ఒకరికే కాదు, ప్రాధాన్యతా క్రమంలో ఓటేయండి!

ABN , First Publish Date - 2021-03-09T06:57:42+05:30 IST

ప్రపంచ అత్యుత్తమ మేధావిగా కీర్తి గడించిన డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ నాయకత్వంలో ఆనాటి చట్టాలు, సాంఘిక, ఆర్థిక, సామాజిక రంగాలలో...

ఒకరికే కాదు, ప్రాధాన్యతా క్రమంలో ఓటేయండి!

ప్రపంచ అత్యుత్తమ మేధావిగా కీర్తి గడించిన డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ నాయకత్వంలో ఆనాటి చట్టాలు, సాంఘిక, ఆర్థిక, సామాజిక రంగాలలో విశేష పరిజ్ఞానమున్న మేధావులు సభ్యులుగా ఏర్పాటు చేసిన కమిటీ వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి, మధించి, ఆకళింపు చేసుకుని, కాచి వడబోసి మనకు అందించిన రాజ్యాంగంలోని వినూత్న మేధో ఆవిష్కరణే ఈ శాసనమండలి.


శాసనమండలి సభ్యులను ఎన్నుకునే ఓటర్లు మామూలు ప్రజలు కాదు. (1) ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు- సర్పంచ్‌ నుంచి ఎమ్మెల్యే, ఎంపి, మంత్రుల వరకు; (2) దేశ పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయ, అధ్యాపక వర్గాలు; (3) వివిధ రంగాలలో విశేష కృషి చేస్తూ దేశ అభ్యున్నతికి పాటుపడుతున్న ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు, పారిశ్రామిక వేత్తలు, ఏ రంగంలోనైనా కనీస విద్యార్హత గ్రాడ్యుయేషన్‌ ఉండి, ఓటరుగా నమోదు చేసుకున్నవారు.


శాసనమండలి సభ్యులను ఈ మూడు వర్గాలు ఎన్నుకుంటారు. వీరే కాకుండా వివిధ రంగాల విశిష్టులను, సామాజిక సేవా తత్పరులను రాష్ట్ర గవర్నర్‌ నియమిస్తారు. 


సాధారణ ఎన్నికలలో ఎవరో ఒక అభ్యర్థికి మాత్రమే ఓటువేసి ఒక్క అభ్యర్థినే, ఒక్క ఆలోచనను మాత్రమే బలపరచగలం. సాపేక్ష నిర్ణయాలను తెలియజేయలేం. ఈ అవకాశం అభ్యర్థులను ప్రాధాన్యతా క్రమంలో ఎన్నుకోవడం ద్వారా పొందుపరచబడింది. దీనివల్ల వివిధ రాజకీయాలకు, ఆలోచనలకు ఎంత సపోర్ట్‌ ఉంది అనే విషయం తెలుసుకొని, ఈ ఆలోచనాపరులు, ఆ ఆలోచనలను పెంపొందించుకునే దిశా నిర్దేశాలను నిర్ణయించుకునే వీలు కలుగజేస్తుంది.


సాధారణ ఎన్నికలలో చెల్లిన ఓట్లను అభ్యర్థుల పరంగా లెక్కించి ఎవరికి ఎక్కువ ఓట్లు లభించాయో వారిని విజేతగా నిర్ణయిస్తారు. ఆ లభించిన ఓట్లు చెల్లిన ఓట్లలో ఎంత శాతం ఉన్నా ఫలితంపై ప్రభావం చూపదు. ఎన్నో సందర్భాల్లో విజేతకు 20 నుంచి 30 శాతం మాత్రమే వచ్చిన సందర్భాలున్నాయి. కాని ఈ మండలి ఎన్నికలలో చెల్లిన ఓట్లలో 50 శాతం ప్లస్‌ ఒకటి వస్తేనే విజేతగా నిర్ణయిస్తారు. ముందుగా అందరి మొదటి ప్రాధాన్యతా ఓట్లను లెక్కించి, ఎవరికి కోటా అంటే (50 శాతం + 1) రానట్లయితే, తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని తొలగించి అతని రెండో ప్రాధాన్యత ఓట్లను పరిగణనలోకి తీసుకుని మిగిలిన అభ్యర్థుల ఓట్లకు కలుపుతారు. ఎవరికి కోటా రాని పక్షంలో మళ్ళీ తక్కువ ఓట్లున్న అభ్యర్థిని తొలగించి, అతని తర్వాతి ప్రాధాన్యత ఓట్లను మిగిలిన అభ్యర్థులకు కలుపుతారు. ఈ ప్రక్రియ ఎవరైనా కోటా దాటే వరకు సాగుతుంది. ఈ కోటా దాటిన అభ్యర్థిని విజేతగా నిర్ణయిస్తారు.


ఓట్ల విభజన విజేత నిర్ణయాన్ని మార్చదు. సాధారణ ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు పెద్ద పార్టీలకు వ్యతిరేకంగా చిన్న పార్టీల ఐక్య సంఘటన కట్టి పెద్ద పార్టీని ఓడిస్తాయి. అలాకాక చిన్న పార్టీలు వేరువేరుగా పోటీచేస్తే ఓట్లు చీలిపోయి పెద్ద పార్టీ గెలుస్తుంది. కాని ఈ ఎన్నికలలో అలా జరగదు. ఈ ప్రక్రియను క్రింది ఉదాహరణ ద్వారా క్తుప్తంగా వివరిస్తాను.


