విరాట్‌ రానట్టే!

ABN , First Publish Date - 2020-09-28T10:44:58+05:30 IST

నౌకాదళంలో అతి పురాతన ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ ‘ఐఎన్‌ఎస్‌ విరాట్‌ మ్యూజియం’పై విశాఖ ప్రజల ఆశలు నీరుగారిపోయాయి. నేవీ, వీఎంఆర్‌డీఏ, పర్యాటక శాఖ అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి.

విరాట్‌ రానట్టే!

నౌకా మ్యూజియం ఏర్పాటుపై నీరుగారిన ఆశలు

విశాఖకు తెచ్చేందుకు గత ప్రభుత్వం విశ్వప్రయత్నం

మంగమారిపేట వద్ద రూ.100 కోట్లతో జెట్టీ నిర్మాణానికి ప్రతిపాదనలు

మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడడంతో బ్రేకులు

విరాట్‌ నౌకను రప్పించడానికి ప్రయత్నాలు చేయని వైసీపీ ప్రభుత్వం

తుక్కుగా మార్చాలని కేంద్రం నిర్ణయం

ముంబై నుంచి గుజరాత్‌కు చివరి ప్రయాణం


(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి):

నౌకాదళంలో అతి పురాతన ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ ‘ఐఎన్‌ఎస్‌ విరాట్‌ మ్యూజియం’పై విశాఖ ప్రజల ఆశలు నీరుగారిపోయాయి. నేవీ, వీఎంఆర్‌డీఏ, పర్యాటక శాఖ అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. చివరకు విరాట్‌ను తుక్కుగా మార్చాలని నిర్ణయించారు. అందులో భాగంగా విరాట్‌ చివరి ప్రయాణం ముంబైలో శనివారం మొదలైంది. గుజరాత్‌ చేరుకున్నాక అక్కడ దానిని ముక్కలుగా విడదీసి తుక్కుగా మార్చనున్నారు. 


ఐఎన్‌ఎస్‌ విరాట్‌ భారీ యుద్ధనౌక. సీ హారియర్స్‌, సీ కింగ్స్‌, చేతక్‌ తదితర 26 హెలికాప్టర్లను ఇందులో నిలుపుకొనే సౌకర్యం వుంది.  బ్రిటీష్‌ రాయల్‌ నేవీలో 27 ఏళ్లు, భారత నౌకాదళంలో 29 ఏళ్లపాటు సేవలు అందించి 2017లో సేవల నుంచి నిష్క్రమించింది. బరువు సుమారు 29 వేల టన్నులు. పొడవు 227 మీటర్లు, వెడల్పు 46 మీటర్లు. సేవల నుంచి నిష్క్రమించిన విరాట్‌ను ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా నిర్వహణ కోసం తీసుకుంటే ఉచితంగా అప్పగిస్తామని నాటి కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ ప్రకటించారు.


దీంతో అప్పటి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ముందుకు వచ్చారు. కురుసుర సబ్‌మెరైన్‌లా మ్యూజియంగా, పర్యాటక కేంద్రంగా మార్చాలని నిర్ణయించారు. నౌకను సముద్ర తీరానికి తీసుకొచ్చి, జెట్టీలో బెర్తింగ్‌ చేయాలని భావించారు. దీనికి అనువైన ప్రాంతాన్ని మంగమారిపేట వద్ద ఎంపిక చేసి రూ.100 కోట్లతో జెట్టీ నిర్మించాలని నిర్ణయించారు. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా తనకు కావాలని ప్రతిపాదించింది. 


ముంబై వెళ్లివచ్చిన బృందం

రాష్ట్ర పర్యాటక శాఖ, వీఎంఆర్‌డీఏ, నేవీ అధికారులు ముంబై వెళ్లి విరాట్‌ను అమూలాగ్రం పరిశీలించారు. హోటల్‌గా తీర్చిదిద్దితే బాగుంటుందని ప్రతిపాదించారు. వేయి గదులు, సువిశాలమైన డెక్‌ ఉన్నాయని, పెద్ద పెద్ద ఈవెంట్లు నిర్వహించుకోవడానికి డెక్‌ ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. రూ.300 కోట్ల సాయం చేస్తే దానిని మ్యూజియం, హోటల్‌గా మారుస్తామని ప్రతిపాదించారు. కానీ కేంద్ర రక్షణ శాఖ తర్జనభర్జన పడింది.


ఈ నౌక నిర్వహణకు మూడేళ్లకోసారి భారీగా(రూ.100 కోట్లు) ఖర్చు చేయాల్సి ఉంటుందని, అది ఏ ప్రభుత్వానికైనా కష్టమని భావించి ఎవరికీ ఇవ్వకుండా అలాగే ఉంచేసింది. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీని గురించి పెద్దగా పట్టించుకోకపోవడంతో విరాట్‌ మ్యూజియంపై ఆశలు సన్నగిల్లాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తుక్కుగా మార్చాలని నిర్ణయించడంతో విరాట్‌ యుద్ధ నౌక చరిత్ర గర్భంలో కలిసినట్టే! 

Updated Date - 2020-09-28T10:44:58+05:30 IST