Abn logo
Apr 20 2021 @ 23:57PM

మన్యంలో వలంటీర్ల సేవలు భేష్‌

గ్రామ వలంటీర్‌కు పురస్కారాన్ని అందజేస్తున్న జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌

కలెక్టర్‌ వినయ్‌చంద్‌

‘పాడేరు’ ఉత్తమ వలంటీర్లకు ఉగాది పురస్కారాలు ప్రదానం


చింతపల్లి, ఏప్రిల్‌ 20: ఏజెన్సీలో రహదారులు, ఇంటర్నెట్‌ వంటి సదుపాయాలు లేని ప్రాంతాల్లో కూడా గ్రామ వలంటీర్లు సకాలంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ అన్నారు. మంగళవారం ఇక్కడ జరిగిన పాడేరు నియోజకవర్గం గ్రామవలంటీర్ల ఉగాది పురస్కారాల సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, అవార్డులు అందుకున్న వలంటీర్లు మరింత ఉత్సాహంతో ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి మాట్లాడుతూ, పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించినందున వలంటీర్లు వీలైతే తమ పరిధిలోని పిల్లలకు పాఠాలు నేర్పేందుకు కృషిచేస్తే మంచిదన్నారు. పాడేరు ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, సాంకేతిక కారణాల వల్ల శివారు గ్రామాల ప్రజలు సకాలంలో ధ్రువపత్రాలు పొందలేకపోతున్నారని, ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. అనంతరం 1,448 మందికి సేవామిత్ర, 25 మందికి సేవారత్న, ఐదుగురుకి సేవా వజ్ర పురస్కారాలను కలెక్టర్‌ అందజేశారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌, జేసీ-2 అరుణ్‌బాబు, నర్సీపట్నం సబ్‌కలెక్టర్‌ మౌర్య, చింతపల్లి ఏఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు, ఏఎంసీ చైర్‌పర్సన్‌ జల్లి హలియారాణి, సర్పంచ్‌ దురియా పుష్పలత, ప్రత్యేక అధికారి రవీంద్రనాథ్‌, ఎంపీడీవో లాలం సీతయ్య, ఏటీడబ్ల్యువో చంద్రశేఖరరావు, తదితరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement
Advertisement