Abn logo
Sep 22 2021 @ 00:39AM

ఓటర్‌ జాబితాలను సిద్ధం చేయాలి

చెల్పూర్‌లో ఓటర్ల జాబితాను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

-కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

హుజూరాబాద్‌ రూరల్‌, సెప్టెంబరు 21: ఓటర్‌ జాబితాను ఎలాంటి తప్పిదాలు లేకుండా నవీకరించి సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నారు. మంగళవారం హుజూరాబాద్‌ మండలంలోని చెల్పూర్‌లో ఇంటింటికి తిరిగి ఓటర్ల సవరణ, ప్రత్యేక ఓటర్‌ జాబితాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, సవరణలకు సంబంధించిన జాబితాను, ఫారాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సిబ్బందికి సూచించారు. మరణించిన వారి పేర్లను, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను తొలగించాలని, తొలగించే ముందు వారి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇవ్వాలన్నారు. ఓటర్‌ జాబితాల అప్‌డేట్‌ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అనంతరం హుజూరాబాద్‌ గాంధీనగర్‌లో కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌ ఇంటింటికి తిరుగుతూ దళితబంధు నిధులు వచ్చాయా, లేదా అని తెలుసుకున్నారు. రాని వారి పేర్లను నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ప్రియాంక కర్ణన్‌, ఆర్డీవో రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఫ వ్యాక్సినేషన్‌ సెంటర్‌ తనిఖీ 

శంకరపట్నం: మండలంలోని కేశవపట్నం గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించే కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలో వ్యాక్సినేషన్‌ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ గూడూరు శ్రీనివాస్‌రావు, మండల వైద్యాధికారి సయ్యద్‌ అహ్మద్‌, ఎంపీవో వేముల సురేందర్‌, ఉపసర్పంచ్‌ హనుమంతు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

ఫ మానకొండూర్‌: మండలంలోని గట్టుదుద్దెనపల్లిలో వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వైద్య సిబ్బందితో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించాలని సూచించారు.