నిబంధనల పేరిట భక్తులను నియంత్రించడం సరికాదు: త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి

ABN , First Publish Date - 2020-10-01T08:09:10+05:30 IST

కరోనా నిబంధనల పేరుతో అప్పన్న స్వామి దర్శనానికి విచ్చేసే భక్తులను నియంత్రించడం సరికాదని, గతంలో మాదిరిగానే భక్తులకు దర్శనాలను యథావిధిగా కల్పించాలని అధికారులను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విశిష్టాద్వైత మత వ్యాపకులు త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి కోరారు.

నిబంధనల పేరిట భక్తులను నియంత్రించడం సరికాదు: త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి

సింహాచలం, సెప్టెంబరు 30: కరోనా నిబంధనల పేరుతో అప్పన్న స్వామి దర్శనానికి విచ్చేసే భక్తులను నియంత్రించడం సరికాదని, గతంలో మాదిరిగానే భక్తులకు దర్శనాలను యథావిధిగా కల్పించాలని అధికారులను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విశిష్టాద్వైత మత వ్యాపకులు త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి కోరారు. బుధవారం ఆయన ఆధ్యాత్మికవేత్త అహోబల జీయర్‌స్వామితో కలిసి సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. భౌతిక దూరం పాటించడం, తప్పనిసరిగా మాస్కులు ధరించడం, శానిటైజర్‌తో పరిశుభ్రపరచుకోవడం వంటివి అందరూ పాటించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.


కాగా చినజీయర్‌స్వామికి అధికార లాంఛనాలతో మంగళ వాయిద్యాలు, పూర్ణకుంభంతో ఇన్‌చార్జి ప్రధానార్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు స్వాగతం పలకగా, స్వామివార్లకు ద్వారకా తిరుమల, సింహాచల దేవస్థానాల ఈవోలు డి.భ్రమరాంబ, వి.త్రినాథరావు ఆహ్వానం పలికారు. అర్చకస్వాములు లోకకల్యాణం పేరిట అప్పన్న స్వామికి అష్టోత్తర శతనామార్చన జరిపి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చినజీయర్‌స్వామిని దేవస్థానం ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్‌ దివంగత పి.ఆనందగజపతిరాజు సతీమణి సుధాగజపతిరాజుతో పాటు పలువురు భక్తులు దర్శించుకున్నారు. 


వారిజ ఆశ్రమంలో.. 

భీమునిపట్నం: మండలంలోని మంగమారిపేట వారిజ ఆశ్రమంలో  చినజీయర్‌స్వామి ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. ఇటీవల మృతి చెందిన తన తల్లి పేరుతో నిర్మించిన తధీయ ఆరాధన మండపాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.


ఎంవీపీలోని వెంకన్న ఆలయంలో..

ఎంవీపీకాలనీ: ఎంవీపీకాలనీ సెక్టార్‌-6లోని వేంకటేశ్వరస్వామి, ప్రసన్న ఆంజనేయస్వామివారి ఆలయాన్ని చినజీయర్‌స్వామి, అహోబిల జీయర్‌స్వామి సందర్శించారు. ఆలయంలో వారు మంగళ శాసనం చేశారు. వారికి ఆలయ కార్యవర్గం, అర్చకులు పూర్ణ కలశంతో ఆహ్వానించి, ఘనంగా సత్కరించారు. 

Updated Date - 2020-10-01T08:09:10+05:30 IST