గ్రామాల్లో నత్తనడకన మురుగు కాల్వల నిర్మాణం

ABN , First Publish Date - 2020-02-22T10:50:11+05:30 IST

గ్రామాల్లో నత్తనడకన మురుగు కాల్వల నిర్మాణం

గ్రామాల్లో నత్తనడకన మురుగు కాల్వల నిర్మాణం

జిల్లాకు రూ.237 కోట్లతో 1,845 పనులు మంజూరు

అధికార పార్టీ సానుభూతిపరులకే అప్పగింత

...అయినా గత ప్రభుత్వంలో చేపట్టిన పనులకు

ఇప్పటికీ బిల్లులు మంజూరుకాకపోవడంతో కాంట్రాక్టర్లలో సంశయం

వచ్చే నెలాఖరులోగా రూ.60 కోట్ల విలువైన పనులు పూర్తి చేయాలని అధికారుల ఒత్తిడి

ఇప్పటివరకూ కేవలం రూ.4 కోట్ల పనులు మాత్రమే పూర్తి

పైసా విడుదల చేయని ప్రభుత్వం

ఈ బిల్లులు మంజూరు చేస్తే

న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో

గత ప్రభుత్వ హయాంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం)

గ్రామాల్లో మురుగు కాల్వల (సీసీ డ్రైన్లు) నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు ఇప్పటికీ బిల్లులు విడుదల కాలేదు. దీంతో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిర్మాణం విషయంలో ముందూవెనుకా ఆడుతున్నారు. అధికారులు మాత్రం పనులు పూర్తి చేయాలంటూ కాంట్రాక్టర్లపై ఒత్తిడి చేస్తున్నారు. వచ్చే నెలాఖరు నాటికి జిల్లాలో రూ.60 కోట్ల విలువైన పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. అయితే ఇప్పటివరకు కేవలం రూ.4 కోట్ల విలువైన పనులు మాత్రమే పూర్తయ్యాయి.


రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కొన్ని నెలలు ఎటువంటి పనులు లేవు. కేంద్రం నుంచి నిధులు విడుదల కావడంతో రెండు నెలల క్రితం కొన్ని పనులకు  ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో రూ.237 కోట్లతో 1,845 మురుగు కాల్వల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ఈ పనులకు 90 శాతం జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్‌) నిధులు, పది శాతం స్వచ్ఛ భారత్‌ మిషన్‌ నిధులు వెచ్చించనున్నారు. పనుల పర్యవేక్షణ బాధ్యత గ్రామీణ నీటి సరఫరా విభాగానికి అప్పగించారు. నామినేషన్‌ విధానంలోనే సీసీ డ్రైన్లు నిర్మాణ పనులు  అధికార పార్టీ సానుభూతిపరులకే అప్పగించారు. అయితే పనులు చేపట్టేందుకు అత్యధికులు ఆసక్తి చూపడం లేదు. కొంతమంది పనులు చేపట్టినా నత్తనడకగా చేస్తున్నారు. జిల్లాకు కేటాయించిన రూ.237 కోట్లతో 1,845 పనులు చేపట్టాల్సి ఉంది. వీటిలో వచ్చే నెలాఖరుకు రూ.60 కోట్ల విలువైన పనులు పూర్తిచేయాల్సి ఉంది. అయితే జిల్లాలో 984 పనులు ప్రారంభించినా ఎక్కువ శాతం నత్తనడకన సాగుతున్నాయి. కొన్నిచోట్ల శంకుస్థాపన చేసి వదిలేశారు. అయితే అధికారులు వెంటపడుతుండడంతో కొంతమంది కాంట్రాక్టర్లు ఇప్పటివరకు చేసిన పనులను ఎం.బుక్‌లో రికార్డు చేసి బిల్లులు పెట్టారు. ఈ విధంగా ఇప్పటివరకు సుమారు రూ.4.2 కోట్ల విలువైన పనులు పూర్తిచేశారు. వీటిలో మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద రూ.4.08 కోట్లు ఖర్చు చేయగా, కూలీలకు రూ.14 లక్షలు విలువైన పని కల్పించారు. అయితే ఇంతవరకు పైసా విడుదల చేయలేదు. బిల్లుల కోసం అధికారులపై కాంట్రాక్టర్లు ఒత్తిడి చేస్తున్నారు. చేపట్టిన పనులకు కొంతమేర అయినా బిల్లులు చెల్లిస్తే మిగిలిన పనులు వేగంగా పూర్తిచేస్తామని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. సిమెంట్‌, ఇసుక, ఇతర మెటీరియల్‌కు అప్పులు చేశామని, త్వరితగతిన బిల్లులు ఇస్తేనే మిగిలిన పనులు చేస్తామని చెబుతున్నారు. 


గతానుభవంతో పలువురు వెనకడుగు

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గత ఏడాది ఎన్నికల ముందు వరకు గ్రామాల్లో భారీగా పనులు చేపట్టారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చేనాటికి పూర్తయిన పనులకు ఇంతవరకు బిల్లులు ఇవ్వలేదు. కొందరు చేపట్టిన పనులకు ఇంకా ఎం.బుక్‌ నమోదుకాలేదు. ఎం.బుక్‌ నమోదైన వాటికి సంబంధించి పంచాయతీరాజ్‌ శాఖ వరకు చూస్తే రూ.150 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. గ్రామాల్లో గతంలో చేపట్టిన పనులకే బిల్లులు రాలేదు. ఇప్పుడు అప్పోసప్పో చేసి పనులు చేసినా తరువాత బిల్లులు రాకపోతే తమ పరిస్థితి ఏమిటని పలువురు కాంట్రాక్టర్లు వెనుకడుగు వేస్తున్నారు. అయితే వచ్చే నెలాఖరులోగా రూ.60 కోట్ల విలువైన పనులు పూర్తిచేయాలనే లక్ష్యంతో గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులు ఉన్నారు. పూర్తిచేసిన పనులకు బిల్లులు విడుదలైతేనే మిగిలిన వారిలో ఆసక్తి కలుగుతుందని కాంట్రాక్టర్లు అంటున్నారు. అయితే ఇంతవరకు పైసా విడుదల కాలేదని, వచ్చే నెలాఖరులోగా పనులు పూర్తి చేయడం సవాల్‌గా మారిందని అధికారులు వాపోతున్నారు. పనులు పూర్తిచేయాలని ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తోందని, కానీ క్షేత్రస్థాయిలో నత్తనడకన సాగుతున్నాయని వివరించారు. ఇదిలావుండగా ప్రస్తుతం చేపట్టిన పనులకు బిల్లులు చెల్లిస్తే...గతంలో పనులు చేపట్టి బిల్లులు అందని కాంట్రాక్టర్లు న్యాయ స్థానాలను ఆశ్రయించాలని భావిస్తున్నారు. ఇది కూడా అధికారులు, ప్రస్తుతం పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు ఆందోళన కలిగిస్తోంది.

Updated Date - 2020-02-22T10:50:11+05:30 IST