సేవా వారధులు మీరు

ABN , First Publish Date - 2021-04-13T07:04:49+05:30 IST

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు గ్రామ/వార్డు వలంటీర్లేనని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు.

సేవా వారధులు మీరు
వలంటీరుకు మెడల్‌, ప్రశంసాపత్రం అందజేస్తున్న ఎస్పీ అద్నాన్‌ చిత్రంలో కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, జేసీ లక్ష్మీశ, ఎంపీ గీత, ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డినయీం అస్మీ.

ఉత్తమ వలంటీర్లకు అవార్డుల ప్రదానోత్సవ సభలో కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి

కాకినాడ, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు గ్రామ/వార్డు వలంటీర్లేనని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు మంచి సేవలందించిన  వలంటీర్లకు అవార్డులివ్వడం సంతోషంగా ఉందన్నారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల  ఆడిటోరియంలో సోమవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పలువురు వలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులు ఇచ్చి గౌరవించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2019, 20ల్లో జిల్లాలో వచ్చిన వరదల సమయంలో బాధితులకు వలంటీర్లు అండగా నిలిచి చేసిన సేవలు అమోఘమన్నారు. కాకినాడ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ కరోనా సమయంలో వలంటీర్ల విలువ ఏమిటో అందరికీ తెలిసిందన్నారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ పేదల కుటుంబాల్లో ఆనందం నింపే అవకాశం వలంటీర్లకే దక్కిందన్నారు. జడ్పీ సీఈవో ఎన్వీవీ సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో 1,590 సచివాలయాల పరిధిలో 29,127 మంది వలంటీర్లు పని చేస్తున్నారన్నారు. వీరిలో అత్యుత్తమ సేవలందించిన వారిని మూడు విభాగాల్లో అవార్డులకు ఎంపిక చేశామన్నారు. సేవా వజ్ర కేటగిరీలో వారికి సర్టిఫికెట్‌, ప్రత్యేక బ్యాడ్జి, మెడల్‌, రూ.30 వేలు, సేవా రత్న కేటగిరీలో వారికి రూ.20 వేలు, సేవా మిత్ర కేటగిరీలో వారికి రూ.10 వేలు ఇచ్చామన్నారు.కార్యక్రమంలో ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ, జాయింట్‌ కలెక్టర్లు జి.లక్ష్శీశ, చేకూరి కీర్తి, కార్పొరేషన్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ పుండ్కర్‌, డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, అదనపు ఎస్పీ కరణం కుమార్‌, డీఆర్డీఏ పీడీ వై.హరిహరనాథ్‌, డీపీవో ఎస్వీ నాగేశ్వర్‌నాయక్‌, అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-13T07:04:49+05:30 IST