జోన్‌పై టెన్షన్‌

ABN , First Publish Date - 2020-09-23T08:16:49+05:30 IST

దేశంలో రైల్వే జోన్ల తగ్గింపుపై కసరత్తు జరుగుతోందని, డివిజన్ల సంఖ్య కూడా తగ్గిస్తామని ఆ శాఖా మంత్రి పియూష్‌ గోయల్‌ పార్లమెంటులో చేసిన ప్రకటన

జోన్‌పై టెన్షన్‌

జోన్లు, డివిజన్‌ల తగ్గింపుపై

కసరత్తు చేస్తున్నట్టు రైల్వే మంత్రి చేసిన ప్రకటనతో

ఉత్తరాంధ్ర వాసుల్లో ఆందోళన

జోన్లు, డివిజన్ల కుదింపు ఆచరణ సాధ్యం కాదంటున్న ఉద్యోగ సంఘాలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి):

దేశంలో రైల్వే జోన్ల తగ్గింపుపై కసరత్తు జరుగుతోందని, డివిజన్ల సంఖ్య కూడా తగ్గిస్తామని ఆ శాఖా మంత్రి పియూష్‌ గోయల్‌ పార్లమెంటులో చేసిన ప్రకటన ఉత్తరాంధ్ర వాసుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. రైల్వేలో తీసుకురావలసిన మార్పులపై కేంద్రం 2014లో బిబేక్‌ దేబరాయ్‌ కమిటీని వేయగా ఆ కమిటీ 2015లో 32 సిఫారసులతో నివేదిక సమర్పించింది.


దాని ప్రకారమే రైల్వే బోర్డుకు కొత్తగా సీఈఓను ఏర్పాటుచేసి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కమిటీ చేసిన ముఖ్యమైన సూచనల్లో జోన్లు, డివిజన్ల కుదింపు ఒకటి. దేశంలో 17 జోన్లు, 68 డివిజన్లు ఉన్నాయని, వాటిని ఒక లక్ష్యం కోసం వ్యూహాత్మకంగా కాకుండా చారిత్రక విషయాల ఆధారంగా ఏర్పాటుచేశారని, వాటి సంఖ్య తగ్గించాలని కమిటీ సూచించింది.


అయితే అప్పటికే కేంద్రం విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటుకు హామీ ఇచ్చింది. ఆ తరువాత కమిటీని ఏర్పాటుచేయడం, ప్రత్యేక అధికారి నియామకం జరగడం, సమగ్ర ప్రాజెక్టు నివేదిక తీసుకోవడం వంటివి జరిగాయి. ప్రస్తుతం విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా జోన్‌’ ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.


అయితే ఇప్పుడు తాజాగా రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌ జోన్ల కుదింపు అంశంపై మాట్లాడడంతో కొత్త జోన్‌కు ఏమైనా ఆటంకాలు ఎదురవుతాయేననే సంశయం ఈ ప్రాంత వాసుల మదిని తొలిచేస్తోంది. 


ప్రైవేటీకరణ కూడా కమిటీ పుణ్యమే!!

రైల్వే రంగంలో ఏకస్వామ్యం పెరిగిపోయిందని, ఇందులో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలని బిబేక్‌ దేబ్రాయ్‌ కమిటీయే సిఫారసు చేసింది. ఆ మేరకు ఇపుడు కొన్ని మార్గాలను ప్రైవేటుకు అప్పగిస్తున్నారు.


ఇకపై ఆ సేవలన్నింటికీ చెల్లింపులు

రైల్వే తన సిబ్బంది కోసం ఆస్పత్రులు, విద్యాలయాలు, క్రీడా సంస్థలు నిర్వహిస్తోంది. వీటిని ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్ది ఆ సేవలకు కూడా రుసుములు వసూలు చేయాలని కమిటీ సిఫారసు చేసింది. దీనిని కూడా పరిశీలిస్తున్నామని మంత్రి ప్రకటించారు. అలాగే రైల్వేలో నియామకాలు, మానవ వనరుల విభాగంలోను సంస్కరణలు తీసుకురావాలని కమిటీ సూచించింది.


జోన్ల కుదింపు వీలు కాదు

కమిటీ జోన్లు, డివిజన్ల కుదింపు గురించి సిఫారసు చేసినా క్షేత్రస్థాయిలో అది సాధ్యం కాదని రైల్వే ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. మౌలిక వసతులు, ఆపరేషన్లు వంటివి స్థానిక అవసరాలకు అనుగుణంగా వుండాలని, ఇప్పుడున్న వాటిని కుదిస్తే ఆ భారం ఆపరేషన్లపై పడుతుందని, తద్వారా సరైన సేవలు అందకుండాపోయే ప్రమాదం ఉందని, అప్పుడు అసలుకే నష్టం వస్తుందని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై కేంద్రం ముందుకు వెళ్లకపోవచ్చునని అంటున్నారు. ఆ విధంగా చూసుకుంటే విశాఖ కేంద్రంగా కొత్త జోన్‌కు ఇబ్బంది లేనట్టేనని భావిస్తున్నారు. 

Updated Date - 2020-09-23T08:16:49+05:30 IST