ఏసీబీ వలలో వీఆర్వో

ABN , First Publish Date - 2022-09-29T06:22:27+05:30 IST

అనకాపల్లి జిల్లా నాతవరం మండలం ఎం.బెన్నవరం వీఆర్వో గడుతూరు సూర్యనారాయణ...ఓ రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఏసీబీ వలలో వీఆర్వో
ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఎం.బెన్నవరం వీఆర్వో సూర్యనారాయణ

పట్టాదారు పాస్‌ పుస్తకం కోసం రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం


నాతవరం, సెప్టెంబరు 28: అనకాపల్లి జిల్లా నాతవరం మండలం ఎం.బెన్నవరం వీఆర్వో గడుతూరు సూర్యనారాయణ...ఓ రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి డీఎస్పీ బీవీఎస్‌ఎస్‌ రమణమూర్తి అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎం.బెన్నవరం గ్రామానికి చెందిన గంగిరెడ్డి హనుమాన్‌ శ్రీనివాస్‌కు ఐదు ఎకరాల భూమి ఉంది. దీనిని మ్యుటేషన్‌ చేసి, పట్టాదారు పాస్‌పుస్తకం మంజూరు చేయాలని రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్ని రోజులైనా పని జరగకపోవడంతో వీఆర్వో గడుతూరు సూర్యనారాయణను సంప్రతించారు. ఈ రెండు పనులు చేయాలంటే రూ.25 వేలు లంచంగా ఇవ్వాలని సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు. రూ.20 వేలు ఇస్తానని శ్రీనివాస్‌ చెప్పారు. అయితే లంచం ఇవ్వడం ఇష్టంలేని ఆయన ఈ నెల 24వ తేదీన విశాఖపట్నంలో ఏసీబీ అధికారులను కలిసి వీఆర్వోపై ఫిర్యాదు చేశారు. అధికారులు చెప్పిన ప్రకారం శ్రీనివాస్‌ బుధవారం సాయంత్రం ములగపూడి గ్రామ సచివాలయంలో వున్న వీఆర్వో సూర్యనారాయణను కలిసి రూ.20 వేలు అందజేశారు. అప్పటికే సచివాలయం వెలుపల మాటువేసి వున్న ఏసీబీ అధికారులు లోపలకు వెళ్లి వీఆర్వోను అదుపులోకి తీసుకుని, లంచం డబ్బులు స్వాధీనం చేస్తున్నారు. అనంతరం అతడిని అరెస్టు చేశారు. గురువారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ రమణమూర్తి చెప్పారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రమేశ్‌, సతీశ్‌కుమార్‌, ప్రేమ్‌కుమార్‌, విజయ్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.


రూ.40 వేలు తీసుకున్నాడు..11 నెలలైనా పని చేయలేదు

చోడే శ్రీరామ్మూర్తి, డి.యర్రవరం 

నాకు ఎం.బెన్నవరంలో రెండు ఎకరాల భూమి ఉంది ఆన్‌లైన్‌ చేసి, పట్టాదారు పాస్‌ పుస్తకం మంజూరు చేయడానికి 11 నెలల క్రితం రూ.40 వేలు లంచం తీసుకున్నాడు. అయినా సరే ఇంతవరకు పని పూర్తిచేయలేదు.



Updated Date - 2022-09-29T06:22:27+05:30 IST