ఓటర్ల అవసరాలే వ్యూహాలు!

ABN , First Publish Date - 2021-03-08T08:27:47+05:30 IST

సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు, విందులు, బహుమానాలు, ఉద్యోగాల హామీలు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు అనుసరిస్తున్న రకరకాల వ్యూహాలివి.

ఓటర్ల అవసరాలే వ్యూహాలు!

  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రయత్నాలు.. 
  • స్థానిక కేడర్‌ ద్వారా అవసరాల గుర్తింపు
  • సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ.. 
  • వర్గాల వారీగా ఓటర్లకు భిన్నమైన హామీలు


హైదరాబాద్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు, విందులు, బహుమానాలు, ఉద్యోగాల హామీలు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు అనుసరిస్తున్న రకరకాల వ్యూహాలివి. ఓటర్లలో విద్యావంతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, ప్రైవేటుగా ఉపాధి పొందుతున్నవారు.. ఇలా విభిన్న వర్గాలవారు ఉండడంతో ఒక్కో వర్గాన్ని ఒక్కోవిధంగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కులాలు, సంఘాల వారీగా సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు ఇప్పటికే ముమ్మరమయ్యాయి. నగదు పంపిణీ, ఉపకరణాలు అందించడం, కుటుంబ అవసరాలు తీర్చడం, అత్యవసరమైన వారికి ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇవ్వడం వంటి వాటితో ఓటర్లకు వల వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటర్ల వారీగా వారి బలహీనతలు/ అవసరాలను గుర్తించేలా స్థానిక పార్టీ నాయకత్వాలను పురమాయిస్తున్నారు. ఒక ప్రధాన రాజకీయ పార్టీ తనకున్న ప్రజాప్రతినిధులు, పార్టీ కేడర్‌ను ఇందుకు వినియోగించి, ఓటర్లను నయానా, భయానా ఒప్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంఘాలతో సమావేశాలు నిర్వహింని మద్దతును ప్రకటింపజేసుకుంటోంది. కాగా, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) ఉద్యోగ సంఘాల జేఏసీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతును ప్రకటిస్తూ లేఖలను మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావుకు సమర్పించారు.


పంచాయతీ కార్యదర్శుల సంఘాలన్నీ ఏకమై ఆదివారం హైదరాబాద్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాయి. సర్వీసెస్‌ అసోసియేషన్‌ ఏర్పాటు ప్రధాన అజెండాగా పేర్కొంటున్నప్పటికీ, ఈ సమ్మేళనం నిర్వహణ వెనుక పాలక పెద్దల ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. మరోవైపు వివిధ వృత్తిదారులతోనూ మంత్రి కేటీఆర్‌ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రచారానికి మరో ఐదు రోజులు మాత్రమే ఉండడంతో  ప్రలోభాలను వేగవంతం చేసేలా కొందరు అభ్యర్థులు కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న జిల్లాల ఓటర్ల కోసం ప్రత్యేక రవాణా సదుపాయాలు, సంతృప్తిపరిచే ప్రయత్నాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఇతర ప్రధాన పార్టీలు, స్వతంత్రుల్లోని కొందరు అభ్యర్థులు అధికార పార్టీల వైఫల్యాలు, ఇప్పటివరకు చూపిన వివక్షనే అస్త్రంగా ఎంచుకుంటున్నారు. 

Updated Date - 2021-03-08T08:27:47+05:30 IST