ఓటరు దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-05-18T05:33:28+05:30 IST

పెండింగ్‌లో ఉన్న ఓటరు నమోదు, మార్పులు, చేర్పుల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి వికాస్‌రాజ్‌ అన్నారు.

ఓటరు దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

- చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి వికాస్‌ రాజ్‌

కరీంనగర్‌, మే 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పెండింగ్‌లో ఉన్న ఓటరు నమోదు, మార్పులు, చేర్పుల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి వికాస్‌రాజ్‌ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్లతో గూగుల్‌మీట్‌ నిర్వహించి పెండింగ్‌లో ఉన్న ఓటరు నమోదు దరఖాస్తులు, ఓటరు జాబితాలో డబుల్‌ ఫొటోల ప్రచురణ, తదిర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ 30 రోజులు, ఆపైన పెండింగ్‌లో ఉన్న ఓటరు నమోదు, మార్పులు, చేర్పుల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. ఓటరు జాబితాలో ఒకే ఓటరు పొటోలు, వివరాలు రెండుసార్లు ప్రచురించిన వాటిని పరిశీలిస్తే వెంటనే తొలగించాలని అన్నారు. అదనపు సీఈవో బుద్ధప్రకాశ్‌ ఎం జ్యోతి మాట్లాడుతూ ఈవీఎం గోదాంల పరిశీలన నివేదికను నిర్ణీత సమయంలోగా సీఈవో కార్యాలయానికి సమర్పించాలని, సీసీ టీవీల పనితీరు, అగ్నిమాపక ప్రమాదాలు, తదితర వివరాలను సకాలంలో పంపించాలని అన్నారు. కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ మాట్లాడుతూ కరీంనగర్‌ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్న పెండింగ్‌ దరఖాస్తులను పరిశీలించి వారం రోజుల్లోగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓటరు జాబితాలో ఒకే ఫొటో రెండుసార్లు ప్రచురించిన వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గోదాం పరిశీలన నివేదికలు సకాలంలో సమర్పిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, జడ్పీ సీఈవో ప్రియాంక, ఆర్డీవో ఆనంద్‌ కుమార్‌, డీఆర్‌డీవో పీడీ శ్రీలత, కలెక్టరేట్‌ ఎలక్షన్‌ సెల్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-18T05:33:28+05:30 IST