ఆ నలుగురు!

ABN , First Publish Date - 2020-07-01T11:44:30+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా విస్తరిస్తోంది. ఈ పరిస్థితుల్లో వైరస్‌ సోకిన వారితో

ఆ నలుగురు!

అంతిమయాత్రకు స్వచ్ఛంద సేవకులు

రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు


(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా విస్తరిస్తోంది. ఈ పరిస్థితుల్లో వైరస్‌ సోకిన వారితో పాటు అనారోగ్యంతో మృతిచెందిన వారి అంతమయాత్రకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైరస్‌ భయంతో అంతిమ సంస్కారాల నిర్వహణకు భయపడుతున్నారు. చివరకు అయినవారు సైతం దరిచేరడం లేదు. గత కొద్దిరోజులుగా ఇటువంటి ఘటనలే వెలుగుచూశాయి.


ఈ నేపథ్యంలో కలెక్టర్‌ నివాస్‌ ఆదేశాల మేరకు జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ స్వచ్ఛంద సేవలకులతో ప్రత్యేక విభాగాన్ని సిద్ధం చేసింది. ఎక్కడైనా మరణాలు సంభవిస్తే సమాచారం అందిస్తే సేవకులు అక్కడకు చేరుకొని అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.  ఈ విభాగంలో సేవలందించడానికి ఆసక్తి ఉన్న వారు 9603155418,  768083 1460 ఫోన్‌ నెంబర్లకు సంప్రదించి పేర్లు నమోదు చేయించుకోవాలని రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌ పి.జగన్మోహన్‌రావు తెలిపారు. కరోనాతో రోగి మృతి చెందిన రెండు గంటల తరువాత ఎటువంటి వైరస్‌ ఉండదని... ఇది గాలి ద్వారా వ్యాపించే వైరస్‌ కాదని గుర్తించాలని ఆయన తెలిపారు. స్వచ్ఛంద సేవకు యువతీ యువకులు ముందుకు రావాలిన ఆయన కోరారు.


జిల్లాలో పలాస, సోంపేట సంఘటనల తరువాత  కలెక్టర్‌ జె.నివాస్‌ ఇకముందు కరోనా మరణాలు ఎక్కడ సంభవించినా మానవతా దృక్ఫథంతో అంతిమ వీడ్కోలు పలికేందుకు ఏర్పాట్లు చేశారు. ఈమేరకు మండల రెవెన్యూ అధికారులకు అంతిమయాత్ర సందర్భంగా పాటించాల్సిన ప్రోటోకాల్‌ నియమావళిని పంపారు. ఇకముందు కుటుంబ సభ్యులకు, వలంటీర్లకు పీపీఈ కిట్లు అందజేస్తారు. వారితోనే ప్రత్యేక వాహనంలో  మృతదేహాన్ని శ్మశానానికి తరలించనున్నారు.


Updated Date - 2020-07-01T11:44:30+05:30 IST