కష్టకాలంలో వాలంటీర్ల చేయూత

ABN , First Publish Date - 2020-04-01T06:06:29+05:30 IST

దేశంలో కరోనావైరస్‌ సృష్టించిన సంక్షోభంలో ముందు నిలబడి సేవాగుణాన్ని చాటుకుంటున్నారు అనేకమంది యువకులు. ఆపత్కాలంలో నలుగురికి సేవ...

కష్టకాలంలో వాలంటీర్ల చేయూత

లాక్‌డౌన్‌లో ముందుకు వస్తున్న యువత


న్యూఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, మార్చి 31: దేశంలో కరోనావైరస్‌ సృష్టించిన సంక్షోభంలో ముందు నిలబడి సేవాగుణాన్ని చాటుకుంటున్నారు అనేకమంది యువకులు. ఆపత్కాలంలో నలుగురికి సేవ చేయాలనే తలంపుతో తమకు తాము వాలంటీర్‌ గ్రూపులుగా ఏర్పడుతున్నారు. పెద్దవారికి ఆహారం అందించడం దగ్గర్నుంచి, రోగులకు సకాలంలో మందులు చేరేలా చూడటం, నిత్యావసరాలు అందేలా తోడ్పడటం, ఇంటర్నెట్‌లో వచ్చే ఫేక్‌ న్యూస్‌కు వ్యతిరేకంగా పోరాడటం వరకు వివిధ మార్గాల్లో సేవలందిస్తున్నారు. సేవాభావంతో ఇలా చేతులు కలుపుతున్న వారిలో విద్యార్థులు, ఉద్యోగులు, సీనియర్‌ సిటిజెన్లు, నిరుద్యోగులతోపాటు ట్రాన్స్‌జెండర్లు కూడా ఉన్నారు.


భోపాల్‌కు చెందిన ఇంజనీరింగ్‌ డ్రాపవుట్‌ విపిన్‌ త్రిపాఠి తన కంపెనీ ద్వారా విద్యార్థుల కోసం ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తుంటాడు. దీనివల్ల దాదాపు 25 లక్షల విద్యార్థుల సమాచారం అతని దగ్గరుంది. వారందరినీ కరోనా వాలంటీర్లుగా మార్చడానికి విపిన్‌ ప్రయత్నిస్తున్నాడు. ఆసక్తి ఉన్న విద్యార్థులు తమకు ఇష్టమున్న ప్రదేశాల్లో వాలంటీర్లుగా సేవలందించడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికి 11 వేల మంది వాలంటీర్లుగా చేరడానికి ఆసక్తిచూపడం విశేషం. వీరంతా లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి సేవలందించడంలో అధికార యంత్రాంగానికి సహాయపడతారు. గుడ్‌గావ్‌లోని ప్రముఖ బిజినెస్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ డెవల్‌పమెంట్‌ ఇనిస్టిట్యూట్‌కు చెందిన విద్యార్థులు క్రౌడ్‌సోర్సింగ్‌ పద్ధతిలో వాలంటీర్ల సమాచారాన్ని సేకరిస్తున్నారు. అత్యవసర సేవల కోసం ఏక్షణంలోనైనా వాలంటీర్ల అవసరం ఏర్పడినప్పుడు ఈ డేటాబే్‌సను ఉపయోగించనున్నారు. గుడ్‌గావ్‌లోనే సీనియర్‌ సిటిజన్లు కూడా తమ వంతుగా 100 మంది కలిసి వాలంటీర్‌ గ్రూప్‌గా ఏర్పడ్డారు. పాస్‌లు తీసుకొని సేవలందించడానికి సిద్ధమవుతున్నారు.


మరోవైపు నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ వెబ్‌సైట్‌ ద్వారా ఇప్పటివరకు 27 వేలమంది వాలంటీర్లుగా పనిచేయడానికి వివరాలు నమోదు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్‌ ఝడజౌఠి.జీుఽ ద్వారా కూడా వాలంటీర్‌గా నమోదు చేసుకోవచ్చు. దీనిద్వారా ఇప్పటివరకు 89 వేల మంది తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. కోల్‌కతాలో ట్రాన్స్‌జెండర్లు కూడా మాస్కులు ధరించి తమ వంతుగా నిరాశ్రయులకు ఆహారం, ఇతర నిత్యావసరాలను చేరవేస్తున్నారు. అయితే బెంగళూరులో ట్రాన్స్‌జెండర్లు లాక్‌డౌన్‌ వల్ల తమకు బతకడం కష్టంగా మారిందంటున్నారు. ఇతర పేదవర్గాలకు మాదిరిగానే తమకు కూడా ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నారు.

Updated Date - 2020-04-01T06:06:29+05:30 IST