నేడు ఓటర్ల తుది జాబితా

ABN , First Publish Date - 2021-04-14T04:45:02+05:30 IST

నేడు ఓటర్ల తుది జాబితా

నేడు ఓటర్ల తుది జాబితా

 ఇక రిజర్వేషన్‌, ఎన్నికల నోటిఫికేషనే తరువాయి

 ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తాజా మాజీలు, ఆశావహులు

 ఫైనల్‌ కానున్న మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని పోలింగ్‌ సెంటర్లు

వరంగల్‌ సిటీ, ఏప్రిల్‌ 13 : జీడబ్ల్యూఎంసీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలు తుది దశకు చేరాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల ముసాయిదా ఇప్పటికే ప్రకటించిన సంగతి విదితమే. షెడ్యూల్‌ మేరకు బుధవారం తుది జాబితాను అధికారులు ప్రకటించనున్నారు. జాబితా వెల్లడితో ఓటర్ల సంఖ్య అధికారికంగా పరిగణిస్తారు. ఇక పోలింగ్‌ స్టేషన్ల తుది జాబితా కూడా బుధవారమే ప్రకటించనున్నారు. ఈ మేరకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. 

జీడబ్ల్యూఎంసీ పరిధిలోని మొత్తం ఓటర్ల సంఖ్య 6,52,952. ఇందులో మహిళలు 3,29,929 మంది, పురుషులు 3,22,847 మంది కాగా, ఇతరులు 176 మంది ఉన్నారు. బీసీ ఓటర్లు 4,31,091 ఉండగా, వీరిలో పురుషులు 2,14,299, మహిళలు 2,16,645 ఇతరులు 147 ఉన్నారు. ఎస్సీ ఓటర్ల సంఖ్య మొత్తం 94,612 కాగా, పురుషులు 45,718,  మహిళా ఓటర్లు 48,894 ఉన్నారు. ఇక ఎస్టీ ఓటర్లు మొత్తం 15,780 ఉండగా, వీరిలో పురుషులు 7723, మహిళలు 8057 మంది ఉన్నారు. తుది జాబితా వెల్లడి తరువాత ముసాయిదా ఆధారంగా వచ్చిన అభ్యంతరాలపై ఏమైనా మార్పులు, చేర్పులు జరిగాయా తెలియనుంది. పోలింగ్‌ స్టేషన్ల తుది జాబితా కూడా వెల్లడి చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. తొలుత ప్రతీ పోలింగ్‌ సెంటర్‌కు 800 మంది ఓటర్లు ఉండేలా సెంటర్లను విభజించారు. అయితే ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు అధికారులకు ఈ విషయంలో సూచనలు చేశారు. పోలింగ్‌ సెంటర్‌కు 750 మంది ఓటర్లు ఉండేలా చూడాలని, ఈ మేరకు సెంటర్ల ఏర్పాటు జరగాలని ఆదేశించారు. ఈ క్రమంలో తుది జాబితాలో పోలింగ్‌ సెంటర్లు ఎన్ని అనేది ఫైనల్‌ నోటిఫికేషన్‌లో తేలనుంది. 

ఎదురుచూస్తున్న ఆశావహులు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితా వెల్లడితో పాటు ఆ వెంటనే డివిజన్ల రిజర్వేషన్‌ అంశం తేలనుంది. రిజర్వేషన్‌ ఖరారు ఎంతో కీలకమైనది. తాజా మాజీలు, ఆశావహులు, రాజకీయపక్షాలు, నగరవాసులు ఈ విషయమై ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల వివరాలతో ఇప్పటికే రిజర్వేషన్లపై అంచనాలు వేసుకున్నారు. అయితే అధికారికంగా వెల్లడి అయితేనే స్పష్టత వస్తుంది. ఈ నేపథ్యంలో తమ డివిజన్‌ రిజర్వేషన్‌ ఎలా ఉంటుందో అనే టెన్షన్‌తో ఉన్నారు. రిజర్వేషన్లు తేలితే ఇక రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేయనున్నాయి. 

నేడో, రేపో వెల్లడి

డివిజన్ల రిజర్వేషన్‌ వెల్లడి నేడో, రేపో జరగడం ఖాయం. ఒకవేళ బుధవారమే రిజర్వేషన్ల ప్రకటన జరిగితే ఆ తదుపరి మిగిలిన ఘట్టం ఎన్నికల నోటిఫికేషనే. ఈ నెల 15 లేదా 17న నోటిఫికేషన్‌ వెలువడవచ్చని అధికారగణం భావిస్తోంది. ఇక ఆ తదుపరి నగరంలో ఎన్నికల నగారా మోగడం, ఎలక్షన్‌ హీట్‌ రాజుకోవడంతో సిటీ సందడిగా మారనుంది. ఎన్నికల విధుల నిర్వహణ కోసం బృందాల ఏర్పాటు విషయంలో అధికారులు తలమునకలయ్యారు. ఇప్పటికే కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆదేశాలతో ఎన్నికల నిర్వహణకు బృందాలు ఏర్పాటయ్యాయి. మంగళవారం వివిధశాఖల అధికారులు, సిబ్బంది వివరాలను కలెక్టర్‌ హన్మంతు జీడబ్ల్యూఎంసీకి పంపించారు. ఈ మేరకు బాధ్యతల విభజన కసరత్తును అధికారులు చేపట్టారు.

Updated Date - 2021-04-14T04:45:02+05:30 IST