బరితెగిస్తున్నారు..!

ABN , First Publish Date - 2020-09-27T08:39:52+05:30 IST

సి.బెళగల్‌లోని సచివాలయంలో పనిచేసే శేఖర్‌ అనే వలంటీర్‌ స్థానిక మహిళపై కన్నేశారు. అర్ధరాత్రి ఫోన్లు చేసి వేధిస్తుండటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయుంచింది...

బరితెగిస్తున్నారు..!

మహిళలపై కొందరు వలంటీర్ల వేధింపులు

ఫిర్యాదు చేస్తే అంతు చూస్తామని బెదిరింపు

పోలీసులపై అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లు

సి.బెళగల్‌ ఘటనలో ఇద్దరి పేర్ల తొలగింపు


కర్నూలు, ఆంధ్రజ్యోతి: సి.బెళగల్‌లోని సచివాలయంలో పనిచేసే శేఖర్‌ అనే వలంటీర్‌ స్థానిక మహిళపై కన్నేశారు. అర్ధరాత్రి ఫోన్లు చేసి వేధిస్తుండటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయుంచింది. కానీ పోలీసులు కేసు నమోదులో తాత్సారం చేశారు. వలంటీరుకు అధికారపార్టీలో మండల స్థాయి నాయకుడైన అతని మామ అండదండలతో కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు కేసు నమోదు చేసినా బాధితురాలిపై మాత్రం బెదిరింపులు ఆగడంలేదు. కేసు వెనక్కు తీసుకోవాలని ఆ నాయకుడు, బంధువులు భయపెడుతున్నట్లు సమాచారం. 

-రెండు రోజుల క్రితం చోటుచేసుకున్న ఘటన ఇది.


తోటి మహిళా వలంటీర్‌నే వేధింపులకు గురిచేస్తూ, అసభ్యంగా ప్రవర్తించిన కేసు పగిడ్యాల మండలంలో నమోదైంది. అరవిందరెడ్డి, నాగ శేషుతో పాటు స్నేహితులు అబ్దుల్లా, నాయుడు అనే మరో ఇద్దరిపై పగిడ్యాల పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదైంది. కొద్ది రోజులకే బెయిల్‌పై బయటకు వచ్చి ఆ వలంటీర్లు తిరిగి విధుల్లో కొనసాగుతున్నారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే అధికారులు తిరిగి విధుల్లోకి తీసుకున్నట్లు తెలిసింది.

-2019 ఆఖరులో చోటుచేసుకున్న ఘటన ఇది


బండి ఆత్మకూరు మండలం బి.కోడూరు గ్రామంలో పనిచేసే దూదేకుల సుభాన్‌ అనే గ్రామ వలంటీర్‌ స్థానిక మహిళపై వేధింపులకు దిగారు. మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి వెళ్లి బలాత్కారానికి యత్నించారు. ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తానంటూ ప్రలోభ పెట్టారు. బాధితురాలు బండి ఆత్మకూరు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

- ఈ ఏడాది ఆగస్టు 28న జరిగిన ఘటన ఇది. 


ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేయాల్సిన కొందరు గ్రామ వలంటీర్లు బరి తెగిస్తున్నారు. మహిళలపై వేధింపులకు దిగుతున్నారు. జిల్లాలో ఇప్పటికే ఈ తరహా మూడు కేసులు నమోదయ్యాయి. పగిడ్యాల మండలంలో ఓ వలంటీరు వారం సబ్‌ జైల్లో ఉండి బెయిల్‌పై వచ్చారు. అయితే అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల కొద్దీ ఆ వ్యక్తిని అధికారులు తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారు. తాజాగా సి.బెళగల్‌ మండలంలో వెలుగులోకి వచ్చిన ఘటనలో అధికార పార్టీ నాయకులు బాధితురాలి ఇంట్లో కూర్చుని పంచాయితీ చేయడం గమనార్హం. తనను వేధిస్తున్న గ్రామ వలంటీర్‌ శేఖర్‌, అతని బంధువులపై బాధితురాలు గురువారం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో తప్పులున్నాయని, ఫోన్‌ నెంబర్లు సరిగా రాయలేదని సాకులు చూపుతూ ఆమెను మూడుసార్లు అధికారులు వెనక్కి పంపారు.


శుక్రవారం ఉదయం బాధితురాలి ఇంటికి అధికార పార్టీ స్థానిక నాయకుడు తన అనుచరులతో వచ్చి మధ్యాహ్నం వరకు కూర్చుని పంచాయితీ చేశారు. శేఖర్‌పై కేసు పెట్టకూడదని ఒత్తిడి తెచ్చారు. అయినా బాధితురాలు బెదరక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్‌ఐ రాజ కుళ్లాయప్ప ఆమెను స్టేషన్‌కు రావాలని చెప్పడంతో తల్లితో కలిసి బాధితురాలు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు వెళ్లింది. మూడున్నర గంటల పాటు పోలీసులు అక్కడే కూర్చోబెట్టి కేసు నీరుగార్చేందుకు యత్నించారని బాధితురాలు ఆరోపిస్తోంది. చివరకు ఎస్‌ఐ ఇద్దరి పేర్లను తొలగించి వలంటీరపై కేసు పెట్టారని తెలిపింది. ఆ ఇద్దరి పేర్లు చేర్చితే ప్రజాప్రతినిధి నుంచి ఒత్తిళ్లు వస్తాయన్న ఉద్దేశంతో వారిని పక్కన పెట్టారని బాధితురాలు పేర్కొంటోంది. శనివారం సాయంత్రం నుంచి ఆ నాయకుడి బంధువుల నుంచి కూడా బాధితురాలికి ఒత్తిళ్లు పెరిగాయి. ఆమె ఇంటికి వెళ్లి కేసు వెనక్కు తీసుకోకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని బెదిరించినట్లు సమాచారం. అయితే ఆధారాల ప్రకారమే వలంటీర్‌ శేఖర్‌పై కేసు నమోదు చేశామని, ఇతరుల పేర్లు చెప్పలేదని పోలీసులు చెబుతున్నారు. 


వలంటీర్‌ పేరే చెప్పారు 

బాధితురాలిని వేధిస్తున్నట్లుగా వచ్చిన ఫోన్‌ రికార్డులు విన్నాం. వాటి ఆధారంగా శేఖర్‌పై కేసు నమోదు చేశాం. అతని పేరు కాకుండా ఇంకెవరి పేర్లూ మాకు చెప్పలేదు. ఫిర్యాదులో ఇచ్చిన ప్రకారంగానే కేసు నమోదు చేశాం. 

-పార్ధసారథి రెడ్డి, సీఐ

Updated Date - 2020-09-27T08:39:52+05:30 IST