ఓటెత్తిన చైతన్యం

ABN , First Publish Date - 2021-04-18T06:58:47+05:30 IST

నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ప్రజలు ఓటెత్తారు. ఇన్నాళ్లు వాడివేడిగా సాగిన ప్రచార హోరు శనివారం ఈవీఎంలలో నిశ్శబ్ధంగా నమోదైంది. కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలోనూ ఓటర్లు పెద్దసంఖ్యలో పాల్గొని ఓటేశారు.

ఓటెత్తిన చైతన్యం
గుర్రంపోడు మండలం కొప్పోలులో ఓటేసేందుకు క్యూలో నిల్చున్న ఓటర్లు

కరోనా కాలంలోను కదలొచ్చిన ఓటర్లు 

‘సాగర్‌’ ఉప ఎన్నికలో 86.30 శాతం పోలింగ్‌ నమోదు

ప్రశాంతంగా పూర్తయిన ప్రక్రియ

మే 2న కౌంటింగ్‌, బాక్సుల్లో భవిత భద్రం

లెక్కలతో నేతల్లో టెన్షన్‌, టెన్షన్‌ 


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ): నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ప్రజలు ఓటెత్తారు. ఇన్నాళ్లు వాడివేడిగా సాగిన ప్రచార హోరు శనివారం ఈవీఎంలలో నిశ్శబ్ధంగా నమోదైంది. కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలోనూ ఓటర్లు పెద్దసంఖ్యలో పాల్గొని ఓటేశారు. నియోజకవర్గవ్యాప్తంగా 346 పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఏడు మండలాల పరిధిలో మొత్తంగా రికార్డు స్థాయిలో 86.30 శాతం పోలింగ్‌ నమోదైంది. పెరిగిన పోలింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొనడంతో అభ్యర్థుల్లో టెన్షన్‌ టెన్షన్‌ నెలకొంది. 


 నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికకు ఓటర్లు పోటెత్తారు. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి రాజకీయ చైతన్యాన్ని కనబరుస్తున్న ఈ నియోజకవర్గ ఓటర్లు ఉప ఎన్నికవేళ తమ చైతన్యాన్ని చాటారు. మొ త్తం ఓట్లలో మహిళా ఓటర్లే అధికం కాగా,పోలింగ్‌ రోజు నారీమణులు పోలింగ్‌ భేరిని మోగించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను అవగాహన చేసుకొని ఆ మేరకు బందోబస్తు వ్యూహన్ని ఖరారు చేసిన నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్‌ చెదురుమదు రు సంఘటనలకు కూడా అవకాశం ఇవ్వలేదు. కరోనావేళ రెవెన్యూ, పోలీసు సిబ్బందికి తోడు వైద్యసేవలు ఈ ఉపఎన్నికలో అందుబాటులోకి వచ్చాయి. మొత్తం టీంవర్క్‌తో ఉప ఎన్నికను విపత్తువేళ ప్రశాంతంగా ముగించగా, బాక్సుల్లో భద్రంగా ఉన్న నేతల భవిత బయటపడాలంటే మరో 15 రోజులు ఆగాల్సిందే. ఈ ఉప ఎన్నిక కౌంటింగ్‌ వచ్చే నెల 2వ తేదీన జరగనుండగా, ఈవీఎంలను నల్లగొండ జిల్లా కేంద్రంలోని పౌరసరఫరాల గోడౌన్‌లో భద్రపరిచారు. 


అంతా ఓటేసేందుకు ఆసక్తి

కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా యువకులు, మహిళలు, వృద్ధులు అంతా ఓటేసేందుకు ఆసక్తి చూపడం గమనార్హం. ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రారంభం కావాల్సి ఉండగా నాగార్జునసాగర్‌, త్రిపురారం, నిడమనూరు మండలాల్లో మూడు కేంద్రాల్లో 8 గంటలకు ప్రారంభమైంది. సాం కేతిక సమస్యలు, మాక్‌ పోలింగ్‌ నిర్వహించేందుకు ఏజెంట్లు ఆలస్యంగా రావ డంతో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. మరమ్మతులు చేసి 8గంటలకు గంట ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయాన్నే కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి సాగర్‌లో, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భగత్‌ హాలియా మునిసిపాటిలీలో, బీజేపీ అభ్యర్థి రవికుమార్‌ త్రిపురారం మండలంలోని పలుగుతండాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులు ఉదయాన్నే ఓటింగ్‌కు క్యూలైన్లలో కనిపించారు. ఎండ లు తీవ్రంగా ఉండటం, కొన్ని చోట్ల శామియానాలు ఏర్పాటు చేయకపోవడంతో ఓటర్లు ఇబ్బం దిపడ్డారు. కొవిడ్‌ నిబంధనలమేరకు క్యూలైన్‌లో ఓటరు, ఓటరుకు మధ్య భౌతికదూరం పాటించేందుకు సున్నంతో బాక్స్‌లు గీశారు. ఓటర్లకు పేపర్‌ గ్లవ్స్‌ అందజేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ పరిశీలకుడు చౌహన్‌ ఓటింగ్‌ సరళిని పోలింగ్‌ బూత్‌వారీగా పరిశీలించా రు. పోలింగ్‌ సరళి, తాజా పరిస్థితులను సాగర్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ నుంచి ఐజీలు స్టీఫెన్‌ రవీం ద్ర, శివశంకర్‌రెడ్డి, నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్‌ పరిశీలించారు. తదుపరి పలు పోలింగ్‌ బూత్‌లను వీరు విడివిడిగా పరిశీలించారు. 346 పోలింగ్‌ బూత్‌లలో 108 కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించగా, ఎక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలు కాదు కదా, చిన్నపాటి ఘర్షణలు కూడా చోటుచేసుకోలేదు.రీపోలింగ్‌ వంటి అవసరం లేకుండా ప్రశాంతంగా పోలింగ్‌ ముగిసింది. 


