కలెక్టరేట్‌కు ఓ వీఆర్వో సరెండర్‌

ABN , First Publish Date - 2022-06-25T04:47:08+05:30 IST

బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో ఓ ప్రాంత వీఆర్వోను కలెక్టరేట్‌కు సరెండర్‌ చేసినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కలెక్టరేట్‌కు ఓ వీఆర్వో సరెండర్‌

మరో వీఆర్వోను చేసేందుకు రంగం సిద్ధం?

బుచ్చిరెడ్డిపాళెం,జూన్‌24: బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో ఓ ప్రాంత వీఆర్వోను కలెక్టరేట్‌కు సరెండర్‌ చేసినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సరెండర్‌కుగల కారణాలు తెలియరాలేదు. మరో వీఆర్వో సరెండర్‌కు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయమై తహసీల్దారు శ్రీనివాసులును వివరణ కోరగా 15రోజుల క్రితమే సరెండర్‌ చేసినట్టు చెప్పారు. కానీ సరెండర్‌కు గల కారణాలు, మరో వీఆర్వో సరెండర్‌కు సిద్ధం వివరాలపై గోప్యత పాటించారు. బాధిత వీఆర్వో నరసింహారెడ్డిని వివరణ కోరగా అనారోగ్యంతో 15 రోజుల క్రితం సెలవు కోరినా తహసీల్దారు అంగీకరించకపోవడంతో బదిలీకోసం డీఆర్వోకి దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. ఈనెల 8న కలెక్టరేట్‌కు సరెండర్‌ చేస్తున్నట్టు పోస్టుద్వారా నోటీసులు పంపించింది వాస్తవమేనని తెలిపారు. అప్పటి నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. 

ఇప్పటికే మూడు కుర్చీల ఖాళీ

ఇప్పటికే గత తహసీల్దారు హయాంలో డిప్యుటేషన్‌పై వచ్చిన ఓ డీటీ బదిలీపై వెళ్లగా  తాజాగా ఇద్దరు ఆర్‌ఐలు బదిలీఅయ్యారు. దీంతో ఆ మూడు కుర్చీలు ఖాళీ అయ్యాయి. వేధింపులతో మరో వీఆర్వో కూడా సెలవు పెట్టినట్టు సమాచారం. 

Updated Date - 2022-06-25T04:47:08+05:30 IST