ఎన్నికల విధుల్లో వలంటీర్లు!

ABN , First Publish Date - 2022-09-27T07:05:09+05:30 IST

ఎన్నికలకు సంబంధించిన విధులకు దూరంగా వుండాలన్న ఆదేశాలను వలంటీర్లు బేఖాతరు చేస్తున్నారు.

ఎన్నికల విధుల్లో వలంటీర్లు!

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు బేఖాతరు

ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానంలో కీలకంగా వ్యవహరిస్తున్న వైనం

తమ పరిధిలో గల ఇళ్ల నుంచి ఫారం 6-బి ఫారాలు సేకరణ

పట్టభద్ర ఎమ్మెల్సీ ఓటర్ల నమోదులోనూ వారిదే హవా

ఇంటింటికీ ఓటరు నమోదు ఫారాలు పంపిణీ

పురమాయిస్తున్నది వైసీపీ నేతలే

చోద్యం చూస్తున్న అధికారులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


ఎన్నికలకు సంబంధించిన విధులకు దూరంగా వుండాలన్న ఆదేశాలను వలంటీర్లు బేఖాతరు చేస్తున్నారు. ఏం చేస్తారో...చేస్కోండన్నట్టు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఓటర్‌ కార్డుకు ఆధార్‌ అనుసంధానం (ఫారం 6-బి), ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదులో వలంటీర్లే కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ రెండు కార్యక్రమాల్లో వలంటీర్లు చురుగ్గా పాల్గొంటున్నట్టు తెలిసినా...సచివాలయ, రెవెన్యూ, మునిసిపల్‌ ఉద్యోగులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఓటర్‌ కార్డుతో ఆధార్‌ అనుసంధానం ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం గత నెల ఒకటో తేదీన శ్రీకారం చుట్టింది.  ఇందుకు వచ్చే మార్చి వరకూ గడువిచ్చింది. దీనివల్ల డూప్లికేషన్‌ (రెండు, అంతకంటే ఎక్కువచోట్ల ఓట్లు కలిగివుండడం) సమస్యను పరిష్కరించవచ్చునన్నది ఎన్నికల సంఘం ఉద్దేశం. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా జిల్లా ఎన్నికల అధికారి నేతృత్వంలో రెవెన్యూ, మునిసిపల్‌ అధికారులు ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధాన ప్రక్రియను చేపట్టారు. ప్రస్తుతం సచివాలయంలో పనిచేసే కొందరు ఉద్యోగులను ఇందుకోసం క్షేత్రస్థాయిలో బూత్‌ లెవెల్‌ అధికారులు (బీఎల్‌వో)గా నియమించారు. ప్రత్యేక క్యాంపులు ఏర్పాటుచేసిన రోజున బీఎల్‌వోలు అక్కడ ఉంటున్నారు. మిగిలిన రోజుల్లో సచివాలయంలో ఫారాలు స్వీకరిస్తున్నారు. ఇంకా తహసీల్దార్‌, మునిసిపల్‌ కార్యాలయాల్లో ఓటరు కార్డు-ఆధార్‌ అనుసంధానానికి అవకాశం కల్పించారు. ప్రతి బీఎల్‌వో పరిధిలో సగటున 1,500 నుంచి రెండు వేల మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్‌ కార్డుతో ఆఽధార్‌ అనుసంధానానికి 6-బీ ఫారం పూరించి, సంతకం చేసి ఫోన్‌ నంబరు/ఈ మెయిల్‌ అడ్రస్‌ పేర్కొనాలి. ఇంకాఏదైనా ఒక గుర్తింపు కార్డు కాపీ జత చేసి బీఎల్‌వో/తహసీల్దారు/మునిసిపల్‌ జోనల్‌ కార్యాలయాల్లో అందజేయాలి. ఆన్‌లైన్‌లో కూడా అనుసంధానం పూర్తిచేసుకోవచ్చు. కొందరు ఓటర్లు స్వచ్ఛందంగా బీఎల్‌వో వుండే సచివాలయాలకు వెళ్లి ఫారం 6-బీని అందజేస్తున్నారు. సచివాలయాలకు రాని ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఫారం 6-బీని తీసుకోవడం బీఎల్‌వోలకు సాధ్యం కాదు. దీనిని గమనించిన  అధికార పార్టీ నేతలు...వలంటీర్లను రంగంలోకి దింపారు. ఎవరికి వారు తమ పరిధిలో గల ఇళ్ల నుంచి 6-బీ ఫారాలు సేకరించి బీఎల్‌వోలకు అప్పగించాలని పురమాయించారు. ఓటర్ల నుంచి 6-బీ ఫారాలను వలంటీర్లు సేకరించి సచివాలయాలకు తీసుకువస్తుంటే బీఎల్‌వోలు మౌనం వహిస్తున్నారు తప్ప వారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వలంటీర్లు తమ పరిధిలో ఓటర్ల నుంచి 6-బీ ఫారాలు సేకరించినందునే విశాఖపట్నం జిల్లాలో 18.8 లక్షలకుగాను ఇప్పటివరకు 6.5 లక్షల మంది (35 శాతం) ఓటరు కార్డులకు ఆధార్‌తో అనుసంధానం జరిగిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. 

కాగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. ఈలోగా వలంటీర్లు తమ పరిధిలో ఇళ్లకు వెళ్లి పట్టభద్రుల వివరాలు తెలుసుకుని ఓటర్ల నమోదు ఫారాలు అందజేస్తున్నారు. ఈ రెండు అంశాల్లో ఎన్నికల సంఘం ఆదేశాలకు వ్యతిరేకంగా వలంటీర్లు పాల్గొంటున్నారు. అయినప్పటికీ జిల్లాలో ఎన్నికల విధులతో సంబంధం వున్న అధికారులు స్పందించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బూత్‌ లెవెల్‌ అధికారులను పర్యవేక్షించే రెవెన్యూ అధికారులు కూడా వలంటీర్లను వారించే ప్రయత్నం చేయడం లేదని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఏదో విధంగా ఓటరు కార్డుతో ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ జరుగుతుందని భావిస్తున్నారని రెవెన్యూ ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ఎన్నికల విధుల్లో వలంటీర్లు పాలుపంచుకోవడంపై విపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ఇంటి వద్దకే సేవలు పేరు చెప్పి...ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అందువల్ల వారి జోక్యానికి అడ్డుకట్ట వేయాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ప్రజా సంఘాలకు చెందిన ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-09-27T07:05:09+05:30 IST