పోటెత్తిన ఓటరు

కరోనా కాలంలోను 86.30 రికార్డు పోలింగ్‌ నమోదైంది. సాధారణ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో 86.85శాతం నమోదైంది. ఆనాడు మొత్తం ఓట్లు 2,08,176 కాగా 1,80,80 3 పోలయ్యాయి. గత ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల నర్సింహయ్యకు 83,743 ఓట్లు పోలవగా సమీప ప్రత్యర్థి జానారెడ్డికి 76,017 ఓట్లు వచ్చాయి. 45రోజులుగా అధికార టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయిలో హంగూ, ఆర్భాటాలతో ప్రచారం చేయగా, సీనియర్‌ నేత జానా సైలెంట్‌గా గ్రామాగ్రామాన పర్యటించారు. ఇరు పార్టీలకు బలమైన క్యాడర్‌ ఉండటం, బీజేపి ఆలస్యంగా ప్రచారం ప్రారంభించినా చివరి 15 రోజులు ఆ పార్టీ దిగ్గజాలు స్థానికంగా మకాం వేశా రు. దీంతో ఈ మూ డు ప్రధాన పార్టీలు ఓటుకు నోటు పంచడం, పార్టీల మధ్య సామాజిక పో రు ఎజెండాగా మారడం వంటి కారణాల మూ లంగా కరోనా, ఎండ ల కాలంలోనూ భారీగా పోలింగ్‌ నమోదైనట్లు స్పష్టమవుతోంది. 


టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ

పోలింగ్‌ సరళిని చూస్తే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భగత్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు స్పష్టమైంది. ఎవ రు గెలిచినా సాధారణ మెజారిటీతోనే బయటపడతారన్న చర్చ సాగుతోంది. అయితే గెలుపుపై ఈ ఇద్దరు వారివారి లెక్కలతో ఽధీమాగా ఉన్నారు. సంక్షేమ పథకాలు, డబ్బు పంపిణీ అధికార పార్టీకి సానుకూల అంశాలు కాగా, అభ్యర్థి స్థానికేతరుడు, రైతు రుణమాఫీ చేయకపోవడం, ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడం, స్థానిక నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో టీఆర్‌ఎస్‌ అంచనాలు అటుఇటుగా అయ్యాయన్న చర్చ అధికార పార్టీ నేతల మధ్య ఉంది. సైలెంట్‌ ఓటింగ్‌, గ్రామగ్రామాన పట్టు, జానా పెద్దాయన, క్లీన్‌చీట్‌ సానుకూల అంశాలు కాగా బలమైన నేతలు గులాబీ కండువా కప్పుకోవడం, కొత్తతరం ఓటర్లతో కాంగ్రెస్‌ అభ్యర్థి, పార్టీ నేతలకు లింక్‌ లేకపోవడం, ఆర్థిక అంశాల్లో అధికార పార్టీని నిలువరించలేకపోవడం ప్రతికూలంగా పనిచేసినట్లు స్పష్టమవుతోంది. బీజేపి విషయానికొస్తే యువత కొంత మొగ్గుచూపడం, అభ్యర్థి సామాజిక వర్గం ఓట్లు సానుకూల అంశాలు కాగా గ్రామగ్రామన అభ్యర్థి పార్టీకి కొత్త, పార్టీకి స్థానికంగా క్యాడర్‌ లేకపోవడం, ఆర్థిక వనరుల విషయంలో బాగా వెనుకబాటు ప్రతికూలంగా మారినట్లు చర్చ సాగుతోంది. ఈ నియోజకవర్గం చరిత్ర చూస్తే ఎప్పడు కూడా పోలింగ్‌ శాతం భారీగానే ఉంటుంది. గెలిచిన అభ్యర్థి మెజారిటీ రెండు సార్లు మినహా అన్ని సందర్భాల్లోనూ 15వేల లోపే మెజారిటీలు వచ్చాయి. 