మొత్తం పోలైన ఓట్లు - 5000 అనుకోండి. అందులో చెల్లనివి - 500 అయితే, చెల్లిన ఓట్లు - 4,500. ఇందులో గెలవడానికి కావలసిన ఓట్ల కోటా : 4500/2 + 1 అంటే 2,251 ఓట్లన్నమాట.


మొదటి రౌండులో అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఇలా ఉన్నాయనుకొందాం. అ 500, ఆ - 1000, ఇ - 800, ఈ - 700, ఉ - 900, ఊ - 600. సాధారణ ఎన్నికలలో అయితే ఆ ని విజేతగా నిర్ణయిస్తారు. కాని ఆ కి కోటా రాలేదు. కాబట్టి తొలగింపు ప్రక్రియ మొదలు పెడతారు. తక్కువ ఓట్లు వచ్చిన అ ను తొలగిస్తారు. అతని రెండో ప్రాధాన్యత ఓట్లను మిగిలిన వారికి పంచుతారు. ఎవరైనా రెండో ప్రాధాన్యతా ఓటు వేయకుంటే ఆ ఓటు చెల్లదు.


రెండో రౌండులో అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఇలా ఉన్నాయనుకొందాం.. ఆ - 1100, ఇ - 850, ఈ - 900, ఉ - 910, ఊ - 700, చెల్లనివి - 40. ఈ రౌండులో కూడా కోటా ఎవరికీ రాలేదు. కాబట్టి తక్కువ ఓట్లు వచ్చిన ఊ ని తొలగిస్తారు.


మూడో రౌండులో అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఇలా ఉన్నాయనుకొందాం... ఆ- 1310, ఇ - 910, ఈ - 1260, ఉ - 930. ఈ రౌండులో కూడా కోటా ఎవరికీ రాలేదు. కాబట్టి తక్కువ ఓట్లు వచ్చిన ఇ ని తొలగిస్తారు.


నాలుగో రౌండులో అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఇలా ఉన్నాయనుకొందాం... ఆ - 1530, ఈ - 1810, ఉ - 930. ఈ రౌండులో కూడా కోటా ఎవరికీ రాలేదు. కాబట్టి తక్కువ ఓట్లు వచ్చిన ఉ ని తొలగిస్తారు.


ఐదో రౌండులో అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఇలా ఉన్నాయనుకొందాం... ఆ - 1840, ఈ - 2260. ఈ కోటా 2251 దాటాడు కాబట్టి ఈ విజేత. మొదటి రౌండ్‌లో నాలుగవ స్థానంలో ఉన్న ఈ ని విజయం వరించింది. ఓట్ల విభజన ఏమాత్రం ప్రభావం చూపలేదు.


మనిషి పుట్టుకతో ఒక కులం, మతం బంధాలలో, వివిధ దశల్లో వివిధ ప్రయాణాలు, వివిధ అనుబంధాలతో సాగుతుంటాడు. విద్యార్థిగా - క్లాసుమేట్లు, విద్యార్థి ఉద్యమ సామాజిక రాజకీయ ప్రభావాలు. ఉద్యోగిగా - తోటి ఉద్యోగులు, ఉద్యోగ హక్కుల సాధన సమ్మెలు. సంఘజీవిగా వివిధ రాజకీయ ప్రభావాలు, మార్క్సజం, అంబేడ్కరిజం, బౌద్ధం, ఉవ్వెత్తున లేచే ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు వంటి అన్నీ లేదా కొన్ని మనిషిని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఈ అనుబంధాల అభ్యర్థులు పోటీ చేస్తున్నప్పుడు ఒకరి కంటే ఎక్కువ మందిని బలపరచాల్సిన అగత్యం ఉంటుంది. తెలివిగా ఆలోచించి తక్కువ ఓట్లు వచ్చే సూచనలున్న వారికి ప్రాధాన్యత ఇస్తూ ఓటేస్తే మన ఓటు ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది.


పై ఉదాహరణలో రెండో రౌండ్‌లో అ రెండో ప్రాధాన్యతా ఓట్లు, మూడో రౌండ్‌లో ఊ రెండో ప్రాధాన్యతా ఓట్లు, అ మూడో ప్రాధాన్యతా ఓట్లు, నాల్గో రౌండ్‌లో ఇ రెండో ప్రాధాన్యత ఓట్లు, ఊ మూడో ప్రాధాన్యత ఓట్లు, అ నాల్గో ప్రాధాన్యత ఓట్లు, ఆఖరి రౌండ్‌లో ఉ రెండో ప్రాధాన్యత, ఊ మూడో ప్రాధాన్యత, అ ఐదో ప్రాధాన్యత ఓట్లు పరిగణింపబడ్డాయి. తెలివిగా అ - 1, ఊ - 2, ఇ - 3, ఈ - 4గా ఓటేస్తే నలుగురిని బలపరచడంతో పాటు ఈ విజయంలో మన ఓటు పాలుపంచుకుంటుంది. అందుకే అందరికీ ప్రాధాన్యతా క్రమంలో ఓటేయండి. 


ఒకరికే ఓటు వేయడం అవివేక చర్య. అందుకే మేధావుల సభ ఎన్నిక - మేధావుల ఎన్నికే.

డా. ఎ. వినయబాబు

రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, జెఎన్‌టియు

Updated Date - 2021-03-09T06:57:42+05:30 IST