వృద్ధ దంపతులు హత్య

ABN , First Publish Date - 2022-08-09T06:50:30+05:30 IST

విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని చినముషిడివాడలో నిర్మాణంలో వున్న అపార్టుమెంట్‌ సెల్లార్‌లో సోమవారం వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారు.

వృద్ధ దంపతులు హత్య
వృద్ధ దంపతులు అప్పారావు, లక్ష్మి (ఫైల్‌ ఫొటో)

చినముషిడివాడలో దారుణం

కక్షలే కారణమై ఉండవచ్చునంటున్న పోలీసులు

మృతులు విజయనగరం జిల్లా వాసులు

ఉపాధి నిమిత్తం నగరానికి రాక

ఇరవై రోజుల క్రితం నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్‌ వాచ్‌మన్‌గా చేరిక


పెందుర్తి, ఆగస్టు 8: విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని చినముషిడివాడలో నిర్మాణంలో వున్న అపార్టుమెంట్‌ సెల్లార్‌లో సోమవారం వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా బలిజిపేట మండలం అజ్జాడ గ్రామానికి చెందిన సుటారి అప్పారావు (60), లక్ష్మి (55) దంపతులు ఉపాధి నిమిత్తం కొన్నేళ్ల క్రితం విశాఖ వచ్చారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమారై ఉన్నారు. పెద్ద కుమారుడు సత్యనారాయణ నగరంలోని బర్మా క్యాంప్‌లో వుంటూ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చిన్నకుమారుడు, కుమారై హైదరాబాద్‌లోని అపార్టుమెంట్లలో వాచ్‌మెన్లుగా పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకూ అప్పారావు చినముషిడివాడ ప్రాంతంలో వేర్వేరు అపార్టుమెంట్లలో వాచ్‌మన్‌గా పనిచేశాడు. ఇరవై రోజుల క్రితం గ్యాస్‌ గోడౌన్‌ వెనుక గల సప్తగిరి నగర్‌లో సమీపంలో నిర్మాణంలో వున్న అపార్ట్‌మెంటులో వాచ్‌మన్‌గా చేరాడు. సెల్లార్‌లో భార్యాభర్తలు ఉంటున్నారు.  కాగా అపార్టుమెంట్‌ సూపర్‌వైజర్‌ నీల్‌కాంత్‌ సోమవారం ఉదయం ఇక్కడకు వచ్చి వాచ్‌మన్‌ గది వైపు చూసి వారు నిద్రపోతున్నారని భావించి నాలుగో అంతస్థులో ప్లంబింగ్‌, విద్యుత్‌ పనులు జరుగుతుండడంతో అక్కడకు వెళ్లారు. వాచ్‌మన్‌ వద్ద వుంచిన తన ల్యాప్‌టాప్‌ బ్యాగ్‌ను తీసుకునేందుకు మధ్యాహ్నం 12 గంటల సమయంలో వారి గదికి వెళ్లారు. వాచ్‌మన్‌ దంపతులు రక్తపు మడుగులో వుండడాన్ని గుర్తించి వెంటనే భవన నిర్మాణదారుడికి సమాచారాన్ని అందించారు. భవన యజమాని సూచన మేరకు  పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి క్లూస్‌ టీమ్‌తో చేరుకున్నారు. పోలీస్‌ జాగిలాలు అపార్టుమెంట్‌ నుంచి కొంతదూరం వరకు వెళ్లి ఆగిపోయాయి. ఘటనా స్థలంలో లభ్యమైన నాలుగడుగుల పొడవైన సరుగుడు కర్రను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వృద్ధ దంపతులను బంగారం, నగదు కోసం హతమార్చి వుండరని, కక్ష సాధింపులో భాగంగా హత్య చేసి వుంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలిలోని టార్పాలిన్లపై రక్తపు మరకలు వుండడంతో దంపతులకు, దుండగులకు మధ్య పెనుగులాట జరిగి వుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు కలిసి ఈ హత్యలకు పాల్పడి వుంటారని భావిస్తున్నారు. ఘటనా స్థలిలో సరుగుడు కర్ర తప్ప ఎటువంటి ఆధారాలు లభ్యం కానందున దానితోనే వారిని కొట్టి చంపి వుండవచ్చునని అనుకుంటున్నారు. దంపతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. క్రైమ్‌ డీసీపీ సునీల్‌ సుమీత్‌ గరుడ, ఏసీపీ పెంటారావు, సీఐ అశోక్‌కుమార్‌, సిబ్బంది ఘటనా స్థలాన్ని సందర్శించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక కేసులో పురోగతి వుంటుందని ఏసీపీ పెంటారావు తెలిపారు. కాగా హత్యకు గురైన దంపతుల పెద్ద కుమారుడు సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని..తమకు ఆస్తులు, భూములు లేవన్నారు. తమ తల్లిదండ్రులను ఎవరు..ఎందుకు హత్య చేశారో తెలియడం లేదని విలపించారు. సీఐ అశోక్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2022-08-09T06:50:30+05:30 IST