నేతలకు అగ్ని పరీక్షలా ఉప ఎన్నిక  

నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక ప్రధాన పార్టీల నేతలకు అగ్నిపరీక్ష లా మారింది. అందరికీ ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంకావడంతో గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి నేత వరకూ ప్రచారంలో పాల్గొన్నా రు. ఓటర్ల మనసు దోచుకునేందుకు అన్ని విధాల శ్రమించారు. కొందరు టీఆర్‌ఎస్‌ నేతలైతే మూడు నెలలుగా సాగర్‌ నియోజకవర్గంలోనే మకాంవేశారు. నోముల నర్సింహయ్య హఠాన్మరణం, అప్పటికే తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌కు ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు, దాంతోపాటే సాగర్‌ ఉప ఎన్నిక ఉంటుందని ప్రచారం మొదలైంది. దీంతో నర్సింహయ్య డిసెంబరు మొదటి వారంలో మృతి చెందగా, ఆయన చనిపోయిన మూడో రో జు నుంచే టీఆర్‌ఎస్‌ నేతలు ఉప ఎన్నిక పనిలోకి దిగారు. పట్టభద్రు ల ఎమ్మెల్సీ ఎన్నిక రావడం, ఉప ఎన్నికకు కూడా పనికొస్తుందన్న అంచనాతో ఆ పనిని సాగర్‌లో ఉధృతంగా చేశారు. మార్చి మొదటి తేదీ నుంచి మండలాల వారీగా ఇన్‌ఛార్జులు పనిచేయడం ప్రారంభించారు. కాగా కాంగ్రె స్‌, బీజేపీ నేతలు గత 15రోజులుగా పూర్తిస్థాయిలో పని చేశారు. 40 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధిస్తామని సీఎం కేసీఆర్‌ తమ నేతలతో స్పష్టం చేయగా, గ్రౌండ్‌ రిపోర్టు అందుకు భిన్నంగా ఉండటంతో అధికార పార్టీ నేతలు తల లు పట్టుకుంటున్నారు. గ్రామాలు, సామాజిక వర్గాలవారీగా లెక్కలు తీస్తూ తమ అంచనాలు ఎక్కడ తప్పాయి, అనుకున్న మెజారిటీ ఎందుకు రావడం లేదు అన్న మేథోమథనంలో పడిపోయా రు. జానారెడ్డి నిశ్మబ్ధ యుద్ధం, నియోజకవర్గ ఓటర్ల నుంచి అనుకున్న దానికన్నా మంచి స్పందన లభించింది. సైలెంట్‌ ఓటింగ్‌ మాకే ఉంది, రేపు ఫలితాల్లో కనబడుతుందని కాంగ్రెస్‌ నేతలు బల్లలు గుద్దుతున్నారు. గిరిజన సామాజిక వర్గం, అన్ని వర్గాలకు చెందిన యువత నుంచి మంచి పోలింగ్‌ తమ అభ్యర్థికి వచ్చిందని, బీజేపీ నేతలు లెక్కలు వేస్తున్నారు. రూ.వందల కోట్ల ఖర్చు, నెలరోజుల పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది నాయకులు, కార్యకర్తలు సాగర్‌ నియోజకవర్గ గల్లీల్లో, పల్లెల్లో మకాంవేశారు. పోలింగ్‌ సరళిపై భిన్న కథనాలు వినిపిస్తుండటం, చర్చోపచర్చలు జరగడం, చివరకు పెట్టెలు విప్పితే కాని అసలు కథ బయటపడుతుందని ఒకరకి ఒకరు ఓదార్చుకోవడం అంతటా కనిపిస్తోంది. బాక్సులు తెరవాలంటే మరో 15 రోజులు వేచి చూడాల్సిందే అప్పటి దాకా వేసిన లెక్కలే వేయడం, కాగితాలు చింపడం, కౌంటింగ్‌కు ఇంకా ఎన్నిరోజులు అని ప్రతి రోజు క్యాలెండర్లు చూసుకోవడం తప్పదు. చర్చలు ముదిరి సవాళ్లుగా రాబోయే రెండు మూడు రోజుల్లో బెట్టింగ్‌ల అంశమూ తెరపైకి రావడం ఖాయం. 


నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్‌

సమయం శాతం

9గంటలకు 6.3

11 31

1 53

3 69

5 81

7 86.8

Updated Date - 2021-04-18T06:58:47+05:30 IST