ఓటరు దేవోభవ

ABN , First Publish Date - 2022-01-25T06:36:20+05:30 IST

దేశ ప్రధాని నుంచి గ్రామ పంచాయతీ సభ్యుడి వరకు ఓటు ద్వారానే ప్రజామోదం పొందాల్సి ఉంటుంది. సామాన్యుడికి సైతం ఓటుతోనే రాజకీయాలు, పార్టీల భవిష్యత్‌ను మార్చివేసే సత్తా ఉంటుంది.

ఓటరు దేవోభవ

- జిల్లాలో 4,40,206 ఓటర్లు 

- పురుషులు 2,14,654 మహిళలు 2,25,549

- మహిళా ఓటర్లే అధికం 

-  1290 మంది కొత్త ఓటర్లకు ఎపిక్‌ కార్డుల పంపిణీ 

- ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు

- ఓటు హక్కు నమోదుకు విస్తృత ప్రచారం

- నేడు జాతీయ ఓటరు దినోత్సవం

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

దేశ ప్రధాని నుంచి గ్రామ పంచాయతీ సభ్యుడి వరకు ఓటు ద్వారానే ప్రజామోదం పొందాల్సి ఉంటుంది. సామాన్యుడికి సైతం ఓటుతోనే రాజకీయాలు, పార్టీల భవిష్యత్‌ను మార్చివేసే సత్తా ఉంటుంది. ఎన్నికలు రాగానే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నేతలందరూ ఓటు దేవోభవ అంటూ వేడుకుంటారు. ఓటుకు రాజకీయ నేతల భవిష్యత్‌  తారుమారవుతుంది.   రాజ్యాంగం ప్రతీ ఒక్కరికి  ఒక వజ్రాయుధంగా కల్పించిన హక్కు ఓటు. ఓటుహక్కు పొందడానికి ఎన్నికల కమిషన్‌ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుంది. దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరు అర్హులు.  ఆధార్‌ లింకేజీని కూడా ఓటరు గుర్తింపునకు చేశారు. కలర్‌ గుర్తింపు కార్డులు కూడా కమి షన్‌ అందిస్తోంది. మంగళవారం ఓటరు దినోత్సవం సందర్భంగా కొత్తగా నమోదైన 1290 మందికి ఓటరు ఎపిక్‌ కార్డులను బీఎల్‌వోల ద్వారా పంపిణీ చేశారు. 

జిల్లాలో 440206 ఓట్లు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రధానంగా సిరిసిల్ల, వేములవాడ శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో 4,40,206 ఓటర్లు ఉండగా పురుషులు 2,14,654, మహిళలు 2,25,549 మంది ఉన్నారు. 10,895 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఇందులో సిరిసిల్ల నియోజకవర్గంలో 2,31,493 మంది ఓటర్లు ఉండగా పురుషులు 1,13,704 మంది, మహిళలు 1,17,788 మంది, జెండర్‌ ఒకరు ఉన్నారు. ఇందులో మహిళలు 4084 మంది ఎక్కువగా ఉన్నారు. వేములవాడ నియోజకవర్గంలో 2,08,713 మంది ఉండగా పురుషులు 1,00,950 మంది, మహిళలు 1,07,761 మంది, జెండర్‌ ఇద్దరు ఉన్నారు. ఇందులో మహిళలు 6,811 మంది ఎక్కువగా ఉన్నారు. సిరిసిల్ల జిల్లాలోని రెండు ప్రధాన నియోజకవర్గాల్లో 537 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వేములవాడ సెగ్మెంట్‌లో 255 కేంద్రాలు, సిరిసిల్ల సెగ్మెంట్‌లో 282 ఉన్నాయి. 

జాతీయ ఓటరు దినోత్సవం నేపథ్యం. 

భారత రాజ్యాంగం 15వ భాగంలో 324వ అధికరణం ఎన్నికల సంఘం నిర్మాణం, అధికారాలు, విధులను ప్రస్తావించింది. భారత ఎన్నికల సంఘం జనవరి 25, 1950లో ఏర్పడింది. అందుకే 2011 నుంచి జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన సంస్థ. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవులకు పార్లమెంట్‌ ఉభయ సభలకు రాష్ట్ర శాసన సభలకు, విధాన పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించడం ప్రధాన విధులు. ఈ సంఘం ఉప ఎన్నికలు, మధ్యంతర ఎన్నికులను కూడా నిర్వహిస్తుంది. సంఘానికి ప్రస్తుతం ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇద్దరు ఎలక్షన్‌ కమిషనర్లు ఉన్నారు. ఈ కమిషనర్లను కేంద్ర మంత్రి మండలి సూచనలు అనుసరించి రాష్ట్రపతి నియమిస్తారు. 

Updated Date - 2022-01-25T06:36:20+05:30 IST