Abn logo
Apr 22 2021 @ 23:56PM

రోడ్డు ప్రమాదంలో వీఆర్‌ఏ దుర్మరణం

 మరొకరికి తీవ్ర గాయాలు

టెక్కలి (కోటబొమ్మాళి), ఏప్రిల్‌ 22:  కోటబొమ్మాళి మండల పరిధి ఎత్తురాళ్లపాడు సమీపంలో గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో తిలారు గ్రామానికి చెందిన వీఆర్‌ఏ బడారి రామచంద్రరావు (38) దుర్మరణం   చెందగా, పెద్దబమ్మిడికి చెందిన వీఆర్‌ఏ కొర్రాపు నీలమ్మ తీవ్రంగా గాయ పడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. వీరిద్దరూ పెద్ద బమ్మిడి గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఎత్తురాళ్లపాడు గ్రామ సమీపంలో వెనుక నుంచి వస్తున్న ఒక ప్రైవేటు టూరిస్టు బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రామచంద్రరావు అక్కడికక్కడే మృతి చెందగా నీలమ్మకు తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించేందుకు 108 వాహనం రావడం ఆలస్యం కావడంతో ప్రైవేటు వాహనంలో తొలుత నరసన్నపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చేర్చుకునేందుకు నిరాకరించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మృతుడు రామచంద్రరావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రామచంద్రరావు తల్లి  గౌరమ్మ తిలారు వీఆర్‌ఏగా పని చేస్తూ కొద్ది కాలంగా అనారోగ్యంతో మంచం పట్టగా ఆమె తరఫున ఈయన విధులు నిర్వహిస్తున్నాడు.   సమాచారం అందుకున్న తహసీల్దార్‌ ఆర్‌.మధు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.  మృతదేహాన్ని స్థానిక సామాజిక ఆసుపత్రికి పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వై.రవికుమార్‌ తెలిపారు. 


 

Advertisement