జిల్లాకు ఐదు బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు?

ABN , First Publish Date - 2020-10-01T08:35:33+05:30 IST

జిల్లాకు చెందిన ఐదుగురు వైసీపీ నేతలకు బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌/చైర్‌పర్సన్‌ పదవులు దక్కనున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి జాబితా సిద్ధమైనా అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.

జిల్లాకు ఐదు బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు?

మత్స్యకార కార్పొరేషన్‌ చైర్మన్‌గా కోలా గురువులు?

గవర కార్పొరేషన్‌కు బొడ్డేడ ప్రసాద్‌

యాత కార్పొరేషన్‌కు పిల్లి సుజాత

నాగవంశం కార్పొరేషన్‌కు బుగత లిఖిత

నగరాల కార్పొరేషన్‌కు అప్పలకొండమ్మ


విశాఖపట్నం, సెప్టెంబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు చెందిన ఐదుగురు వైసీపీ నేతలకు బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌/చైర్‌పర్సన్‌ పదవులు దక్కనున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి జాబితా సిద్ధమైనా అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం...మత్స్యకార కార్పొరేషన్‌ చైర్మన్‌గా వైసీపీ సీనియర్‌ నేత కోలా గురువులు నియమితులు కానున్నారు. గురువులు 2009 ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.


ఆ తర్వాత వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో తిరిగి దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. పార్టీ కార్యకలాపాలను కొనసాగించినప్పటికీ 2019 ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టు దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆయన్ను పార్టీ అధ్యక్షుడు జగన్‌ పిలిచి మత్స్యకార కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇక గవర కార్పొరేషన్‌ చైర్మన్‌గా మునగపాకకు చెందిన బొడ్డేడ ప్రసాద్‌ను నియమించనున్నట్టు తెలిసింది. ప్రసాద్‌ ఎలమంచిలి నియోజకవర్గంలో బలమైన నేతగా గుర్తింపు పొందారు.


అలాగే యాత కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా నగరంలోని నరసింహనగర్‌కు చెందిన పిల్లి సుజాత పేరు ఖరారైనట్టు తెలిసింది. ఆమె బీఎస్సీ, బీఎల్‌ చదువుకున్నారు. ఆమె భర్త పిల్లి నూకరాజు ఆర్టీవోగా పనిచేసి 2010లో ఉద్యోగ విరమణ చేశారు. 2012 నుంచి వైసీపీలో చేరారు. నాగవంశం కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా సీతమ్మధారకు చెందిన బుగత లిఖిత పేరును పరిశీలిస్తున్నారు. ఆమె డిగ్రీ చదువుకుని వైసీపీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఆమె భర్త బుగత నర్సింగరావు పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌ అనుచరుడిగా గుర్తింపుపొందారు.


నగరాల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా బొడ్డు అప్పలకొండమ్మ పేరు ప్రతిపాదించారు. అయితే ఆమె నాగవంశం కులస్తురాలని, తమకు ఆ పదవి కేటాయించాలంటూ నగరాల కుల పెద్దలు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినప్పుడు ఆ తప్పిదాన్ని సవరిస్తుందని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. 

Updated Date - 2020-10-01T08:35:33+05:30 IST