన్ని రోజుల్లో పూర్తిచేయాలో పేర్కొంటూ ప్రతి సచివాలయంలో ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటుచేశారు. కానీ చాలా కార్యాలయాల్లో నిర్ణీత గడువులో పనులు పూర్తికావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


అరకొర సేవలు 

సచివాలయాల్లో అన్ని సేవలు సకాలంలో అందడం లేదు. పింఛన్ల మార్పిడి, కుల ధ్రువీకరణ పత్రాల జారీ సజావుగా జరగడం లేదు. ఇసుక బుకింగ్‌కు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవలసి రావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. సిబ్బందిపై పర్యవేక్షణ లేకపోవడంతో పనులు జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సొంత భవనాలు లేకపోవడంతో చాలాచోట్ల అద్దె తక్కువనే ఉద్దేశంతో మొదటి అంతస్థులో సచివాలయాలను ఏర్పాటుచేశారు. దీనివల్ల వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.


సమన్వయ లోపం

ప్రధానంగా ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు, సచివాలయాల ఉద్యోగులకు మధ్య సమన్వయం కొరవడింది. ధ్రువపత్రాల జారీలో రెవెన్యూ అధికారుల నుంచి సహకారం అందడం లేదనే వాదన వినిపిస్తోంది. సచివాలయాల్లో ఉద్యోగుల చేత పనులు చేయించే బాధ్యతను పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం అప్పగించింది. కానీ వారి ఆదేశాలను సచివాలయాల సిబ్బంది పట్టించుకోవడం లేదనే విమర్శ ఉంది. అయితే రెవెన్యూ, మండల పరిషత్‌, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది తమపై పెత్తనం చెలాయిస్తున్నారని, తమ శాఖకు సంబంధం లేని పనులు అప్పగిస్తున్నారని సచివాలయాల ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2020-10-02T10:05:52+05:30 IST