బీపీసీఎల్‌ ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌

ABN , First Publish Date - 2020-07-27T08:53:23+05:30 IST

ప్రభుత్వ రంగంలోని భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌)

బీపీసీఎల్‌ ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌  లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) ప్రైవేటీకరించడానికి ముందే తన ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ ప్రకటించింది. ‘‘వివిధ వ్యక్తిగత కారణాల వల్ల పనిలో కొనసాగలేని ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకం అమలుపరచాలని సంస్థ నిర్ణయించింది, ఈ మేరకు ఎవరైనా ముందుకు వచ్చి తమ దరఖాస్తు  అందించవచ్చు’’ అని ఒక అంతర్గత ప్రకటనలో బీపీసీఎల్‌ తెలిపింది. బీపీ వీఆర్‌ఎస్‌-2020 పేరిట ఈ పథకం జూలై 23న ప్రారంభం కాగా ఆగస్టు 13వ తేదీన ముగుస్తుంది.


45 సంవత్సరాల వయసు పైబడిన వారెవరైనా వీఆర్‌ఎ్‌సకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులేనని ఆ ప్రకటన తెలిపింది. అయితే ఇంకా క్రియాశీలంగా ఉన్న క్రీడాకారులు (ప్రధాన పనుల్లో ఇంకా నియోగించని వారు), బోర్డు స్థాయి ఉద్యోగులకు మాత్రం వీఆర్‌ఎస్‌ నుంచి మినహాయింపు ఇచ్చినట్టు తెలిపింది. వీఆర్‌ఎస్‌ పొందిన వారికి కంపెనీ జాయింట్‌ వెంచర్లలో పని చేసే అర్హత ఉండదు. క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్న వారికి వీఆర్‌ఎస్‌ అర్హత లేదు. ప్రైవేటు యాజమాన్యం కిందకు వస్తే తమ పాత్ర లేదా తాము పని చేసే ప్రదేశం మారవచ్చనే అభిప్రాయం కొంతమందిలో ఉన్నదని, అలాంటి వారి కోసం వీఆర్‌ఎస్‌ ప్రకటించామని సీనియర్‌ అధికారి ఒక రు తెలిపారు. 5 నుంచి 10 శాతం మంది ఉద్యోగులు వీఆర్‌ఎ్‌స తీసుకుంటారని భావిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం బీపీసీఎల్‌లో 20 వేల మంది ఉద్యోగులున్నారు. ఈ సంస్థలో తనకు గల 52.98 శాతం వాటాలను ప్రభుత్వం పూర్తిగా విక్రయిస్తోంది. ఈ వాటాల కొనుగోలుకు ఆసక్తి గల సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ తెలియచేసే తుది గడువు ఈ నెల 31. 


వీఆర్‌ఎస్‌ ప్రయోజనాలివే..

వీఆర్‌ఎ్‌సకు అర్హులైన వారందరికీ వారు సంస్థలో పని చేసినంత కాలం ప్రతి ఏడాది సర్వీసుకు రెండు నెలల వేతనం, వీఆర్‌ఎస్‌ తీసుకున్న నాటికి రిటైర్మెంట్‌కు మధ్య ఎంత సర్వీసు ఉంటే అన్ని నెలల వేతనం పరిహారంగా ఇస్తారు. వీఆర్‌ఎస్‌ నాటికి వారికి గల సీఎల్‌, పీఎల్‌ కూడా నగదుగా మార్చుకునేందుకు అనుమతిస్తారు. అలాగే రిటైర్మెంట్‌ సమయంలో చెల్లించాల్సిన రిపాట్రియేషన్‌ చార్జీలేవైనా ఉంటే అవి కూడా చెల్లిస్తారు. రిటైర్మెంట్‌ అనంతర వైద్య ప్రయోజన పథకం కింద వారందరూ వైద్య ప్రయోజనాలు పొందేందుకు అర్హులే. 

Updated Date - 2020-07-27T08:53:23+05:30 IST